09 ఫిబ్రవరి 2015

ఈ శీతాకాలపు ఉదయం

           ఈ శీతాకాలపు ఉదయం. రాత్రంతా మంచుముక్కలా బిగుసుకొన్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండితెరల కాంతిలోంచి జారుకొంటూ గడ్డిపరకలపై కన్నుతెరిచాయి. ఇక చాలనుకొంటూ కాంతిబాజా మ్రోగిస్తూ కనిపించనిచోటికి నిన్ను పిలుస్తూ మాయమయ్యాయి. ఈ ఉదయం తొడుక్కొన్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్తసంతకాలు చేస్తున్నాయి. మనుషులు సరే. ఎప్పట్లానే ప్రాణాన్ని పట్టుకోమంటే దేహాన్ని తాకుతూ, ఇంత బంగారుకాంతికీ రవంతైనా కరగని ఇనుపస్పందనలతో, మోసపోయామని తుప్పుపట్టిన పాటనే మ్రోగిస్తుంటారు. నువ్వూ అంతే. ఓ గాలితెర అన్నీ వదలి రమ్మన్నా వినకుండా, భాష వృధా అనుకొంటూనే, దానికి తొడిగిన లిపిని విప్పుతూ, మడతలు పెడుతూ నీదికాని ఆట మళ్ళీ మొదలుపెడతావు.

మళ్ళీ ఒక విరామం. దాన్లోకి బట్టల్లేకుండా దూకాలని తెలిసికూడా, జ్ఞానంతో మసకబారిన కళ్ళనైనా తుడుచుకోకుండా  మునుగుతావు. రంగుల్లేని విరామం నీ రంగుల్ని ఒప్పుకోదు. నిన్ను ఒప్పుకోని విరామాన్ని నువ్వూ ఒప్పుకోవు. నీకింకా చాత కాలేదు, నదిలోకి నీ నీడని విడిచి దూకటమెలానో. మరోసారెపుడైనా ప్రయత్నించు నీడలేకుండా నడవటానికి. నువ్వు బాధకాదు, నీ నీడ బాధ. నీకు తెలియకపోయినా పోయేదిలేదు. నీ నీడకి తెలిసీ ఉపయోగం లేదు. 
 
తెలీదు. మళ్ళీ విరామమో, కాదో. ఇప్పటికి చాలు. అలా వీధిలోకి వెళ్ళి, తెల్లని ఎండలో సంచరించే రంగురంగుల చీకట్ల ధూళి చల్లుకురావాలి. మరి బ్రతకాలి అందర్లో ఒకడిలా. అందర్లానే అయిష్టంగానో, ఇష్టంగానో అర్థంకాకుండానే. 

ఏ దైవమో విడిచిన బాణంలా ముందుకు దూసుకుపోతుంది కాలం. ముందు వెనుకలుగా మార్చుకొంటున్న వాక్యాల్లోంచి కూడా కాలం ముందుకు వెళ్ళిపోతుంది. చూసినవేవీ గుర్తుండవు. గుర్తుండేలా చూడాల్సినవీ లేవు. స్మృతి కన్నా మరపు సుఖం. రాసిన రాతల కన్నా అవి శయనించిన తెల్లకాగితం ఎక్కువ చెబుతుంది. చూసినవి మరిచిపోవద్దు, చూసేవాడిని మర్చిపోతే చాలు. పదాల నెందుకూ, వాటిలో నింపిన అర్థాల నెందుకూ, మరిచిపోతే చాలు మాట్లాడేవాడిని. 

ఆకాశపు నగారా అదేపనిగా మ్రోగిస్తో చెబుతోంది జీవితం. నీ అంతట నువ్వు బ్రతకనపుడు, బ్రతుకు నిన్ను బ్రతికించుకొంటుంది. ఎందుకూ బ్రతకాలనుకోవటం, చావాలనుకోవటం. పుట్టి, పోవుటలు నాటకము, నట్టనడిమి ఈ చూపొక్కటి నిజము. ఇటునించి అటు వెళ్లినపుడు అశ్వత్థవృక్షం అర్థమవుతుంది. 

మరి వెళ్ళిరానా అన్నావు ఆరోజు. ఆ మాట కోసమే ఎదురుచూస్తుందన్న నిజాన్ని మర్యాదగా బయటికి రానివ్వకుండా, సరే మరి అంది. భూమ్మీద వేల జీర్ణపత్రాలు రాల్చినవాడివి, సరే లోలోపల అప్పటికే మూసుకొన్న తలుపుల్ని గుర్తుపట్టి కూడా ఏమీ తెలియనంత ప్రశాంతంగా బయటికి నడిచావు. నీడల లిపి తెలుసు గనుక ప్రేమ నుండి లభించిన స్వేచ్ఛని ఇట్టే పోల్చుకొన్నావు. ఇంటి క్రీనీడలో ఆమె నీడ చిక్కగా కరిగిపోయింది. ఆమె హృదయంలోంచి బయటకు వచ్చాక ఆకాశం మరింత నిర్మలంగా కనిపించింది.       

