12 సెప్టెంబర్ 2026

కవిత : ఒకటే రోజు

ఒకటే రోజు

అన్ని జీవులతో పాటు
నీకూ ఒకటే రోజు ఇవ్వబడుతుంది
దాని నుండి 
ఎంత జీవితం నింపుకుంటావో ముఖ్యం

జీవించటమంటే అనుభవంతో నిండటం,
ఉత్త ప్రేమగా వెలగటం, 
ఉత్త కోల్పోవటం, కరిగిపోవటం
పంజరంలోంచి వినీలగగనంలోకి ఎగిరిపోవటం

ఒకరోజున దుఃఖపడు, భయపడు,
భయంనుంచి హీనత్వంలోకి జారిపో,
ధైర్యం వైపు తిరిగి దేదీప్యంగా వెలుగు
జీవితం అడిగేది అవేమీకాదు,
నీ విషయాలేవీ పట్టింపు లేని అమ్మ 
నిన్ను అన్నం తిన్నావా అని అడిగినట్లు
ఈ రోజున ఎంత జీవించావని అడుగుతుంది

ఎన్ని వెలుగునీడలు చూడగలిగావు,
ఎన్ని శబ్దాలు శ్రద్ధగా విన్నావు,
ఎన్ని కదలికలు కనులారా చూసావు,
దేహంలో అనుభవించావు

దృశ్యాల్లోంచి ఎంత శూన్యాన్ని తాకావు,
శబ్దాల్లోంచి ఎంత నిశ్శబ్దం విన్నావు,
ఊహల్లేని ఏకాంతంలోకి ఎంతగా కరిగిపోయావు

ఆ రోజున, నీ లోతుల్లో మునిగి
ఎన్ని పాలపుంతలు దాటి ప్రయాణించావు,
ఎక్కడా నువు తప్ప ఏమీ లేదని గ్రహించావు,
ప్రపంచం లోతుల్లోకి వెళ్ళి
ఎంత సారవంతమైన జీవితాన్ని తాకావు

లేదా, ఏమీ చేయలేక ఎప్పటిలా, 
కేవలం సముద్రం పైన అలలా ఊగావు 

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి