30 సెప్టెంబర్ 2025

కవిత : దయ నుండి

దయ ఉద్వేగాలకి తల్లి, 
దయకి తల్లి జీవనానందం
ఇక్కడికి రాగలిగితే అహం కరిగి నీరౌతుంది,
చీకటి కరిగి తెల్లవారుతుంది

చాలా కోరుకుంటాం, భయపడతాం
దిక్కులు తిరుగుతాం, లుంగలు చుట్టుకుంటాం 

చిక్కులు పడిన అడవి చీకట్లలోకి 
ఒక్క సూర్య కిరణం వాలకపోతుందా అని
ఎదురు చూస్తాం, వేసట పడతాం,
వాగునీటి చప్పుడులోకి చెవినీ, తలనీ అర్పిస్తాం
నీటి తడిలాంటి, సడిలాంటి దయ మినహా
ఏదీ నిన్నూ, లోకాన్నీ కాపాడలేదని
నిలువునా నీరైన క్షణాల్లో తెప్పరిల్లుతాం

ముందుగా శబ్దముందని వారంటారు గానీ,
ముందుగా దయ వుందని,
దయ నుండి ఆకాశం పుట్టిందని,
దయగల ఆకాశం నుండి సమస్తం పుట్టాయని తోస్తుంది

అనాది జీవితం, అనంతంగా సాగే జీవితం
నీలోని దయ నుండి పుట్టిందని
లేదూ, దయ నుండి నువు పుట్టావని తట్టినపుడు
ఇంత పెద్ద ప్రపంచం
పొగ మంచులో తేలే పగటి కలలా
ఒక్క సూర్య కిరణంతో మాయమవుతుంది

దయగల పక్షి కూత విన్నావా,
ఇక మిగిలిన పగలంతా 
నిన్ను నువ్వు ధారాళంగా ఒంపుకొంటావు

బివివి ప్రసాద్

29 సెప్టెంబర్ 2025

కవిత : అపురూపం

 కొన్ని క్షణాలు నవ్వుతావు చూసావా,
ఆ క్షణాల కోసమే బ్రతికుంటావు
అనేకసార్లు మృత్యువును దాటి

ఇంత విశ్వం నిన్ను కలగని ఎదురుచూసింది
ఆ నవ్వు కోసమే కావచ్చు,
ఉదయాలు బంగారాన్ని వెదజల్లింది
నీ ప్రశాంతమైన చూపు కోసమే కావచ్చు,
పూలు పలురంగుల్లో దోబూచి ఆడింది
నీ కళ్ళలోని ఆశ్చర్యం కోసమే కావచ్చు

జీవుల కళ్ళలోని జాలిపుట్టించే అమాయకత్వమూ,
మనుషుల్లోంచి వ్యక్తమయే, నిశ్శబ్దరాత్రి ఎగిరే 
పక్షిరెక్కల చప్పుడులాంటి మెత్తని ప్రేమా,
ఒక కవి నీ లోపల కూర్చున్నట్టు పలికే మాటలూ, 
ఏ స్వాప్నికుడో పలికించే వాయిద్యపు ధ్వనులూ 
నువ్వు ఉండటం కోసం ఎదురుచూసినవే కావచ్చు

రోజుల కేమి 
శిశిరపత్రాల కన్నా వేగంగా రాలిపోతాయి,
మాటల కేముంది 
నీటిబుడగల కన్నా వేగంగా చిట్లిపోతాయి,
అనుభవాల కేముంది
ఇదే కదా కోరుకున్నది అనేలోగా వెలిసిపోతాయి

కన్నా, ఈ నిమిషాన బ్రతికున్నావు చూడు,
ఇది కాలాల కావలి నుండి, గోళాల కావలి నుండి
తెలియని ఎవరో గాఢంగా కోరుకున్న కల

ఈ ఉదయం గడ్డిపరకపై వాలిన 
మంచుబిందువుని చూసావా, 
దానిలో ఆడుకుంటున్న రంగుల్నీ..
ఆ తెలియనివానికి ఆ బిందువుపై, 
ఆ బిందువువంటి నీపై ఎంత ప్రేమ

బివివి ప్రసాద్

28 సెప్టెంబర్ 2025

కవిత : కలలు

ఒక ఉదయం లేచేసరికి
పూవుగా మారిపోయి వుంటావు,
నీ రెక్కలపై మంచుబిందువులు
రంగుల కలలు కంటూ వుంటాయి

మంచుబిందువులకి
ప్రాణం ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోతావు,
వాటి కలలకి ప్రాణం ఉంటుందా అని
కనుగొనబోతూ వుండగానే
అవి పలుచని గాలిలోకి మాయమౌతాయి 

పలుచని గాలితెరలు 
సుతారంగా చిరునవ్వు నవ్వటం వినిపిస్తుంది,
నిజంగా విన్నానా అని చూడబోతే
తలలు తిప్పి ఏమీ జరగనట్లు సాగిపోతాయి

సూర్యకాంతి నీ ఆశ్చర్యంతో 
కనులు కలిపి చూస్తుంది
కేరింతలు కొడుతూ తలవూపుతావా,
పక్షి రెక్కల చప్పుడు కాంతిని ఎగరేసుకుపోతుంది

మనకి ఎగిరే వీలుందా అని
ఇటు తిరిగి తల్లిని అడుగుతావు;
మనకా అవసరం లేదంటుంది
భూసారంలోకి తనని అల్లుకున్న మొక్క

అతనికేం అవసరమై ఇటు వస్తున్నాడు
అంటూ వుండగానే, 
అతని చేయి నిన్ను సమీపిస్తుంది 
కల లోంచి ఉలికిపడి లేస్తావు

బివివి ప్రసాద్

27 సెప్టెంబర్ 2025

కవిత : కొన్నిసార్లు..

కొన్నిసార్లు రాయాలనిపించదు,
ఊరికే బ్రతకాలనిపిస్తుంది 
అపుడు గాలిలో కాక, గాలిలా ఉంటావు 
చీకటిలో కాక, చీకటిలా,
దీపకాంతిలో కాక, దీపకాంతిలా

జీవితంలో కాక, జీవితంలా ఉండేవేళల
నీటిలా పలుచగా, 
గాలిలా తేలికగా, కాంతిలా వికసిస్తూ

ఊహించని శబ్దమై చిట్లిన నిశ్శబ్దం
ఇదంతా నిజమని చెవిలో చెబుతుంది,
శబ్దంలోంచి వికసించే నిశ్శబ్దం
ఇదంతా కల అని కంటిముందు చూపిస్తుంది

కొన్నిసార్లు ప్రపంచాన్ని అనుభవించాలనిపించదు,
ఊరికే ఉండాలనిపిస్తుంది,
వట్టినే నిద్రలోకి జారిపోవాలనిపిస్తుంది

అప్పటివరకూ పరిపరి విధాల పలకరించిన ప్రపంచం
వానలో తడిసే చిత్రపటంలా కరిగిపోతుంది,
అదృశ్య చిత్రకారుడెవరో నిర్వికారంగా, శాంతిగా 
నిన్ను నిన్నులా చూస్తున్నట్లుంటుంది

బివివి ప్రసాద్

26 సెప్టెంబర్ 2025

కవిత : అహం..

ఎంత సంతోషం
క్షణం విడవలేని ఒకరు నీకుండటం,
ఎంత దుఃఖం ఆ ఒకరు నీకు,
ఎవరు సంతోషమో, వారు దుఃఖం
ఎవరు భద్రతో, వారు భయం

ఇలా వుంటుంది ఇక్కడంతా,
తోటి చిన్నారులు ఆడుకుందాం రమ్మన్నట్టు,
వాళ్ళతో ఆడితే కాలం మాయమవుతుంది,
వాళ్ళు లేకుంటే కాలం భారమౌతుంది

కాలం వలలో పడినట్లు తెలియని చేపపిల్లవి,
గాలి అందనపుడు విలవిల్లాడుతావు 
ఆశావహమైన మాటలేవీ వినిపించవు,
విన్నా, గాలి అందనివేళ వాటికి అర్థముండదు 

ఇదంతా ఆనందమో, బాధనో
తెలీని క్షణాల్లోకి ఇంకిపోతావు చూడు,
అప్పుడెవరో నీ దేహాన్ని తడతారు,
తెల్లవారింది, ఇంకా లేవలేదేమిటని

లేచాక తెలుస్తుంది ప్రేమించాల్సింది వేరే లేదని,
నిన్ను నువు తలమునకలుగా ప్రేమిస్తున్నావని

బివివి ప్రసాద్

25 సెప్టెంబర్ 2025

కవిత : బందిఖానా

 నిన్ను నువు మెచ్చే పనులు పదులు చేసావు,
క్షమించలేనివి వందలు చేసావు,
జీవితం ఊబిలో చిక్కుకున్నాక
ఎవరైనా ఇంతకన్నా ఏం చేస్తారు

ఎగురుదామనిపిస్తుంది, రెక్కలుండవు,
ఈదాలనిపిస్తుంది, మొప్పలుండవు,
చెట్టులా ఎదగాలి, గాలికి ఊగాలనిపిస్తుంది,
వేర్లుండవు, కొమ్మలూ, ఆకులుండవు

నిన్ను నువు కాపాడుకొనే భయాన్ని పెట్టి, 
సంతోషపరచే బాధ్యత పెట్టి,
ఎవరో విశ్వంలో గింజలా పాతారు

ఊబిలోంచి వెలికి రాబోయే ప్రతి కదలికా
ఇంకా ఊబిలోకి దించుతుంది,
ఇంత పెద్ద ప్రపంచం ఇంకా నిజమై కనిపిస్తుంది,
నిజంగా తెలీదు, ఇదేమిటో, ఏం జరుగుతుందో

కాలంతో ఉక్కపోత పెరుగుతుంది,
వేడిగాలితో బరువెక్కిన మేఘం
ఎప్పుడో కుండపోతగా కురుస్తుందేమో తెలీదు

కురిసీ, కురిసీ మేఘం నీరై, గాలై, ఆకాశమై 
లేకుండా పోతుందేమో తెలీదు,
లేనిదేదో ఉండటం కలలోంచి
ఉలికిపడి లేస్తుందేమో తెలీదు

బివివి ప్రసాద్