30 సెప్టెంబర్ 2025

కవిత : దయ నుండి

దయ ఉద్వేగాలకి తల్లి, 
దయకి తల్లి జీవనానందం
ఇక్కడికి రాగలిగితే అహం కరిగి నీరౌతుంది,
చీకటి కరిగి తెల్లవారుతుంది

చాలా కోరుకుంటాం, భయపడతాం
దిక్కులు తిరుగుతాం, లుంగలు చుట్టుకుంటాం 

చిక్కులు పడిన అడవి చీకట్లలోకి 
ఒక్క సూర్య కిరణం వాలకపోతుందా అని
ఎదురు చూస్తాం, వేసట పడతాం,
వాగునీటి చప్పుడులోకి చెవినీ, తలనీ అర్పిస్తాం
నీటి తడిలాంటి, సడిలాంటి దయ మినహా
ఏదీ నిన్నూ, లోకాన్నీ కాపాడలేదని
నిలువునా నీరైన క్షణాల్లో తెప్పరిల్లుతాం

ముందుగా శబ్దముందని వారంటారు గానీ,
ముందుగా దయ వుందని,
దయ నుండి ఆకాశం పుట్టిందని,
దయగల ఆకాశం నుండి సమస్తం పుట్టాయని తోస్తుంది

అనాది జీవితం, అనంతంగా సాగే జీవితం
నీలోని దయ నుండి పుట్టిందని
లేదూ, దయ నుండి నువు పుట్టావని తట్టినపుడు
ఇంత పెద్ద ప్రపంచం
పొగ మంచులో తేలే పగటి కలలా
ఒక్క సూర్య కిరణంతో మాయమవుతుంది

దయగల పక్షి కూత విన్నావా,
ఇక మిగిలిన పగలంతా 
నిన్ను నువ్వు ధారాళంగా ఒంపుకొంటావు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి