16 అక్టోబర్ 2026

కవిత : సందేహాలు

ఇంతకూ నువు 
ఒక ఉదయకిరణాని కన్నా ఎక్కువా, తక్కువా
లేక, ఒక ఉదయకిరణంతో సమానమా

ఒక ఇంద్రధనువు, ఒక నెమలీక 
ఒక పక్షి పాట, ఒక కంటి మెరుపు
ఒక చిరునవ్వు, ఒక సెలయేటి సడి,
ఒక తారక కాంతి, ఒక గాలితెర

నీకంటే ఎక్కువా, తక్కువా, నీతో సమానమా

అవి నిజంగా ఉన్నాయా,
నిన్ను నీకు చూపించటానికి
ఉన్నట్లు కనిపిస్తున్నాయా

నిజంగా నువు నువ్వేనా
ఒక ఉదయ కిరణానివీ, గాలితెరవీనా

వాటిని నువు ఊహించావా,
నిన్ను అవి ఊహించుకున్నాయా

వాటిని నువు చూస్తున్నావా,
అవి నీలో తమని చూస్తున్నాయా

ఈ ఉనికిలో నిజమేది, ఊహ ఏది
మొదలూ, చివరా లేక ఉన్నదేది

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి