29 సెప్టెంబర్ 2025

కవిత : అపురూపం

 కొన్ని క్షణాలు నవ్వుతావు చూసావా,
ఆ క్షణాల కోసమే బ్రతికుంటావు
అనేకసార్లు మృత్యువును దాటి

ఇంత విశ్వం నిన్ను కలగని ఎదురుచూసింది
ఆ నవ్వు కోసమే కావచ్చు,
ఉదయాలు బంగారాన్ని వెదజల్లింది
నీ ప్రశాంతమైన చూపు కోసమే కావచ్చు,
పూలు పలురంగుల్లో దోబూచి ఆడింది
నీ కళ్ళలోని ఆశ్చర్యం కోసమే కావచ్చు

జీవుల కళ్ళలోని జాలిపుట్టించే అమాయకత్వమూ,
మనుషుల్లోంచి వ్యక్తమయే, నిశ్శబ్దరాత్రి ఎగిరే 
పక్షిరెక్కల చప్పుడులాంటి మెత్తని ప్రేమా,
ఒక కవి నీ లోపల కూర్చున్నట్టు పలికే మాటలూ, 
ఏ స్వాప్నికుడో పలికించే వాయిద్యపు ధ్వనులూ 
నువ్వు ఉండటం కోసం ఎదురుచూసినవే కావచ్చు

రోజుల కేమి 
శిశిరపత్రాల కన్నా వేగంగా రాలిపోతాయి,
మాటల కేముంది 
నీటిబుడగల కన్నా వేగంగా చిట్లిపోతాయి,
అనుభవాల కేముంది
ఇదే కదా కోరుకున్నది అనేలోగా వెలిసిపోతాయి

కన్నా, ఈ నిమిషాన బ్రతికున్నావు చూడు,
ఇది కాలాల కావలి నుండి, గోళాల కావలి నుండి
తెలియని ఎవరో గాఢంగా కోరుకున్న కల

ఈ ఉదయం గడ్డిపరకపై వాలిన 
మంచుబిందువుని చూసావా, 
దానిలో ఆడుకుంటున్న రంగుల్నీ..
ఆ తెలియనివానికి ఆ బిందువుపై, 
ఆ బిందువువంటి నీపై ఎంత ప్రేమ

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి