27 సెప్టెంబర్ 2026

కవిత : కలల గుంపు

మనిషిలా పుట్టామనుకుంటాం గానీ, 
నిజానికొక కలల గుంపు మనిషిలా పుడుతుంది 
శరీరాన్ని అనుకుంటాం గానీ,
నిజానికి కొన్ని ఉద్వేగాలు శరీరం ధరిస్తాయి

సీతాకోకల, తూనీగల రెక్కల, 
చెరువు నీటిపొరపై ఊగే నీలి ఆకాశాల,
చెరువుమీదా, ఊరిమీదా, నీ మీదా, లోపలా
వృత్తాలు చుట్టే వాన చినుకుల, 
ఆటబొమ్మల, గాలిపటాల 
కాంతులు దాచుకున్న పసిదనపు కలల తరువాత 

రంగురంగుల కలల, స్నేహాల
రంగురంగుల నవ్వుల, అనుభవాల
కాంతులు దాగిన యవ్వనపు కలల తర్వాత

మరిన్ని రంగుల, వెలిసిన రంగుల, 
నలుపు, తెలుపుల, వెలుగారిన ఛాయల,
అనేక ఉద్వేగాల, అనుభవాల, కలవరాల
ఉలికిపాటు మెలకువల, ఊపిరాడనితనాల వరకూ

మనిషి నిజానికి ఒక కలల గుంపు,
గాజుజాడీలో ఎగిరే సీతాకోకల సమూహం

ఒక దిగులు సాయంత్రం ఒంటరిగా కూర్చుని
ఏకాకులమని మన మనుకుంటాం గానీ
పసివాడు రహస్యంగా మిఠాయి తింటున్నట్లు
దూరంగా తేలుతూ, 
క్షితిజరేఖలో దాగొనబోతున్న బంగారు బింబాన్ని
మనం మాత్రమే చూసే కలని 
జన్మ మూలంలోనే దాచుకొని వచ్చి ఉండమా..

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి