14 జనవరి 2014

బెంగటిలినవేళ

1
 హాస్టల్ నుండి అర్థరాత్రి తండ్రికి ఫోన్ చేసింది అమ్మాయి  
'బెంగగా వుంది, డాడీ' 

వాళ్ళ తలల మీద ఒకే నక్షత్రాలు
కనులు విప్పార్చి చూస్తున్నాయి
ఒకే చలిగాలి ఆ ఇద్దరినీ అమ్మలాగా దగ్గరికి పొదువుకొంది

ఏమంత ముఖ్యంకాని శబ్దాల తెరచాపలు తెరిచి  
మృదువైన ఆర్ద్రతలోకి కలిసి ప్రయాణించారు కాసేపు 

ఆ సమయంలో 
ఆ రెండు జీవితాలూ ఒకటికావటంలోకి వికసించాయా
ఒకే జీవితం రెండుగా వికసించిందా

2
తెలియని యే చోటినుండో ఆమె భూమ్మీదికి వచ్చినపుడు  
అతనిలో అంతకుముందు ఎరుగని ఆకాశమూ
దానినిండా ఆనందమూ ప్రవేశించాయి

ఈ జీవి ఎవరు, ఈమెకీ, నాకూ బంధమేమిటి
ఈమెని చూసినపుడల్లా
కడుపులో ఆనందమో, దయో అలల్లా ఊగటమేమిటని
అతనికి ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది

మొన్ననే భూమ్మీద బాతునడకలు మొదలుపెట్టిన ఈ అమ్మాయి
ఇంత పెద్దది ఎపుడయిందని విస్మయంగానూ వుంటుంది

అతన్ని కొనసాగించటానికి ఆమె వచ్చిందో
ఆమె కొనసాగటానికి అతన్ని ముందుగా తెచ్చుకొందో
వాళ్ళకి తెలియనిది వారిద్దరిద్వారా కొనసాగుతోందో చెప్పమని

అతను తనలోని ప్రాచీన మౌనాన్ని ప్రార్ధిస్తాడు  
లోలోపలి మౌనం పదాల్లోకి వికసిస్తూ    
పురాతన విషయమే తాజాగా తెలియచేస్తుంది
  
3
తననించి తాను విడిపోవటం వీలుకాని  
ఒకే జీవితం, ఒకే ఆశ్చర్యం, ఒకే ఆనందంలాంటి దయ
హాస్టల్ గదిలోంచి అతనిలోకి 'బెంగగా వుంది, డాడీ' అన్నపుడు

అనేక జీవితాలు లేవనీ, ఉన్నది ఒకే జీవితమనీ తెలిసిన అతను కూడా
‘నాకూ బెంగగానే వుంది, తల్లీ’ అంటాడు


__________________________

ప్రచురణ: ఆంధ్రజ్యోతి వివిధ 13.01.2014

26 డిసెంబర్ 2013

నీరెండ

1
మనస్సు నిండా చికాకులతో మరొక ఉదయంలోకి మేలుకొన్నాను
తప్పూ, ఒప్పుల తీర్పులూ
వాటి వెనకాల నిలబడి నా గర్వమో, నిగర్వ గర్వమో  
తనకంటూ ఉనికి ఉన్నందుకు చేసుకొంటున్న పండుగా

తేనెతుట్టె కదిలినట్లు ఒకటే ఆలోచనల రొదలో, ఉన్నట్లుండి
ఇంటిగోడ మీద ప్రశాంతంగా పరుచుకొన్న నీరెండ నన్ను ఆకర్షించింది

పసిపాప నవ్వులాంటి నీరెండ
నా చీకాకుల ధూళినంతా తుడిచి
నన్నొక శుభ్రమైన అద్దాన్ని చేసింది కాసేపు

మనిషిలా ఎందుకు పుట్టాను,
ఈ నీరెండలా పుట్టి  
నీటిలోని ప్రతిబింబంలాంటి, నీటిమీది గాలి పలకరింపులాంటి
బహుపలుచని క్షణాలు కొన్ని గడిపి మాయమైతే సరిపోదా

2
ఏ యుగాలనాటిదీ ఈ నీరెండ
సోక్రటీసు ముఖం మీద, బుద్ధుని చిరునవ్వు మీద
భూమిని సందర్శించిన వేల జ్ఞానులు
అమాయకంగా, దయగా చేసిన ప్రవచనాల మీద
తేలుతూ వచ్చిన నీరెండే కదా ఇది

ప్రతి ఉదయమూ పలకరిస్తున్నా
మనలోపలి గాఢాంధకారాన్ని
రవంతైనా కదిలించలేకపోయిన నీరెండ కదా ఇది

3
మళ్ళీ ఆలోచనలు, మళ్ళీ ఫిర్యాదులు
మళ్ళీ వాటివెనుక గంతులేస్తూ
చీకటి పరిచే రహస్యంలో తనివితీరా స్వేచ్ఛని అనుభవిస్తున్న  
ఒకే ఒక అహం ముల్లు

ఈ తీర్పులెప్పుడు ముగించాలి, ఈ బరువెలా దింపుకోవాలి
ఇప్పుడు  చేరిన  ఈ  నీరెండని చూసిన గర్వం
దానిని పదాలలోకి ఒంపుకొంటున్న గర్వం ఎప్పటికి చెరగాలి

పదాలేమీ లేని వట్టి నగ్నమైన నీరెండని ఎలా తాకాలి
క్షణంలో నీరెండగా మెరిసి ఎలా మాయం కావాలి, మాయమెలా కావాలి

29 నవంబర్ 2013

ఆడియో: భగవాన్ శ్రీ రమణ మహర్షీ, తత్త్వమూ పరిచయాలు

భగవాన్ శ్రీ రమణ మహర్షి గురించి ఒక పరిచయవ్యాసం రాసుకోవాలని చాలాకాలంగా కోరిక. ఎప్పటికి రాయగలుగుతానో తెలియదు కాని, ఈ లోగా వారి గురించి చలం 'భగవాన్ స్మృతుల'కి రాసిన ముందు మాటా, భగవాన్ ప్రధమ బోధనా, వారి బోధనల సారమూ అయిన 'నేనెవడను' పుస్తకమూ మిత్రులకి చేర్చగలిగితే బాగుండునని ఈ పోస్ట్ పెడుతున్నాను.

అయిదారేళ్ళ క్రితం ఒక ఎఫ్.ఎం రేడియోలో నేను చదివిన పై అంశాల ఆడియో రికార్డులు రెండూ ఈ పోస్ట్ తో పాటు జత చేస్తున్నాను. ఆసక్తి గల మిత్రులు వినగలరు.

ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడం లోనో, సాధనలోనో ఉన్నవారికి భగవాన్ గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. వారి బోధననూ పరిచయం చేయనక్కరలేదు. కానీ, భగవాన్ ను అనేకమంది మహాత్ములలో ఒకరిగానో, ఒక మతానికి చెందిన గురువుగానో మాత్రమే భావించేవారికీ, ఆధ్యాత్మికత అంటే మనకు అర్థంకాని, సంబంధంలేని  క్లిష్టమైన, అనేక భావాలతో కూడుకొన్న విషయంగానో తలచేవారికి ఇవి రెండూ తప్పక ఉపకారం చేస్తాయి. ఇవి విన్నాక, వీటి గురించి ఆలోచించాక, భూమిమీద జీవించిన అత్యంత ఉన్నతమైన ఒక వ్యక్తిగా మాత్రమే భగవాన్ ను అర్థం చేసుకొన్నా అది వారి అంతరంగ పరిపక్వతకు ఎంతగానో సహాయం చేస్తుంది.

ఉపరితల అంశాలతో దు:ఖపూరితమైన, సంక్లిష్ట జీవితం గడుపుతూ తనకీ, తనవారికీ, ఇతరులకీ ఏమంత సంతోషాన్నివ్వకుండా, ఏదోవిధంగా కాలం ఖర్చు పెడుతూ జీవించేవారిలో కొందరికైనా ఇటువంటి అమృతప్రాయమైన దయకలిన మహాత్ములూ, వారి సరళ బోధనలూ ఎదురైనపుడు వారి హృదయాలు మెత్తబడతమూ, అగాధమూ, అత్యంత విశాలమూ అయిన వారి జీవితంలో ఇంతకుముందు ఊహించనైనా ఊహించని కొత్తకాంతులకి వారి చూపు వికసించడమూ జరుగుతాయని స్వీయానుభావమే ప్రమాణంగా నమ్ముతూ వీటిని మీతో పంచుకొంటున్నాను.

ఆన్లైన్ లో వినడానికీ, లేదా డౌన్ లోడ్ చేసుకోవటానికీ కింది లింక్స్ పై క్లిక్ చేయండి.  

చలం 'భగవాన్ స్మృతులు' ముందుమాట

భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధన 'నేనెవడను'

వారి గురించి, వారి బోధనల గురించి సమగ్రంగా తెలుసుకొనేందుకు శ్రీ రమణాశ్రమం, తిరువణ్ణామలై వారి వెబ్ సైట్ చూడగలరు.

శ్రీ రమణాశ్రమం, తిరువణ్ణామలై

01 నవంబర్ 2013

నువ్వు లేని వెలితిలోంచి..

'నక్షత్రాలన్నింటితో ఆకాశమూ, అంతులేని ఐశ్వర్యాలతో ప్రపంచమూ అన్నీ నాకు ఉన్నా ఇంకా కావాలని అడుగుతాను. కానీ ఈ ప్రపంచంలో మరీ చిన్న మూల కాస్త చోటుంటే చాలు, ఆమె నాదైతే..' నీకోసం వెదుకుతున్నపుడల్లా టాగోర్ మాటలు నా నేపధ్యంలో మృదువిషాదంతో చలిస్తూనే వుంటాయి. ఇంతకూ ఎవరు నువ్వు. ఎక్కడ ఉన్నావు. ఎంతకాలం నీకోసం దు:ఖిత హృదయంతో వెదకాలి.  

వసంతకాలపు గాలుల్లాంటి చల్లని తాజా ఊహలు సంచరించటం మొదలైన తొలి యవ్వనదినాలనుండీ నీకోసం వెదుకుతూనే వున్నాను. నా ఊహలవెంట నన్ను నేను పోగేసుకోవటంలోకీ, పోగొట్టుకోవటంలోకీ ప్రవహిస్తున్న కాలాలనుండీ, కలలూ, అమాయకత్వమూ, కాస్తంత దయా కదలాడే ప్రతి స్త్రీమూర్తి కళ్లలోనూ, చిరునవ్వులోనూ నీ ఉనికికోసం తడుముకొంటూనే ఉన్నాను. బంగారువన్నెలో మెరిసే ఆఖరు సూర్యకిరణంలాంటి చిరునవ్వు వెనుక నన్ను దాచుకొని వాళ్ళని 'ఆమె నువ్వేనా' అని అడుగుతాను.

వేణుగానంలో మేలుకొనే రాగాలలోకీ, గాలివాలులో పూలు సుతారంగా పరిచే పరిమళాల లోకాలలోకీ నా చేయి పట్టుకొని పసిపిల్లలా సునాయాసంగా మాయంకాగలిగే నీకోసం, ఆకాశమో, సముద్రమో హత్తుకొన్నట్టు నన్ను దగ్గరకు తీసుకొనే నీవంటి స్త్రీకోసం వెదుకుతూ, వాళ్ళని 'నువ్వేనా' అని అడుగుతాను. కానీ, వాళ్ళింకా జీవించటం మొదలుపెట్టని మామూలు యువతులు. ప్రపంచం రాసులుగా పోసి చూపించే అనుభవాల ఎండమావుల వెనుక పరుగులుతీసే సాధారణస్త్రీలు. ఉత్త దేహధారులు. నా ప్రశ్న వినగానే, ఉదయకాంతిలో వెలవెలబోతున్న వెన్నెలలాంటి చిరునవ్వులతో వాళ్ళు దూరతీరాలకు తరలిపోతారు. పక్షిలా వాళ్ళ వెలుతురు ఎగిరిపోయాక, వాలుతున్న రాత్రి లోలోపలికి ఒదిగిపోయి ముసురుకొంటున్న చీకటిని నీ ఒడిగా ఊహించుకొని మొహం దాచుకొని కన్నీటికెరటాల్లో ఊగిసలాడుతాను.       
స్వేచ్చలోకి పక్షులు పాడే పాటలూ, ఈ లోకాన్ని మరచి తమతో రమ్మని పూలు పంపే రంగురంగుల ఆహ్వానాలూ, నల్లమబ్బుల అంచున దిగులు చివరి చిరునవ్వుల్లా మెరిసే వెండితీగల సంగీతమూ, ఏకాంతరాత్రుల్లోకి అలలుగా ప్రవేశించే సముద్రమంత లోతైన నిశ్శబ్దమూ నా ఉనికిని తాకుతున్న ప్రతిసారీ, నువ్వు నాపక్కన ఉంటే బాగుండునని కలగంటాను. నువ్వు లేని వెలితిలోకి నన్ను విసిరేసుకొని గమ్యంలేకుండా తిరుగుతూ, సమస్తసృష్టినీ ఆమె ఎక్కడ ఉందో చెప్పమంటూ బ్రతిమాలుతాను. నన్ను నాకు మిగలకుండా చేసే మంత్రనగరం లాంటి నీ సాన్నిహిత్యంకోసం అలసినవేళల తపిస్తాను. చల్లటినదిలాంటి వెన్నెల తనలోకి నన్ను మృదువుగా హత్తుకొంటున్నపుడు, ఆ మెత్తనికాంతి నువు రహస్యలోకాలనుండి నన్ను వినమని పంపిన ప్రేమగీతంలా తలచుకొంటాను.                  

నువ్వు ఎవరో ఇప్పటికీ తెలియదు. ఏ యుగాల వెనుకనో, నాపై నువు చూపిన గొప్ప ప్రేమా, నీ కళ్ళలో వెలిగిన దయా, నా పసిదనపు ఉద్వేగాలపై చల్లిన చల్లటి క్షమా లీలగా, దూరాల నుండి వినవచ్చే సంగీతంలా నన్ను తాకుతూనే ఉంటాయి. ఇప్పుడిక, జీవితం మలిసంధ్య వైపు వాలుతోంది. తెగినదండ నుండి ముత్యాలు రాలినట్టు నా రోజులు జారిపోతున్నాయి. నిన్ను కనుగొనగలనన్న ఆశ దూరమౌతున్న ఓడతెరచాపలా కనుమరుగౌతోంది. ఉత్త గాలిపాటల్లాంటి వినోదాలతో సరిపెట్టుకొనే జ్వరపీడిత ప్రపంచం నన్ను రేవు విడిచిపొమ్మని తొందరపెడుతోంది.

ఇక నువ్వు కనిపించవు. ఏ ప్రయాణపు మలుపులోనో తటాలున ఎదురై 'నేనే' అని చిరునవ్వు నవ్వినా, పరాకున నిన్ను గుర్తుపట్టగలనో, లేనో తెలియదు. కానీ, నువ్వున్నావు గనుక, నా ఉనికి లోలోపల నీ కోమలస్పర్శ తెలుస్తోంది గనుక, కన్నీటితోనైనా జీవితాన్ని శుభ్రం చేసుకొంటున్నాను. నిన్ను వెదికే చూపుల్ని నీరెండలా పరిచి పరిసరాలని ప్రేమమయం చేసుకొంటున్నాను. ఏ రహస్యరూపంలో సమీపిస్తావోనని ప్రతిమనిషిలో నిన్ను చూస్తూ ప్రేమగా తాకటం నేర్చుకొంటున్నాను.              

ఏ స్థలకాలాల సరిహద్దుల ఆవలనో మనం ఒకటిగా ఉన్న స్థితిలోంచి, కేవలం ఒక బాల్యచేష్టగా నిన్ను విడిచి, ఈ లోకంలోకి చపలచిత్తుడినై పరుగుపెట్టానేమోనని తరచూ నన్ను నిందించుకొంటున్నాను. తెలివితక్కువగా నేను రావాలనుకొన్నాను సరే, నువ్వైనా చేయిపట్టుకొని ఆపలేదెందుకని బేలగా అడుగుతున్నాను. బహుశా, నువు నన్ను చూస్తున్నావేమో, దయగా నవ్వుతున్నావేమో. మనం ఒకటే కదా అని నేను వినలేని రహస్యభాషణలో ధైర్యం చెబుతున్నావేమో. కానీ, తెలియని భారాన్ని మోస్తున్న విసుగేదో లోలోపలినుండి నన్ను త్వరగా నడవమని చెబుతోంది. ఈ క్రీడ చాలు, ఈ నటన చాలు, ఎండమావుల వెంట ఈ పరుగు చాలు, ఎండలో నిలబడి నీడని చెరపాలని చూసే తెలివితక్కువ పనులు చాలు. ఇక చాలు.

బలమైనకెరటంలాంటి దు:ఖం త్వరగా నిన్ను చేర్చేందుకు కమ్ముకొంటోంది. మహాగ్నిగర్భంలో వెలిగే కాంతిలోకాలు నీ పిలుపుని తెలియచేస్తున్నాయి. వాటి కాంతి నా ముఖంపై పారాడినప్పుడు, చిరకాలపు వియోగం తరువాత నువ్వు నా నుదుటిని ముద్దు పెట్టుకొంటున్న ఉద్వేగం నాలోంచి తోసుకువస్తోంది. ఇక చాలు. ఈ ప్రయాణం త్వరగా ముగించాలి. చేయవలసిన పనులు వేగంగా పూర్తి చేయాలి. బింబాన్ని ఎక్కడో పోగొట్టుకొని వెదుక్కొంటున్న అద్దంలోని ప్రతిబింబంలా, నిన్ను పోగొట్టుకొని ఈ లోకంలో సంచరించింది చాలు. త్వరగా నిన్ను చేరాలి.

కన్నీటిబిందువుల్లాంటి అక్షరాలని ముగించి, ఏకాంతరాత్రి విసిరే చీకటిమైదానాల వెంట, నిశ్శబ్దాల వెంట, తప్తదేహాన్ని విడిచి నన్ను నీలోకి విసిరేసుకోవాలనే గాఢనిద్రల వెంట.. మెలకువలో అడుగైనా ముందుకు పడని స్వప్నంలోని పరుగుతో.. చిన్నసవ్వడైనా ఎవరికీ వినపడనివ్వని తీవ్రమైన లోలోపలి దు:ఖంతో.. నీ కోసం నిలబెట్టుకొంటున్న ఉనికిని ఏ అర్థమూ లేని ఈలపాటలా రద్దుచేసుకోవాలన్న ఉద్విగ్నతతో.. ఎవరు నువ్వు నుండి ఎవరు నేను లోకి.. సృష్టి అంతా పొగమంచులో మాయమయ్యాక పొగమంచు మాయంకావటంలోకి.. ఎవరూ, ఏదీ లేకపోవటం లోకి.. దేహాల, దేశాల, కాలాల అవతలికి ఇదిగో, ఇక్కడే ఇప్పుడే నిన్ను చేరుకోవటంలోకి..


___________________________
ప్రచురణ: తెలుగువెలుగు నవంబరు 2013

27 అక్టోబర్ 2013

నిద్రరాని రాత్రి

1
నిద్రరాని రాత్రి, గది తలుపులు తెరిచి 
చలితో నింపిన గాలిబుడగ వంటి ఆరుబయట నిలబడ్డాను
చుట్టూ చల్లదనం జీవితం తాకినట్టు తాకి వెళుతోంది
తల ఎత్తి చూస్తే చీకటిపుష్పం వెల్తురు పుప్పొడి రాల్చుతోంది 
నాకూ, లోలోపలి కాంక్షల్లా మెరిసే నక్షత్రాలకీ మధ్య సముద్రంలా పొంగుతోంది నిశ్శబ్దం   
ఆకాశమూ, నేనూ దూరమైన తల్లీబిడ్డల్లా ఒకరినొకరం చూసుకొన్నాము 

2
నాలో దాచుకొన్న వజ్రాల్లా మెరిసే ప్రశ్నలని 
మళ్ళీ బయటకు తీసి చూసుకొన్నాను 
సృష్టి అంటే ఏమిటి, నేను అంటే ఏమిటి
జీవితమంటే ఏమిటి, మృత్యువంటే ఏమిటి 
   
జవాబు ఉందా వాటికి, నిజంగా అవసరమా 
ప్రశ్నల తరువాత నాలో మేలుకొనే నిశ్శబ్దమే జవాబా 
నిశ్శబ్దం నాలో ఉందా, నిశ్శబ్దంలో నేనున్నానా   

3
చలికి ఒణికిన గాలితెర ఒకటి మళ్ళీ జీవితం తాకినట్టు తాకివెళ్ళింది
అద్దంలాంటి ఆకాశంలోకి ప్రశ్నలన్నీ పక్షుల్లాగా ఎగిరిపోయాయి 

ఈ రాత్రి ఎంత బావుంది
ఈ చల్లదనమూ, ఆకాశమూ ఎంత బావున్నాయి 
నక్షత్రాలూ, వాటి నడుమ ప్రవహించే నల్లనినదీ ఎంత బాగున్నాయి  
వీటన్నిటినీ చూడటమెంత బాగుంది 
చూడటమనే అనుభవాన్ని పంచుతోన్న జీవితమెంత బాగుంది

4
నిదురిస్తే మళ్ళీ మేలుకొంటానా, మరణిస్తే మళ్ళీ పుడతానా  
ఇపుడే చూడగలిగినంత చూసుకోవాలి
నా మెలకువ నీటిబుడగని చాతనైనంత నింపుకోవాలి 
ఈ విశాలమైన ఆకాశంతో, నక్షత్రాలతో, చలిగాలులతో 
అన్నిటి వెనుకనుండీ దాగుడుమూతలు ఆడుతోన్న పసిపాపలాంటి జీవితంతో


______________________________

ప్రచురణ:
ఆదివారం ఆంధ్రజ్యోతి 27.10.2013

08 సెప్టెంబర్ 2013

ఒక్కసారిగా తెరుచుకోగల హృదయమేదీ..

'నీ జీవన సందర్భాన్ని మరిచిపోయి, నీ జీవితం పై దృష్టి నిలుపు. సందర్భం కాలం లోనిది, జీవితం ఈ క్షణంలోది. సందర్భం నీ మనస్సుకి చెందింది, జీవితం వాస్తవమైనది.' ~ ఎకార్ట్ టోలీ

ఎంత మేధాశక్తీ, విజ్ఞానమూ ఉన్నా ఈ సరళమైన విషయం అర్థం కాదు, కానీ కాస్తంత పసిదనం మనలో ఇంకా మిగిలి ఉంటే, చాలా తేలికగా, అర్థమవుతుంది ఎకార్ట్ టోలీ ఏమి చెపుతున్నారో, జీసస్, బుద్ధుడూ, నిసర్గదత్తా, రమణ మహర్షీ, జిడ్డు కృష్ణమూర్తీ ఇత్యాదులంతా ఏమి చెబుతున్నారో.

మనం బాల్యాన్ని కీర్తిస్తాం, దానిపై బెంగపెట్టుకొని కవిత్వం రాస్తాం, కానీ, రవంత అహంకారం తగ్గించుకోం, రవంత వ్యూహచతురత విడిచి నిసర్గంగా నిలబడం. గతానుభవాలు నేర్పిన భయాలూ, పెద్దరికం మోసుకొచ్చిన జడత్వమూ మనకు సౌకర్యం. భయాల నుండీ, నిలబడిపోవటాల నుండీ పుట్టే సిద్ధాంతాలూ, వ్యవస్థలూ, వ్యక్తిపూజలూ, యుద్ధాలూ, అపనమ్మకాలూ, అవి పుట్టించే వేదనా, హింసా, కాలక్షేపమూ మనకు ఇష్టం.

మనం పెద్దవాళ్ళం. నది ఒడ్డున నిలబడి, నదీస్నానపు పారవశ్యాన్ని అనుభవించాలనుకొనే భద్రజీవులం. బలమైన గోడలతో గదులు నిర్మించుకొని, ఆకాశపు విశాలత్వం మన గదిలోకి రావాలనుకొనే నియంతలం. బెరడుకట్టిన పెద్దరికంతో పసిదనపు సౌకుమార్యాన్ని, పూవులా బహు పలుచని అస్తిత్వంగా మిగిలివుండటంలోని పరమ సంతోషాన్ని, శాంతిని, స్వేచ్చని, నిష్కపటమైన దయలాంటి ప్రేమని తాకాలని పదేపదే ప్రయత్నించేవాళ్ళం.

మనం దురదృష్టవంతులం కాదు, మనమే దురదృష్టాలం. పసిదనాన్నీ, ప్రకృతినీ, జీవన లయనీ, లాలసనీ మతం పేరుతో, సైన్సు పేరుతో, అభివృద్ధి పేరుతో, కళల పేరుతో, నాగరికత పేరుతో పూర్తిగా విస్మరించిన వాళ్ళం, అశాంతిని జీవనగీతంగా వరించిన వాళ్ళం.

వాళ్ళు చెబుతున్నారు.. నువ్వు నీటిబుడగవి కాదు, నదివి. నువ్వు జీవితంలోకి ప్రవేశించలేదు, నువ్వే జీవితానివి. స్వేచ్చవి. శక్తివి. శాంతివి.
కానీ, వినే తీరికేదీ.. విని, చూపుసారించే ఓపికేదీ.. అన్నిటినీ ధిక్కరించి జీవితాన్నిజీవితంగా నిసర్గంగా కౌగలించుకొనే ప్రేమ ఏదీ.. ఒక్కసారిగా తెరుచుకోగల హృదయమేదీ..

7.9.13