06 సెప్టెంబర్ 2026

కవిత : చాలా ఖాళీ..

చాలా ఖాళీ కావాలి వెలుపలా, లోపలా..
ఒక విశాలమైన అనుభవాన్ని ఆవాహన చేయటానికి,
పగటి ఆకాశం కింద కాంతిలో తేలే ప్రపంచాన్ని
నీ నిండా నింపుకోవటానికి..

ఈ పగటిని తన పని తాను 
కుదురుగా చేయనీయటానికి
నువు ఒక ప్రక్కన నిలబడి చూడాలి,
మహానదీ ప్రవాహాన్ని 
ఒడ్డున చెట్టు క్రింద నిలిచి గమనిస్తున్నట్లు
పగటి కాంతిని గమనించాలి

కాంతిలో ఈదే జీవుల కదలికల్నీ, 
చరాచరాల తలలపైనుండి 
నేల కౌగిలిలోకి దుమికే నీడల్నీ,
వెలుగునీడల తెరల నడుమ 
పొందికగా ఆడుకొనే కాలాన్నీ
ఊపిరి కూడా కలవరం కలిగించనంత
నెమ్మదిగా, తేలికగా, 
దిగులంత మృదువుగా తాకాలి

ప్రవాహంపైకి తీరికగా వాలిన ఎండుటాకు 
మరింత తీరికలోకి ప్రవహిస్తూ మాయమైనట్లు..
చాలా ఖాళీలోకి నిన్ను తెరుచుకొని చూడాలి
తెలవారుతూనే కాంతితలుపు తెరుచుకొన్నట్లు..
రంగులు పూలని మెల్లగా తెరిచినట్లు..
ఊపిరి ఇక చాలునేమో అన్నట్లు..

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి