04 అక్టోబర్ 2026

కవిత : జీవితానికి నువు

మనుషుల బంధాలు, ఉద్వేగాలు మారుతాయి
మేఘాల్లో రంగులు మారినట్లూ, 
ఇంద్రధనువులోని కాంతిలానూ 
చిక్కబడుతూ, వెలిసిపోతూ ఉంటాయి

జీవితం ఒక సంగీతవాయిద్యం
ఒక్కో సమయంలో ఒక్కో రాగం పలుకుతుంది
మంద్రంగా, లీలగా, గంభీరంగా..
నువు రాగాన్ని అనుసరించాలి కానీ
రాగం నిన్నెప్పటికీ అనుసరించదు 
అది పక్షి పాటలాగా
పక్షితో పాటు ఎగిరి, వెళ్ళిపోతూ ఉంటుంది

మనుషులు వస్తారు, వెళతారు
సుఖ, దుఃఖాలు వస్తాయి, వెళతాయి
అవి నిన్ను అనుభవిస్తాయి కానీ
నీ అనుభవానికి చిక్కవు 
తల్లికి బిడ్డ అనుభవాలు చిక్కనట్లు

నీ వలకు దూరంగా
నీటిలో ఆడుకొనే చేపలను చూసినట్లు
నీ అనుభవాలని చూడాలి
అవి నీవి కావు,
నువు వాటి ఉనికివి, కొంతసేపు

జీవితం నీది అనుకున్నంత కాలం
తను నీకు అర్థం కాదు,
నువు జీవితానికి చెందిన ఉనికివని
అనిపించినపుడు
నీకు అర్థం కావలసిందేమీ మిగలదు

బివివి ప్రసాద్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి