ప్రకృతికి సమీపంలో బ్రతకమన్నారు కదాని
అడవులకు వెళ్ళి, వాటిని పాడు చేయవద్దు
నదులనీ, కొండలనీ కాలుష్యాలతో నింపవద్దు
ప్రకృతిలో భాగంగా బ్రతకమన్నారని
నది నుండీ, కొండ నుండీ, అడవి నుండీ
కొంత వేరుచేసి నీతో తెచ్చుకోవద్దు
వాటి మానాన వాటిని
నిలువనీ, ప్రవహించనీ, వికసించనీ
ఎండనీ, వాననీ, గాలినీ, చీకటినీ
ఏకాంతాన్నీ, బంధాలనీ, కాలాన్నీ ఆస్వాదించనీ
ప్రకృతికి సమీపంలో బ్రతకటమంటే
బిడ్డకో, తల్లికో, సఖికో సమీపంలో ఉన్నట్లు
ఒక శబ్దానికి సమీపంలో బ్రతికితే చాలు
దృశ్యానికి, స్పర్శకు సమీపంలో నివసిస్తే చాలు
ప్రకృతిలో లీనం కావటమంటే
శబ్దం లోపలికి ప్రవేశించి,
అక్కడి నిశ్శబ్దంలో లీనమైతే చాలు
బివివి ప్రసాద్
ప్రచురణ : తెలుగు వైభవం, నవంబర్ 2026

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి