14 ఏప్రిల్ 2026

ఒక దృక్పథం నుండి ప్రేమ, స్నేహం, ఆకర్షణ:

తానూ, నేనూ ఒకటే అనిపించటం ప్రేమ,
తానూ, నేనూ ఒకలాంటివాళ్ళం అనిపించటం స్నేహం,
తాను నాకు కావాలి అనిపించటం ఆకర్షణ

ప్రేమలో అహంకారాలు కరిగిపోయి, సన్నిధి మాత్రమే మిగులుతుంది. అపుడు తాను నా సమీపంలో ఉంటే చాలనిపిస్తుంది. దూరంగా ఉన్నా తనతోనే ఉన్నట్లనిపిస్తుంది. 

స్నేహంలో అహంకారాలు వెలుగునీడల్లా దోబూచులాడతాయి. కొంత ప్రేమ వెలుతురు ప్రసరించినా, కొంత ఆకర్షణ ఉన్నా, తాము సములం అనిపిస్తుందే గానీ, తానే నేను అనిపించకపోవచ్చు.

ఆకర్షణ (మోహం, ముదిరితే కామం) లో అహంకారాలు బలపడతాయి. తాను నాకే దక్కాలి అనిపిస్తుంది. దక్కకపోతే తనని నశింపచేయాలి అని కూడా అనిపిస్తుంది. నాకు పూర్తిగా లొంగి, నా మనో, దేహాలకి కావలసిన అనుభవాలు ఇస్తూ ఉండాలి అనిపిస్తుంది.

ప్రేమలో కొంత స్నేహం, కొంత ఆకర్షణ ఉంటాయి.
స్నేహంలో కొంత ప్రేమ, కొంత ఆకర్షణ ఉంటాయి. 
ఉత్త ఆకర్షణలో ప్రేమ, స్నేహం ఉన్నట్లు కనిపిస్తాయి కానీ ఉండవు. ఉండలేవు. 

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి