ఈ రాత్రి నిన్ను కడగాలని కోరుకుంటావు
నీ వాంఛలనీ, భయాలనీ కడిగి
ఎప్పటి ప్రేమగా, హాయైన జీవితంలా
నిన్ను నీకు అప్పగించాలని ఆశ పడతావు
రాత్రి గడుస్తూ వెళుతుంది
చీకటీ, ఏకాంతమూ చిక్కబడుతూ ఉంటాయి
పగలంతా నిన్ను ముసిరిన బంధాలు,
ఉద్వేగాలు, భయాలు, అవసరాలు
మరపు ఇండుపగింజ తగిలి
నెమ్మదిగా నీ అట్టడుగుకు ఇంకుతాయి
నీ ఉనికి తేటబడుతుంది
రాత్రి నిన్ను కడగటమేమి,
నిన్నే నీటిలా మార్చుతుంది
వాంఛలూ, భయాలూ జ్వలింపచేసిన
ఊహలు చల్లారిపోగా,
ఉత్త క్షమలోకీ, ప్రేమలోకీ మేలుకుంటూ
లోకానికి తల్లిలా జోల పాడతావు
నిద్రపోయేవేళకి లోకం కూడా
నిన్ను బిడ్డలా హత్తుకుని నిద్రపోతుంది
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి