01 నవంబర్ 2026

కవిత : కానుగ చెట్టు

ముప్పై ఏళ్ళకి పైగా 
ఇంటి పక్కన ఆకుల తలలూపుతూ
జీవితాన్ని ఎలా నిటారుగా నిలిచి జీవించాలో
నిశ్శబ్దంగా బోధించిన చెట్టు 
మొన్న తుపానురాత్రి నేలకి ఒరిగిపోయింది

ఇన్నాళ్ళూ మా సుఖదుఃఖాలలో
నేపథ్యంగా నిలిచిన చెట్టు,
నీడలు పరిచిన చెట్టు,
గాలుల అలలతో మమ్మల్ని నిమిరిన చెట్టు 
ఒరిగిపోవటం చూసి
మా చిన్నమ్మాయి కన్నీరు మున్నీరైంది,
మా నాన్న వెళ్ళిపోయినప్పటిలానే

వీధిలో నిద్రిస్తున్న ఏనుగులా పడుకొన్న 
చెట్టుపై చేయి ఉంచి, 
చెట్టుపై తలవాల్చిన బిడ్డతో అన్నాను
చైతన్యం తదుపరి ప్రయాణంలో ఉన్నపుడు
మనం ఆపకూడదమ్మా..
పెద్దమ్మాయి ఫోనులో అంది 
కానుగ చెట్టు వందేళ్లు బ్రతుకుతుంది నాన్నా..

తెల్లవారింది, బిడ్డ ఊరిపెద్దలతో మాట్లాడింది
ఇళ్ళ మధ్య ఇక బ్రతకలేదని ఆలోచించాక 
ఊరి గ్రంథాలయానికి తరలించింది
బహుశా, అక్కడ ఆ మహాకాయం నిలదొక్కుకొంటుంది 
కొత్త కొమ్మలనీ, ఆకులనీ, గాలులనీ 
తన ప్రేమలానే, ఓదార్పులానే లోకంలోకి పరుస్తుంది 

పుస్తకాల్లోంచి చదువరుల మనసుల్లోకి 
చొరబడే ఊహలతో, కాంతులతో పాటు
తన నీడల్నీ, గాలుల్నీ ప్రవేశపెట్టి
లోకాలని కాసేపు శాంతిమయం చేస్తుంది

బివివి ప్రసాద్