కాలిపోయాక
అద్దంలో సిరులొలికేలా నవ్వుతున్న
ఈ ముఖాన్ని ఇక చూడలేవు
ప్రపంచాన్నీ చూడలేవు గానీ
అదేమంత ముఖ్యమైన సంగతి కాదు
మనుషుల్ని నువూ, నిన్ను మనుషులూ
ఏనాడూ, ఏమంత పట్టించుకోలేదు
కానీ, పగలు మెరిసే సూర్యబింబం,
బింబం కింద కదలాడే
వెలిగే రంగుల, ఊగే నీడల ప్రపంచమూ,
ప్రపంచంలో కదిలే గాలీ, తేలే శబ్దాలూ,
శబ్దాలతో కావలించుకుంటూ, విడిపోతూ
ప్రేమలో మునిగి, తేలే దృశ్యాలూ,
దృశ్యాలతో దాగుడుమూతలాడే నిశ్శబ్దాలూ
ఎంతోకొంత ఇష్టం నీకు
ఒకసారి ఊపిరి ఆగిపోయాక,
నిశ్శేషంగా కాలిపోయాక
మనుషుల్నీ, ప్రపంచాన్నీ వదిలి
ఖాళీ గాలిలా ఊగుతావు, బహుశా
మెరిసేదేదీ కలకాలం నిలబడదని
నీ ఖాళీ గాలికి తోస్తుంది
ఒకసారి కాలిపోయాక,
అనుభవాలు బూడిదలా రాలిపోయాక,
తెలియరానిదేదో, బహుశా
నిను కౌగలించుకోవటానికి
ఉద్వేగంతో వేగంగా నిను సమీపిస్తుంది
బహుశా, కాలిపోయాక
బ్రతికిందంతా అర్థవంతమవుతుంది
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి