18 డిసెంబర్ 2014

తోటివారిని

తోటివారిని గాజులానో, పూలలానో,
కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడలేమా
బహుశా, గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే   
అద్దంలో ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం

నిజంగా, తెలియనిచోట ఉన్నాం కదా
భూమి ఏమిటో, ఆకాశం ఏమిటో,
మెరిసే ఉదయాస్తమయాలూ, దిగులు కురిసే నల్లని రాత్రులూ
ఎందుకున్నాయో, ఏం చెబుతున్నాయో తెలియని
మంత్రమయస్థలంలో దారి తెలియక తిరుగుతున్నాం కదా

కనులంటే ఏమిటో, చూడటమేమిటో,
చూపు బయలుదేరుతున్న లోలోపలి శూన్యపు అగాధమేమిటో
ఎరుక లేకుండానే ఋతువుల నీడల్లో తడుముకొంటున్నాం కదా

ఎవర్ని లోపలికంటా తడిమిచూసినా ఏముంటుంది
గుప్పెడు ప్రశ్నలూ, కాస్త కన్నీరూ, ఇంకా అర్ధం సంతరించుకోని  ఒక దిగులుపాట మినహా
ఎవరి కథ చూసినా ఏముంటుంది
అంచులు కనరాని కాలపు ఊయలలో ఏడ్చే, నిదురించే పసిబిడ్డ లోపలి నిశ్శబ్దం మినహా

తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం
చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరికొకరం
చూడలేమా ఒకరిలోకొకరం మరికాస్త సూటిగా, లోతుగా, నమ్మకంగా..

__________________
ప్రచురణ: సారంగ 11.12.14 

11 డిసెంబర్ 2014

'ఆకాశం' సంపుటికి నూతలపాటి కవితా సత్కారం

'ఆకాశం' సంపుటి నూతలపాటి కవితా సత్కారం - 2011 కు ఎంపికైంది. ఈ మేరకు 'ఆకాశం' కవితాసంపుటి కవి బివివి ప్రసాద్ ని నవంబరు 15 న తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో గంగాధరం సాహితీ కుటుంబం వారు ప్రశంసా పత్రం, నగదుతో సత్కరించారు. 

ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గంగాధరం సాహితీ కుటుంబం అధ్యక్షులు విద్వాన్ ఎస్.మునిసుందరం, కార్యదర్శి ఆచార్య డి. కిరణ్ క్రాంత్ చౌదరి, ఆచార్య మేడిపల్లి రవికుమార్, కవులు బివివి ప్రసాద్, పలమనేరు బాలాజీ (నూతలపాటి కవితా సత్కారం - 2012 కు ఎంపికైన 'ఇద్దరిమధ్య' కవితాసంపుటి కవి), నూతలపాటి వెంకటరమణ పాల్గొన్నారు.

సభ విశేషాలు ఇక్కడి ఫొటోలు, ఆడియో, వీడియో లలో గమనించవచ్చును.


'ఆకాశం' పై మేడిపల్లి రవికుమార్ ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ఇద్దరిమధ్య' పై మేడిపల్లి రవికుమార్ ప్రసంగానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బివివి ప్రసాద్ ప్రసంగం వీడియోకు ఇక్కడ క్లిక్ చేయండి.

03 డిసెంబర్ 2014

అక్షరాశ్రమం

సముద్రంపై ఎగిరి ఎగిరి మళ్ళీ నౌకపైనే వాలిన పక్షిలా
లోకమంతా తిరిగి మళ్ళీ అక్షరాలపై వాలతావు
నీ కెంతమేలు చేస్తున్నాయో ఎపుడూ గమనించలేదు కాని
భూమ్మీద అక్షరాలు మినహా నీకు తోడెవరూ ఉన్నట్టులేరు

దు:ఖంలోకీ, వెలితిలోకీ ఘనీభవించినపుడు
ఏ శూన్యం నుండో పుట్టుకొచ్చిన కిరణాల్లా అక్షరాలు
నీ ఉద్విగ్న హృదయాన్ని చేరి మెల్లగా నిన్ను కరిగిస్తాయి

ఇంత దయా, శాంతీ నీ అక్షరాలకెలా సాధ్యమని
మిత్రులు విస్మయపడుతున్నపుడు ఆలోచించలేదు కాని
వాటిని ఆశ్రయించే క్షణాల్లో ఏదో దివ్యత్వం
నీ దు:ఖాన్ని దయగా, వెలితిని శాంతిగా పరిపక్వం చేస్తున్నట్లుంది

ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క అద్దంలా కనిపిస్తోంది
అద్దాలని అతికినప్పుడల్లా
నీలోపల ముక్కలైనదేదో అతుక్కొన్న ఊరట కలుగుతోంది

ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క నక్షత్రంలా కనిపిస్తోంది
కాసిని నక్షత్రాలని పోగేసుకొన్న ప్రతిసారీ
పిపీలికంలా మసలే నువ్వు పాలపుంత వవుతున్నట్లుంది

ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ ఓ కన్నీటి బిందువవుతోంది
కాసిని కన్నీళ్ళని జారవిడిచిన ప్రతిసారీ
గర్వమో, స్వార్ధమో, మరొక  చీకటో కరిగి

మామూలు మనిషి దేవుడవుతున్నట్లుంది
జీవితం ప్రార్ధనా గీతమవుతున్నట్లుంది
ఎన్నటికీ మరణించనిదేదో లోలోపల వెలుగుతున్నట్లుంది

________________________
ప్రచురణ: తెలుగువెలుగు డిసెంబర్ 14 

02 డిసెంబర్ 2014

పునరుత్థానం

1 
ఒక గాయం ఎటూ కదలనివ్వక
నిలబడినచోటనే కూలబడేలా చేస్తుంది
చూస్తున్న దిక్కులోని శూన్యంలోకి
వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపొమ్మంటుంది 

గాయం ఏమీ చెయ్యదు 
అప్పటివరకూ అల్లుకొన్న తెలిసీ, తెలియని స్వప్నాలనీ 
స్వప్నాలకి సుతారంగా పూయబోతున్న సంతోషాల పువ్వులనీ
చిందరవందర చేయడం మినహా
పాలుగారే వెన్నెలల్నుండీ, ఉభయసంధ్యల వర్ణాలనుండీ
సేకరించుకొన్న జీవనలాలసని ఒకేసారి చెరిపేయడం మినహా

ఇన్నాళ్ళూ పాడింది పాటే కాదు, మళ్ళీ మొదలుపెట్టు
భూగోళమంత జీవితాన్ని నీపై మోపుతున్నాను,
ఇప్పుడు ఆకాశంలా ఎగిరిచూపించు అంటుంది గాయం

2
జీవితోత్సవాన్నుండి వేరుపడ్డ హృదయం
తడిసి మెరిసే మాటకోసం, చూపుకోసం, స్పర్శకోసం
తప్పిపోయిన పిల్లాడిలా ఎడతెగక ఎదురుచూస్తుంది

దారులన్నీ మూసుకుపోతున్న చీకట్నుంచి చీకట్లోకి
దుఃఖజలంతో బరువెక్కుతున్న కాలంనుంచి కాలంలోకి
ఉన్నచోటనే వేళ్ళూనుకొంటున్న గాయంతో వేచివుంటుంది

3
దైవీశక్తులేవో దీవించిన స్పటికంలాంటి క్షణమొకటి ప్రవేశిస్తుంది
ఉన్నట్లుండి ఒకనిట్టూర్పు గుబురుకొమ్మల్లోంచి పక్షిలా ఎగురుతుంది
కాసిని కన్నీటిమొగ్గలు చెక్కిళ్ళపై పారాడుతాయి

ఎక్కడిదో నీళ్లచప్పుడూ, పక్షిరెక్కల అలికిడీ
చెట్ల ఆకుల్ని గాలి మృదువుగా నిమిరిన మర్మరధ్వనీ
చెవిలో జాగ్రత్తగా గుసగుసలాడుతాయి

జీవితం చాలా పెద్దది, చాలా దయగలది కూడా
ఊరికే నిలబడు, ఒక అడుగువేయి
తక్కినదంతా తను చూసుకొంటుంది

లేతమొక్కలా కూలిపోయిన నీవు
నిలబడతావు, నిలబడతావు
ఒక మహావృక్షపు ఛాయను నీ వెనుక చిత్రించుకొంటూ

మేఘాలు నుదుటిని చుంబించేవరకూ నిలబడుతూనే ఉంటావు

______________________
ప్రచురణ: ఈమాట నవంబర్ 2014

27 నవంబర్ 2014

ఎవరెవరు..

ఎవరెవరు వెళ్లిపోదలచారో వెళ్లనివ్వు నీ జీవితంలోంచి
వెళ్ళిపోవటాలు చూడటానికే నువ్వొస్తావు

ఒకానొక కాలం నిన్నొక వాకిలి చేసి నిలబెడుతుంది
ఎవరెవరో పని ఉన్నట్టే నిన్ను దాటి
హృదయంలోకి వస్తారు, నీలో వెదుకుతారు
వాళ్ళు నీ వాళ్ళని అనుకొంటూ ఉండగానే
ఇక్కడేమీ లేదు, అంతా ఖాళీ అని
గొణుగుతూ వడివడిగా వెళ్ళిపోతారు

నిజమే, ఖాళీలలో ప్రవేశించే ఖాళీలు
ఖాళీలలోంచి బయటికి నడిచే ఖాళీలు
ఖాళీ అనుభవాలతో లోపలి ఖాళీ నింపుకోవాలనే వెర్రివ్యాపకమొకటి
వేసవికాలపు వేడిగాలిలా సుడితిరగటం మినహా, నిజానికి ఇక్కడేమీ లేదు

వెళ్ళనీ ఎవరు వెళతారో, త్వరగా, మరింత త్వరగా
ఎగరబోతున్న పక్షిరెక్కల్లోంచి జారిపోతున్న తూలికలా
అరచేతుల్లో వాలి మాయమైపోతున్న ఉదయకిరణంలా
మేలుకోగానే తెలియరాని మైదానంలోకి రాలిపోయిన కలలా

ఓ దీర్ఘశ్వాస తీసుకొని, హాయిగా విడిచేయి శ్వాసనీ, మనుషుల్నీ
స్వప్నసరోవరంలోకి హంసల్ని విడిచినట్లు సుతారంగా, తేలికగా..

_________________
ప్రచురణ: కినిగే 13.10.14

13 నవంబర్ 2014

'ఆకాశం' కవితాసంపుటిపై గరికిపాటి నరసింహారావుగారు

'ఆకాశం' సంపుటి గురించి గరికిపాటి నరసింహారావుగారు ఇటీవల రాసిన ఉత్తరం, మొన్న 11 వతేదీన భక్తి టీవీలో చెప్పిన మాటలు ఆసక్తి ఉన్న మిత్రులు ఇక్కడ చూడగలరు. 

భాగ్యనగరం,
17-10-2014 

ఆకాశం కొలవడం అసాధ్యం. చదవడం సాధ్యమే కానీ చాలాకాలం పడుతుంది. అందుకే ఇంతకాలం పట్టింది.

నేను ఏ పుస్తకం చదివినా నచ్చిన వాక్యాలకు V గుర్తు పెట్టుకుంటూ ఉంటాను. మొత్తం కవిత అంతా ప్రత్యక్షరం బాగా నచ్చితే దాని శీర్షికకే V గుర్తు పెట్టేస్తాను. అలాంటివి ఆకాశంలో చాలా నక్షత్రాలున్నాయి. ఇంటిబెంగ, అంతరాత్మవంటివాడు, చాలు, మనలో ఒకడు, సంపాదన, కలుసుకోవాలి, చివరచూసినవాడు, గోడ, మొదటిప్రశ్న, నేను ఉన్నాను, సున్నితంగా, కవిత్వం, చివరిమాటలా, పంజరాలు, కవీ-మేఘమూ, బ్రతుకుపాట, బహిరంతరాలు - ఇవన్నీ అంతబాగా నచ్చేసినవే. 'చాలు ' అనే కవిత అయితే దానికే విసుగొచ్చేన్నిసార్లు చదువుకొన్నాను.

'మనం చిన్నచిన్న ఆకాశాల' మనడంలో జీవ లక్షణం బాగా చెప్పారు. ఆకాశంలోకి చూడటమంటే అమ్మ ముఖంలోకి చూడటమనే అభివ్యక్తి చాలాబాగుంది. 'ఇంటిబెంగ ' లో 'న జీవ బ్రహ్మణోర్భేద: ' అనే తత్త్వం సున్నితంగా వ్యక్తమయింది. అలలులేని కొలనే పాలసముద్రం. ఆలోచనలే అలలు. పాలసముద్రంలో విష్ణువు ఉంటాడంటే అర్థం ఆలోచనల్లేకపోవడమే దైవదర్శనం అని. ఈ తత్త్వం అంతా 'కొలను ' లో సూక్ష్మంలో మోక్షంలా చెప్పారు. 26-2-11 నాటికి 3-3-11 నాటికి మీ అవగాహన ఎంత విస్తృతమైందో 'ముక్తికాంక్ష ' ద్వారా తెలుస్తోంది. కవితలకు తేదీలు వెయ్యడంలో కొన్ని ప్రయోజనాలుంటాయన్నమాట. 

చినుకుతో పోరాడిన జీవి చందమామలా బయటకు రావడం స్వాతిముత్యం స్థాయికి తగిన ఉపమానం. లోకానికి గెలుపుజ్వరం తగిలిందనడం పచ్చినిజానికి పండిన అభివ్యక్తి. 'పనిచేయకపోవడమే సరైన పని ' అనేది చూడగానే 'న కుర్యాత్ న విజానీయాత్ ' అనే శంకరాచార్య వేదాంతడిండిమం గుర్తువచ్చింది. 'అలవాటు మహా మాయ ' అనడం గాఢతాత్త్వికభావన. అపురూపమైన మనిషివర్ణనలో ప్రతివాక్యం అపురూపమే. 'గదిలో వాలిన కిరణాలు పనిమీద వీధిలోకి ' వెళ్ళడం ఎంతబాగుందో! మీరన్నట్లు నిశ్శబ్దాన్ని మోసుకొస్తే ధ్యానం కుదిరినట్లే. 'మనలో ఒకడు ' అసూయకు మంచిమందు. స్త్రీ పురుషాకర్షణ పెళ్ళికి ముందు పూవుతుమ్మెదలాంటిదై, పెళ్ళయ్యాక దీపం శలభం లాంటిది కావడం చూస్తూనే ఉన్నాం.

మరింత పేరు, మరింత డబ్బూ ఉంటే జీవనానందం సమాధి అయిపోయినట్లేనని అద్భుతంగా చెప్పారు.

'మనల్ని మనమే శ్రద్ధగా జాగ్రత్తగా బంధించుకుంటాం ' అనేమాట భాగవతంలోని 'త్యజేత కోశస్కృది వేహమాన: కర్మాణి లోభా దవితృప్తకామ: ' అనే వ్యాసవాక్యాన్ని గుర్తుచేసింది. 'వస్తాము ' అనే ఖండికలో జన్మ ఎత్తడంలో ఉండే తత్త్వమంతా ఉంది. 'కలుసుకోవాలి ' అనే కవిత ప్రపంచానికి మార్గదర్శి. 'చివరచూసినవాడు ' కవిత మనిషిలోని అపరిపూర్ణతను ఆవిష్కరించింది.

'వాడి ఆటకు మనం ఆటంకం కాకపోతే చాలు ' అనే మాట 'ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు: ' అనే మనీషాపంచక వాక్యాన్ని గుర్తుచేసింది. 'ప్రపంచం ఒక గోడ ' అనే 3 పంక్తుల్ని ఇప్పటికే మూడు నాలుగు సభల్లోనూ, టీవీలోను మీ పేరుచెప్పి మరీ చెప్పాను.

నేనెవరు అని ప్రశ్నించుకోడానికి అంతా విరామసమయమే అయిపోతే ఎంతబాగుండును! 'నేనున్నాను ' కవిత దానికదే ఒక ఉపనిషత్తు.

మొత్తం మీద మీ 'ఆకాశం ' లో 'ఉన్నదంతా దైవమే. జీవితమే దైవం. ' ఎంతరాస్తే న్యాయం జరుగుతుంది. దాచుకొని మళ్ళీమళ్ళీ చదువుకోవలసిన కవితాసంపుటి అందించారు. ఆజన్మాంతం కృతజ్ఞుణ్ణి. 

గరికిపాటి నరసింహారావు 

భక్తి టీవీలోని ప్రసంగభాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వారి సహృదయానికి అనేక నమస్సులు తెలియచేస్తున్నాను.