ఇంత దు:ఖం ఎలా మోయనంటావు బరువు కనబడనీయని తేలికైన మాటల్లోకి తడుముకొంటూ. మోసేవాణ్ణి దించేస్తే, జీవితం మోసుకొంటుంది, నీకేం పని అని ఆ జెన్‌ సాధువు. అతను లేకపోతే నా జీవితం బోసిపోతుంది మరి అంటావు. అదీ సంగతి అని నవ్వుతూ నువ్వొదలని మాటల్నీ, నీడల్నీ నీకు విడిచి నిర్లక్ష్యాన్ని భుజాని కెత్తుకొని నీటిమీద నడుస్తూ వెళ్ళిపోతాడు. బరువుగా ఉండటమే బ్రతకటమని నమ్ముతాం గనుక, తేలికైన జీవితం తెలియకుండానే వ్రేళ్ళ సందుల్లోంచి జారిపోతుంది. 
. . .
కాలం మరికొంత వెన్నలానో, వెన్నెల్లానో, కొవ్వులానో కరిగాక నువ్వూ, నేనూ, నిందలూ ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోదాం. కాలం లేనిచోట నిలిచే విద్య తెలియలేదు గనుక, మరోసారెపుడైనా మళ్ళీ కలుద్దాం కొత్త పాతమొహాలతో. అప్పటి శీతాకాలపు ఉదయంలోంచి కూడా దేవుడేం చెప్పేదీ వినబడకుండా శబ్దాలతో మనని వెచ్చగా కప్పుకొందాం, అచ్చం ఇలానే. ఇంతకు ముందులానే.

___________________
ప్రచురణ: వాకిలి ఫిబ్రవరి 2014

26 జనవరి 2015

సూర్యదేవుని..

సూర్యదేవుని దివ్యరథం దక్షిణ పొలిమేరల్లో ఆగింది
ఏడురంగుల గుర్రాలు ఉత్తరానికి చూస్తున్నాయి  

తండ్రీ, ఎందుకు దిశ మార్చి వెనుకవైపు తిరిగావంటాడు కవి
కాంతిలా ముందుకు చూసే క్రాంతదర్శి కవి 
కాంతిని ప్రసరించే సూర్యుడతని ఆత్మకు తండ్రి

కుమారా, ఇది భగవంతుని నిర్ణయం
సృష్టి సమస్తం ఆయన స్వప్నం
దక్షిణదిశగా స్వప్నం విస్తరిస్తూ వుంది 
ఆయన ఉత్తరాన విశ్రాంతిగా గమనిస్తున్నారు

నన్ను దక్షిణానికి అనుసరించేవారు
లోకం నిజమనే సరదాతో కాలంలో మునిగితేలుతుంటారు
ఇదేం బాగా లేదు, దైవానికి దూరమయే ఈ ఈతకు తుదిలేదని 
ఉక్కిరిబిక్కిరితో దు:ఖపడేవారు నాతో ఉత్తరానికి నడుస్తారు
ఈ లీలని కలగంటున్న ఆయన్ని చేరుకొంటారు 

ఆకాశంలో నేనూ, భూమ్మీద నువ్వూ
పరమాత్ముని అంతరంగం ముందుగా గ్రహిస్తాము 
ప్రజాపతులమై వారికి మరచిన దారి చూపిస్తాము 
సృష్టిని పసిబిడ్డలా ఎగరేసి పట్టుకొనే తండ్రి ఆజ్ఞ శిరసావహిస్తాము

సూర్యదేవుని దివ్యరథం మకరరాశిలోకి వేగం పుంజుకొంది
రంగురంగుల అక్షరాలను పలికి 
కవి భగవంతునివంటి మౌనంలో కరిగిపోయాడు

17 జనవరి 2015

కవిత్వం చదివేటపుడు

కవిత్వం చదవబోతున్నపుడైనా నీలో మెత్తదనం ఉండాలి
వెలితిగా వున్న ఆకాశంనిండా 
మెలమెల్లగా విస్తరిస్తున్న మేఘంలాంటి దిగులుండాలి
అక్షరాలపై సంచరించే చూపు వెనుక 
ఒక వర్షం కురిసేందుకు సిద్ధంగావుండాలి

కవిత్వాన్ని సమీపిస్తున్నపుడైనా
వానకాలువలో పరుగెత్తే కాగితం పడవలో ప్రయాణిస్తూ
సుదూరదేశాల మంత్రనగరుల్ని చేరుకొనే
అమాయకత్వం నీలో మేలుకోవాలి

కవి ఏమీ చెయ్యడు 
కన్నీటిలోకో, తెలియనిలోకాలపై బెంగపుట్టించే సౌందర్యంలోకో 
తను చూసిన దారిలోకి ఆహ్వానించటం మినహా
కవి నిన్ను పిలిచినపుడైనా
మగతనిదురలోంచి జీవించటంలోకి చకచకా నడిచివెళ్ళాలి

నిజానికి, కవిత్వాన్ని సమీపించినపుడైనా
మనందరి ఏకైక హృదయాన్ని సమీపించే రహస్యం గురించి  
నీకు నీదైన ఎరుక వుండాలి

_______________________
ప్రచురణ: వాకిలి.కాం  జనవరి 2014

26 డిసెంబర్ 2014

పూవురాలేను

పగటి కాంతిరేకలు చీకటుల సోలినటు
మధురస్వప్నమొకటి మెలకువన జారినటు
ఆమె వెన్నెలనవ్వు నీలోకి వాలినటు
పూవురాలేను పూవువలె నెమ్మదిని

గాలివాలువెంట ఒంపు తిరిగి
గాలినొక పూవుగా హొయలు దీర్చి
రంగురంగుల గిరికీలు చుట్టి
కాంతినొక పూవుగా చిత్రించి విడచి

నేలపై మృదువుగా మేనువాల్చి
నేల నొకపూవు రేకులా మలచి
పూవొకటి రాలేను ఇచట ఈ స్థలములో
తననీడపై తాను సీతాకోకయ్యి వాలేను

సెలయేటి పరుగులా, పసిపాప నవ్వులా
చిరుగాలి తరగలా, పరిమళపు తెరలా
పూవొకటి రాలేను ఈ క్షణములోన
పూవంటి క్షణమొకటి రాలేను స్వప్నమ్ములోన

_______________________

18 డిసెంబర్ 2014

తోటివారిని

తోటివారిని గాజులానోపూలలానో,
కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడలేమా
బహుశాగ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే   
అద్దంలో ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం

నిజంగా, తెలియనిచోట ఉన్నాం కదా
భూమి ఏమిటోఆకాశం ఏమిటో,
మెరిసే ఉదయాస్తమయాలూదిగులు కురిసే నల్లని రాత్రులూ
ఎందుకున్నాయోఏం చెబుతున్నాయో తెలియని
మంత్రమయస్థలంలో దారి తెలియక తిరుగుతున్నాం కదా

కనులంటే ఏమిటోచూడటమేమిటో,
చూపు బయలుదేరుతున్న లోలోపలి శూన్యపు అగాధమేమిటో
ఎరుక లేకుండానే ఋతువుల నీడల్లో తడుముకొంటున్నాం కదా

ఎవర్ని లోపలికంటా తడిమిచూసినా ఏముంటుంది
గుప్పెడు ప్రశ్నలూకాస్త కన్నీరూఇంకా అర్ధం సంతరించుకోని  ఒక దిగులుపాట మినహా
ఎవరి కథ చూసినా ఏముంటుంది
అంచులు కనరాని కాలపు ఊయలలో ఏడ్చేనిదురించే పసిబిడ్డ లోపలి నిశ్శబ్దం మినహా

తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం
చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరికొకరం
చూడలేమా ఒకరిలోకొకరం మరికాస్త సూటిగాలోతుగానమ్మకంగా..

__________________
ప్రచురణ: సారంగ 11.12.14 

11 డిసెంబర్ 2014

'ఆకాశం' సంపుటికి నూతలపాటి కవితా సత్కారం

'ఆకాశం' సంపుటి నూతలపాటి కవితా సత్కారం - 2011 కు ఎంపికైంది. ఈ మేరకు 'ఆకాశం' కవితాసంపుటి కవి బివివి ప్రసాద్ ని నవంబరు 15 న తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో గంగాధరం సాహితీ కుటుంబం వారు ప్రశంసా పత్రం, నగదుతో సత్కరించారు. 

ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గంగాధరం సాహితీ కుటుంబం అధ్యక్షులు విద్వాన్ ఎస్.మునిసుందరం, కార్యదర్శి ఆచార్య డి. కిరణ్ క్రాంత్ చౌదరి, ఆచార్య మేడిపల్లి రవికుమార్, కవులు బివివి ప్రసాద్, పలమనేరు బాలాజీ (నూతలపాటి కవితా సత్కారం - 2012 కు ఎంపికైన 'ఇద్దరిమధ్య' కవితాసంపుటి కవి), నూతలపాటి వెంకటరమణ పాల్గొన్నారు.

సభ విశేషాలు ఇక్కడి ఫొటోలు, ఆడియో, వీడియో లలో గమనించవచ్చును.


'ఆకాశం' పై మేడిపల్లి రవికుమార్ ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ఇద్దరిమధ్య' పై మేడిపల్లి రవికుమార్ ప్రసంగానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బివివి ప్రసాద్ ప్రసంగం వీడియోకు ఇక్కడ క్లిక్ చేయండి.