లేత యవ్వనంలో, ప్రేమించుకునే రోజుల్లో
తను పలికే ఒక మాట కోసం
మొహంవాచేలా ఎదురుచూసాడు
ఉదయాస్తమయాల్లోకీ,
విశాల మైదానాల్లోకీ, గగనాల్లోకీ చూపులు జొనిపి,
బిడ్డ తల్లిని కావలించుకున్నట్టు
జీవితాన్ని కావలించుకుని
తలదించి, కన్నీరు విడుస్తూ అడిగేవాడు
ఆమెకి నేనంటే ఇష్టమేనా,
ఎందుకని తను ఒక్కమాట కూడా..
ఆమె మౌనం అతన్నెంత గాయపరిచిందో
ఆమెకే కాదు, అతనికీ తెలియలేదు,
జీవితోత్సాహం కోల్పోయినట్లు
ఎందుకంత చేదుగా ఉంటాడో
అతన్ని గమనించే లోకానికీ తెలియలేదు
కాలాంతరాలలో
ఒక సూర్యాస్తమయం కరుణించి
ఆమెని మరలా చూపినపుడు
ఆమె అంది కదా,
జీవితం బావుంది,
లోపల కాంతివంతమైన స్థలంలో
నువ్వు అలానే ఉండిపోయావు
అతనికి జీవితమంతా నింపుకొన్న చేదు
మెల్లగా కరగటం మొదలైనట్లు తోచింది
అంతలో, ఆమె మరలా అంది,
నాకు నా జీవితం బావుంది ,
ఇక, నిన్ను పూర్తిగా మరిచిపోవటం మంచిదనిపిస్తుంది
ఆమె ఆలోచనలో న్యాయముంది,
అతనిలో కొనసాగే చేదులోనూ న్యాయముంది
అస్తమయ వర్ణాలు వెలిసి
మెల్లగా చీకటి కమ్ముతోంది
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి