చాలాసార్లు, దృశ్యాల కన్నా
వాటి వెనుక ప్రవహించిపోయే ఖాళీ బావుంటుంది
శబ్దాల కన్నా
వాటి వెనుక అలల్లా ఊగే నిశ్శబ్దమూ,
అనుబంధాల కన్నా
వాటి లోపలినుండి ఉబికే ఏకాంతమూ బావుంటాయి
కొన్నిసార్లు అన్నీ ఉండటం బావున్నట్లే,
చాలాసార్లు ఏమీ లేకపోవటం బావుంటుంది
ఏమీ లేకపోవడం లోంచి
జన్మాంతరాల ఖాళీ లోకి, స్వేచ్ఛ లోకి
ఎగిరిపోవటం బావుంటుంది
మరేదీ బావుండనంతగా బావుంటుంది
కొన్నిసార్లు ఇదంతా కావాలనిపిస్తుంది,
అంతలోనే ఉక్కపోస్తుంది
అన్నిటినీ, అంతటినీ
ఊహల గీతలతో నిండిన కాగితంలా చించి
ఏమీ లేకపోవటంలోకి, నువు కూడా లేకుండా,
తిరిగి రాకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది
ఒకవేళ,
కొన్నిసార్లు ఉన్నట్లు తోచే ప్రపంచం
ఎప్పుడూ నిజంగా లేదా,
చాలాసార్లు కోరుకునే ఖాళీ
ఎప్పుడూ తానే ఉందా
ఇది తెలిసేదెవరికి
ఖాళీకా, ప్రపంచానికా
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి