30 అక్టోబర్ 2026

కవిత : నీతో నువు..

నీతో నువు ఉన్నపుడైనా
నీకు స్వేచ్ఛ ఇస్తున్నావా
లేక, బానిసలా చూస్తున్నావా

సమాజాన్ని దాటి, 
సమాజం భయాన్నీ, హింసనీ దాటి,
కట్టుబాట్ల గానుగెద్దు బతుకు దాటి,
మర్యాదల బానిసత్వం దాటి,
ఆదర్శాల, నాయకత్వాల భ్రమలు దాటి,
ఎవరేమనుకుంటే ఏమనే చిత్తభ్రమలు దాటి

ఉత్త నేనుగా 
ఖాళీ ఆకాశం లాంటి, గాలి లాంటి
ఖాళీ జ్వాల లాంటి, జలం లాంటి
ఉత్త పేరు లేని, వ్యక్తి లేని 
గత, భవితల మరకలు లేని 
స్వచ్ఛమైన నేనుగా
నిన్ను నువు చూడగలుగుతున్నావా

నీతో నువు ఉన్నప్పడైనా
ఆకాశం ఆకాశంతో నిండినట్లు
గాలి గాలితో, జ్వాల జ్వాలతో, 
నీరు నీటితో నిండినట్లు
నీతో మాత్రమే నువు నిండగలుగుతున్నావా

నిండుగా పొరలి పొంగి
నువు లేకపోవటంలోకి
నీకు స్వేచ్ఛ ఇవ్వగలుగుతున్నావా,
ఏమీ కాకుండా మిగలగలుగుతున్నావా

12.3.26 11.21 రాత్రి

29 అక్టోబర్ 2026

కవిత : కాలం గడవాలి ..

కాలం గడవటం ముఖ్యం
బాల్యం నుండి ఈనాటి వరకూ..

నక్షత్రకాంతి నింగి నుండి దూకబోవటం,
పూలరంగులు భూమి నుండి ఎగరబోవటం ముఖ్యం
సూర్యకాంతి పగలల్లా ప్రపంచం మీద ఆడుకోవటం,
చంద్రకాంతి చీకటితో దాగుడుమూతలు ఆడటం ముఖ్యం

నదులు ప్రవహించటం, పిట్టలు పాడటం
చెట్లు ఎదగటం, జీవులు నడవటం ముఖ్యం

కాలమిలా గడుస్తుంది
ఇంద్రధనువు వచ్చి, వెళ్ళినట్టు,
పూలు పూచి, రాలినట్టు,
నువ్వూ, నేనూ చిరునవ్వో, కన్నీరో రాల్చినట్టు

యుగాలు మాయమవుతాయి
గగనంలోని ఇంద్రధనువులా,
గాలిలో కరిగిన పిట్టకూతలా ,
కాలంలో మునిగిన గాయాల్లా, బాధల్లా, భయాల్లా

మాయమవుతున్న యుగాలని
చూస్తూ, ప్రేమిస్తూ, నిర్వేదిస్తూ
నువు మాత్రం మిగులుతావు
తారలు రాలిపోయాక మిగిలిన ఒంటరి గగనంలా

బహుశా, ఎప్పటికీ
బహుశా, కాలం లేని దేశంలో

బివివి ప్రసాద్
ప్రచురణ : సారంగ, 15.10.26

25 అక్టోబర్ 2026

కవిత : పదాలూ - అనుభవమూ

కొన్ని అక్షరాల మధ్య, 
లేదా పదాల మధ్య ఇరుక్కుంటాం
తేనెపట్టులో ఇరుక్కున్న తేనెటీగల్లా 
పుట్టగదుల్లో ఇరుక్కున్న చీమల్లా

వంశం నుండి దేశం వరకూ,
నమ్మకం నుండి సిద్ధాంతం వరకూ
పదాల మధ్య ఇరుక్కుని
కాలం గడుపుతూ ఉంటాం

సూర్యకాంతుల్నీ, పూల రంగుల్నీ,
పసిబాలల నవ్వుల్నీ, పసిడివన్నె జీవనానందాల్నీ 
గాలికి వదిలి, ధూళికి విడిచి

కేవలం పదాలు, కేవలం శబ్దాలు
అవి రేపే ఇరుకిరుకు ఉద్వేగాలు,
ఉద్వేగాల్లో ఊపిరి పోసుకునే నేనులు

శబ్దాలనీ, పదాలనీ
గాలికి వదిలి, ధూళికి విడిచి
జీవించటంలోకి రమ్మని కవి అడుగుతాడు

ఆకాశం శబ్దం కాదు, అనుభవం
భూమి శబ్దం కాదు, అనుభవం
గాలీ, జ్వాలా, నీరూ అనుభవాలు
మౌనంగా అనుభవించు,
నీ లోపలి నిన్ను వెదుక్కొంటూ,
నీ లోపలి నిన్ను పోల్చుకుంటూ అంటాడు

విన్నవారు, కాసేపు వెన్నెలలో ఆడుకుంటారు
వినలేనివారు గాఢనిద్రలోకి జారుకుంటారు

బివివి ప్రసాద్

24 అక్టోబర్ 2026

కవిత : తెలియని సమయం

ఈ లోకంలో నీకేమి నచ్చలేదు అంటారెవరో

మనుషులు అంటావు, నిన్నూ కలుపుకొంటూనే
వాళ్ళ ప్రేమలు, వాటి వెనుక భయాలు,
వాటి వెనుక చీకటి నిండిన నేనూ, నాది లు 
చీకటిలో తిరుగాడే క్రౌర్యాలు, హీనత్వాలు

నీకేమి నచ్చాయి లోకంలో అంటారు

శబ్దాలు, దృశ్యాలు, స్పర్శలు,  
సమస్త సంవేదనలు అంటావు
వాటి వెనుక ఏమీ ఉండదు
పసిపాప బోసినవ్వులాంటి
తెల్లని ఖాళీ మినహా, వెన్నెల మినహా
కాస్త అమాయకత్వం మినహా,
ఉత్త జీవనానందం మినహా

ఈ లోకంలో నువ్వెవరికి నచ్చలేదు అంటారు
మనుషులకి అంటావు, నిన్నూ కలుపుకొంటూనే
నిన్ను తెలుసుకొనే తీరిక మనుషులకి లేదు,
మనుషుల్ని తెలుసుకొనే ఓపిక నీకు లేదు

ఎవరికి నచ్చావు ఈ లోకంలో అంటారు
రంగులకి, రాగాలకి, పదాలకి
సమస్త సంవేదనల జీవితానుభవానికి అంటావు
అవి నీలో తేలికగా కరిగిపోతాయి,
నువు వాటిలోకి తేలికగా మాయమౌతావు

ఈ లోకం నీకు నచ్చిందా, లేదా అంటారు
జవాబు తెలియటం లేదంటావు
నీ ముందున్నది పగలో, రాత్రో తెలియనట్లు 

మేఘాలపై నారింజ ఛాయలు విరబూస్తున్నాయి
వాటి రంగులు కరగబోయేది 
తెల్లని కాంతి లోనా, నల్లని చీకటిలోనా 
తెలియరావటం లేదు

బివివి ప్రసాద్

23 అక్టోబర్ 2026

కవిత : రంగులూ, ఛాయలూ

ఇంటికి రంగులు వేయించాలి
షాపులో కలర్ కార్డులు చూపిస్తారు

మనుషుల మనసుల్లానే
రవంత భేదంలో ఛాయ మార్చుకుంటూ
ఛాయల నుండి లౌక్యంగా రంగులు మార్చుకుంటూ
పదుల, వందల రంగులు

ఏ రంగులకో దగ్గరగా ఉంటావు,
ఏ ఛాయల దగ్గరో నిన్ను పోల్చుకొంటావు
ఒకానొక ఛాయ దగ్గర
ఇదే కావలసిందని ఆగుతావు

అక్కడ నువ్వున్నావు, ఉంటావు
ఇంతకు మునుపూ, ఇప్పుడూ, ఇకముందూ 
ఆ ఛాయ నీ జీవితసారం, 
నీ కలల వ్యాఖ్యానం

ఇంతాచేసి 
నువు రక్త, మాంసాల నుండి పుట్టావా,
రంగుల, ఛాయల నుండి పుట్టావా,
శబ్దాలూ, రాగాల నుండి పుట్టావా,
ఉద్వేగాల కలల నుండి పుట్టావా

ఇంతాచేసి
నువు వాటి నుండి పుట్టావా,
నీలోంచి అవి పుట్టాయా 

నువు కలవా, కలగంటున్నవాడివా,
ఛాయవా, అది పుట్టే కాంతివా

సందేహాల తరువాత
నలుపు, తెలుపు ప్రశ్నల మధ్య
ఏ ఛాయలోనూ ఇమడలేక నిలబడిపోతావు

బివివి ప్రసాద్

20 అక్టోబర్ 2026

కవిత : ఎక్కడికి..

పూవులు మరణిస్తాయి
సీతాకోకలు, ఇంద్రధనువులు, 
సంధ్యాకాశాలు మరణిస్తాయి

రోజులు మరణిస్తాయి
ఋతువులు, అడవులు, నదులు మరణిస్తాయి

మనుషుల చిరునవ్వులు మరణిస్తాయి
ఆశలు, భయాలు, దుఃఖాలు మరణిస్తాయి

కనిపించే సమస్తమూ మరణిస్తాయి
ఎలా జన్మించాయో, అలానే
ఏ దారిలో ఇక్కడికి వచ్చాయో, ఆ దారినే 

అయితే, ఇప్పుడొక ప్రశ్న
అన్నీ నిజంగా ఎక్కడి నుండో వస్తున్నాయా
ఎక్కడికో వెళుతున్నాయా 

ఇప్పుడు ఉన్నచోటులోనే 
వచ్చినట్లు, ఉన్నట్లు, వెళ్ళినట్లు కనిపిస్తున్నాయా

ఎక్కడికో వెళుతుంటే
ఆ వెళ్ళేచోటు ఎప్పుడు పుట్టింది
ఇక్కడనే పుడుతుంటే 
ఆ పుట్టేచోటుకి ఎలా వెళ్ళాలి 

మరణించిన పూలనీ, గాలుల్నీ, 
కాంతులనీ, కాలాలనీ అడిగితే
ఏమన్నా రహస్యాలు చెబుతాయా

బివివి ప్రసాద్

18 అక్టోబర్ 2026

కవిత : నిన్ను క్షమించుకొనేవేళ..

ఏవో రాస్తాం, మాట్లాడతాం
ఊహిస్తాం, కోరుకుంటాం, భయపడతాం

కానీ, టీ తాగి, కప్పు టేబుల్ పై ఉంచాక
తగిలే గాలి తెరలోకో, 
ముఖంపై వాలే పలుచని బంగారుకాంతిలోకో,
గాలిలో వినీ, వినిపించని శబ్దాల్లోకో
మనం దారి తప్పినపుడు
అన్నీ చెదిరిపోతాయి 
లేదా బలహీనపడతాయి, పలచబడతాయి 

గ్రీష్మ మధ్యాహ్నపు కాంతి
సాయంత్రానికి స్నేహితునిలా పలకరించినట్లు
తీవ్రతలు జ్ఞాపకాలుగా రూపాంతరమౌతాయి

జీవితానుభవం ఇలాంటిది
క్షణంలో శిఖరాల అంచున ఉంటావు
ఆకాశంలోకి చూస్తూనో,
లోయలకి భయపడుతూనో 

మరుక్షణం నేల పైన ఉంటావు,
పోయేవీ, పొందాల్సినవీ 
పిల్లల ఆటలు మినహా
మరేమీ కాదన్న స్థిమితంతో

ఆ క్షణం కోసం జీవితం ఎదురుచూస్తూ ఉంటుంది
ఇంటికి చేరిన తండ్రిని హత్తుకోవటానికి
ఎదురుచూసే పసిబిడ్డలా,
తన కౌగిలిలో చేరి
ఇవాళ్టికి నిన్ను
హృదయపూర్వకంగా మరోసారి క్షమిస్తావు

బివివి ప్రసాద్

16 అక్టోబర్ 2026

కవిత : సందేహాలు

ఇంతకూ నువు 
ఒక ఉదయకిరణాని కన్నా ఎక్కువా, తక్కువా
లేక, ఒక ఉదయకిరణంతో సమానమా

ఒక ఇంద్రధనువు, ఒక నెమలీక 
ఒక పక్షి పాట, ఒక కంటి మెరుపు
ఒక చిరునవ్వు, ఒక సెలయేటి సడి,
ఒక తారక కాంతి, ఒక గాలితెర

నీకంటే ఎక్కువా, తక్కువా, నీతో సమానమా

అవి నిజంగా ఉన్నాయా,
నిన్ను నీకు చూపించటానికి
ఉన్నట్లు కనిపిస్తున్నాయా

నిజంగా నువు నువ్వేనా
ఒక ఉదయ కిరణానివీ, గాలితెరవీనా

వాటిని నువు ఊహించావా,
నిన్ను అవి ఊహించుకున్నాయా

వాటిని నువు చూస్తున్నావా,
అవి నీలో తమని చూస్తున్నాయా

ఈ ఉనికిలో నిజమేది, ఊహ ఏది
మొదలూ, చివరా లేక ఉన్నదేది

బివివి ప్రసాద్

12 అక్టోబర్ 2026

కవిత : చీకటి పడ్డాక

చీకటి పడుతుంది
పగలంతా కురిసిన కాంతివాన వెలిసిపోతుంది
సీతాకోకలా రెక్కలార్చిన సాయంత్రపు ఆకాశం
చీకటి గూటిలోకి ఎగిరిపోతుంది

ఇప్పుడిక కాలమంతా రాత్రికి చెందినది
దీపాలు వెలుగుతాయి ఒక్కటొక్కటిగా 
చూస్తూ ఉండగానే ఇళ్ళ నిండా, వీధుల నిండా
దీపాల వాన, వెలుతురుల సీతాకోకలు

ఈ దీపాలంటే మోహం నీకు
వాటి చుట్టూ పసిపిల్లల్లా దాగుడుమూతలాడే
చీకటులన్నా, నీడలన్నా ఇష్టం
వాటిలోకి చూస్తావు, వాటి చుట్టూ చూస్తావు
వాటన్నిటినీ ఆవరించుకున్న జీవితాన్ని చూస్తావు

యజమానిలా నిను గమనించే 
పగటికాంతి తరువాత
ప్రియమైన స్నేహితురాలిలా సమీపించే
చల్లని, మెల్లని రాత్రి,
రాత్రిలో ఆమె చూపులా వెలిగే చంద్రవంక,
ఆమె మాటల్లా మెరిసే నక్షత్రాల గుంపులు,
ఆమె స్పర్శలా తాకే మృదు పవన వీచికలు
నిన్ను ఒకింత సేద తీరుస్తాయి

ఇప్పుడిక జీవితం ఆశావహం కావటం మొదలవుతుంది
భయం లేదు, నేనున్నానని ఎవరో అంటున్నట్లు తోస్తుంది
మెల్లగా, చెరువుపైన అలల సర్దుకొన్నట్లు
నీ ఉద్వేగాలు చల్లబడతాయి

రేపంతా బావుంటుంది
దేవుడు నీ రేపటిని వెన్నెలబొమ్మలా తీర్చుతాడని నమ్ముతూ, నిన్ను నిద్రలోకి విడిచి పెట్టుకొంటావు

బివివి ప్రసాద్
ప్రచురణ : వివిధ, ఆంధ్రజ్యోతి 12.10.26




09 అక్టోబర్ 2026

కవిత : నిర్మలమైన రాత్రి

ఈ రాత్రి నిన్ను కడగాలని కోరుకుంటావు
నీ వాంఛలనీ, భయాలనీ కడిగి
ఎప్పటి ప్రేమగా, హాయైన జీవితంలా
నిన్ను నీకు అప్పగించాలని ఆశ పడతావు

రాత్రి గడుస్తూ వెళుతుంది
చీకటీ, ఏకాంతమూ చిక్కబడుతూ ఉంటాయి
పగలంతా నిన్ను ముసిరిన బంధాలు,
ఉద్వేగాలు, భయాలు, అవసరాలు
మరపు ఇండుపగింజ తగిలి 
నెమ్మదిగా నీ అట్టడుగుకు ఇంకుతాయి
నీ ఉనికి తేటబడుతుంది 

రాత్రి నిన్ను కడగటమేమి,
నిన్నే నీటిలా మార్చుతుంది
వాంఛలూ, భయాలూ జ్వలింపచేసిన 
ఊహలు చల్లారిపోగా,
ఉత్త క్షమలోకీ, ప్రేమలోకీ మేలుకుంటూ
లోకానికి తల్లిలా జోల పాడతావు
నిద్రపోయేవేళకి లోకం కూడా
నిన్ను బిడ్డలా హత్తుకుని నిద్రపోతుంది

బివివి ప్రసాద్

04 అక్టోబర్ 2026

కవిత : జీవితానికి నువు

మనుషుల బంధాలు, ఉద్వేగాలు మారుతాయి
మేఘాల్లో రంగులు మారినట్లూ, 
ఇంద్రధనువులోని కాంతిలానూ 
చిక్కబడుతూ, వెలిసిపోతూ ఉంటాయి

జీవితం ఒక సంగీతవాయిద్యం
ఒక్కో సమయంలో ఒక్కో రాగం పలుకుతుంది
మంద్రంగా, లీలగా, గంభీరంగా..
నువు రాగాన్ని అనుసరించాలి కానీ
రాగం నిన్నెప్పటికీ అనుసరించదు 
అది పక్షి పాటలాగా
పక్షితో పాటు ఎగిరి, వెళ్ళిపోతూ ఉంటుంది

మనుషులు వస్తారు, వెళతారు
సుఖ, దుఃఖాలు వస్తాయి, వెళతాయి
అవి నిన్ను అనుభవిస్తాయి కానీ
నీ అనుభవానికి చిక్కవు 
తల్లికి బిడ్డ అనుభవాలు చిక్కనట్లు

నీ వలకు దూరంగా
నీటిలో ఆడుకొనే చేపలను చూసినట్లు
నీ అనుభవాలని చూడాలి
అవి నీవి కావు,
నువు వాటి ఉనికివి, కొంతసేపు

జీవితం నీది అనుకున్నంత కాలం
తను నీకు అర్థం కాదు,
నువు జీవితానికి చెందిన ఉనికివని
అనిపించినపుడు
నీకు అర్థం కావలసిందేమీ మిగలదు

బివివి ప్రసాద్


03 అక్టోబర్ 2026

కవిత : చాలాసార్లు

చాలాసార్లు, దృశ్యాల కన్నా
వాటి వెనుక ప్రవహించిపోయే ఖాళీ బావుంటుంది
శబ్దాల కన్నా 
వాటి వెనుక అలల్లా ఊగే నిశ్శబ్దమూ, 
అనుబంధాల కన్నా
వాటి లోపలినుండి ఉబికే ఏకాంతమూ బావుంటాయి

కొన్నిసార్లు అన్నీ ఉండటం బావున్నట్లే,
చాలాసార్లు ఏమీ లేకపోవటం బావుంటుంది

ఏమీ లేకపోవడం లోంచి
జన్మాంతరాల ఖాళీ లోకి, స్వేచ్ఛ లోకి 
ఎగిరిపోవటం బావుంటుంది
మరేదీ బావుండనంతగా బావుంటుంది

కొన్నిసార్లు ఇదంతా కావాలనిపిస్తుంది,
అంతలోనే ఉక్కపోస్తుంది
అన్నిటినీ, అంతటినీ
ఊహల గీతలతో నిండిన కాగితంలా చించి
ఏమీ లేకపోవటంలోకి, నువు కూడా లేకుండా, 
తిరిగి రాకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది

ఒకవేళ,
కొన్నిసార్లు ఉన్నట్లు తోచే ప్రపంచం 
ఎప్పుడూ నిజంగా లేదా,
చాలాసార్లు కోరుకునే ఖాళీ 
ఎప్పుడూ తానే ఉందా

ఇది తెలిసేదెవరికి
ఖాళీకా, ప్రపంచానికా

బివివి ప్రసాద్