12 మార్చి 2018

ఏడు పుస్తకాలు : 4. ద పవర్ ఆఫ్ నౌ - ఎకార్ట్ టోలీ

జ్ఞానం, మరీ గంభీర పదమైతే, 'మెలకువ' అందాం, ఎవరికి ఎలా ప్రాప్తిస్తుందో తెలియదు. ఎకార్ట్ టోలీ తీవ్రమైన నిస్పృహలో నెలల తరబడి జీవించాడు. 29 వ యేట ఒకరాత్రి చాలా రాత్రుల్లాగే సరిగా పట్టని నిద్రనుండి తటాలున మేలుకొన్నాడు. ఇక నన్ను నేను ఎంతమాత్రమూ భరించలేననిపించింది ఆయనకి. అంతలో ఒక ప్రశ్న. నన్ను నేను భరించలేను అంటున్నానేమిటి, అంటే భరించే నేనూ, భరించబడే నేనూ రెండున్నాయా అనుకొంటాడు. అది కేవలం మేధో పరమైన ప్రశ్న కాదు, తన మౌలిక చేతనలోకి తొలుచుకుపోతున్న ఒక చూపు. అకస్మాత్తుగా ఏదో శక్తి తనని సంపూర్ణంగా లొంగదీసుకొంటున్నట్టు అనుభవమవుతూ వచ్చింది. నిద్రపట్టింది. లేచాడు. తను చూస్తున్నది తాజా ప్రపంచం. కిటికీలోంచి పక్షికూత వినిపించింది. ఆ కూత ఒక వజ్రంలా అనిపించింది. కొన్ని నెలలు ఆలోచనలూ, భయాలూ, వేదనలూ తాకలేని ఆనందంలో మునిగిపోయాడు. తరువాత తన అవగాహనని ప్రపంచంతో పంచుకోనారంభించాడు. ఆయన రాసిన పుస్తకం ఈ పవర్ ఆఫ్ నౌ. కొద్దిగా అంతరిక అన్వేషణలో ప్రవేశం ఉన్నవారికి ఈ టైటిల్ చాలా చెబుతుంది.

మిత్రుల దగ్గరనుండి సంపాదించిన పుస్తకాన్ని జిరాక్స్ తీసుకొన్నాను. పూర్తిగా చదవలేదు ఈ నాటికీ. అక్కడక్కడ చదివే సరికి ఆయన దేనిని సూచిస్తున్నారో అర్థమైంది. అది సరిపోయిందనిపించింది. అంతరిక అన్వేషణకి సంబంధించిన మౌలిక సూత్రాలు చాలా సరళమైనవి. సంక్లిష్టమైన మనసు పొరల్ని తొలగించుకోవటంలోనే ఉంది కష్టమంతా. ఆయన చెబుతున్నది అంతా టైటిల్ లోనే వచ్చింది. ఈ క్షణపు శక్తి.

గతం, భవిష్యత్తూ మానసికమని మనకి తెలుస్తూనే ఉంటుంది. వర్తమానానికి మాత్రమే భౌతికత ఉంటుంది. ఈ వర్తమానపు వాస్తవికతలో కూడా పంచ భూతా (ఫైవ్ ఎలిమెంట్స్)త్మక ప్రపంచానికి ఆధారంగా, స్థిరంగా మరొక వర్తమానం ఎప్పుడూ ఉంది. దీనినే అనంత వర్తమానం అంటారు రమణ మహర్షి. సత్యం ఇప్పుడే, ఇక్కడే ఉంది అంటారు నిసర్గదత్త. ఇంకా సులువుగా అర్థం కావాలని, ఇప్పటి లోపల ఇప్పుడు అంటారు ఆయన. మొదటి ఇప్పుడు మానసికం, ఇంద్రియ సంవేదనాత్మకం. రెండవ ఇప్పుడు ఏమీలేని లేదా అంతా తానే అయిన ఇప్పుడు. దానినే ఎకార్ట్ టోలీ ప్రధానంగా ప్రతిపాదిస్తూ వచ్చారు. కాస్త చూపు సూక్ష్మమైతే తెలుస్తుంది ఆ ఇప్పుడు, దాని అనంత శక్తి, కాంతి. కానీ, మనస్సు బూడిదై అది మాత్రమే మిగలటం అంత తేలికేమీ కాదు. ఆ దివ్యమైన వర్తమానానికి మేలుకోవటానికి ఎకార్ట్ టోలీ సూచనలు ఎంతగానో ఉపకరిస్తాయి.




ఈ పుస్తకం ఆన్ లైన్ సైట్లలో లభిస్తుంది.

ఏడు పుస్తకాలు : 3. క్రాంతి బీజాలు - ఓషో

 ఓషో రచనలలో నేను చదివిన మొదటిపుస్తకం ఇది. ఓషో జీవిత విధానమూ, ఆయన బోధ గురించి జరిగిన దుష్ప్రచారాల వలన చాలా కాలం ఆయన్ను దూరంగానే పెట్టినా, మిర్దాద్ కు ముందు కనిపించిన ఆయన నాలుగుమాటలూ, భిన్నంగా ఆలోచించేలా చేసాయి. ఒక మిత్రుడి దగ్గర ఈ పుస్తకం చూసి, చదువుకొని, ఏ పుస్తకమూ రెండోసారి చదివే అలవాటు లేకపోయినా, స్వంతంగా ఒక పుస్తకం ఉండాలని కొనుక్కొన్న కాపీ ఇది.

తన శిష్యురాలు ఆనందమయికి ఓషో రాసిన ఉత్తరాలు ఈ పుస్తకం. చాలా మృదువుగా, ప్రేమగా జీవితం పట్ల ఎరుకని బోధిస్తారు ఈ ఉత్తరాల్లో. మేథ తో కాక, హృదయంతో ఓషో భావాలని సమీపించినపుడు, మన జీవితాల్లో అంతకుముందు లేని తాజా వెలుతురు ప్రసరిస్తుంది.

నా వరకూ అన్ని రకాల కండిషనింగ్ ల నుండీ విముక్తం కావటానికి, కాగల ధైర్యం తెచ్చుకోవటానికి చలం తరువాత ఓషో మహోపకారం చేసారని భావిస్తాను.



ఓషో రచనలు ఇప్పుడు తెలుగులో కూడా విరివిగా లభిస్తున్నాయి. ఆన్ లైన్ లో వెదకవచ్చును.

ఏడు పుస్తకాలు : 2. మిర్దాద్ - మైకేల్ నేమీ

మైకేల్ నేమీ అనే రచయిత (కవి?) రాసిన నవల ఇది. జిబ్రాన్ ప్రాఫెట్ ని పోలిన ప్రబోధాత్మక రచన. ఒక మనిషి జీవితాన్ని, దానిలో తోచే అన్నిదోషాలతో సహా ఇంతగా ప్రేమించవచ్చా అని ఆశ్చర్యం కలిగింది చదువుతుంటే. ఇది ఒక పవిత్రమైన రచన అనిపిస్తుంది. కవరు మీది మాటలు ఓషో అన్నవి అనుకొంటాను. అప్పటికి ఓషోని చదవలేదు గనుక చదివే ముందు పట్టించుకోలేదు. చదివాక వాటినీ, ఓషోనీ కూడా పట్టించుకొన్నాను.


ఈ పుస్తకం తెలుగు అనువాదం పిరమిడ్ ప్రచురణగా లభిస్తోంది.
ఇంగ్లీషు పుస్తకం ఆన్ లైన్ సైట్లలో  లభిస్తుంది.


ఏడు పుస్తకాలు : 1. భగవాన్ స్మృతులు - చలం

 శ్రీ రమణమహర్షి సన్నిధిలో జీవించినవారి అనుభవాలని చలం రికార్డు చేసిన పుస్తకం ఇది. ఇది చదివేనాటికి జీవితం గురించీ, మనుషుల గురించి తీవ్రమైన అయోమయంలో ఉన్నాను. ఇది చదివాక, జీవితానికి ఒక అద్భుతమైన లక్ష్యం ఉందనీ, భూమ్మీద దురదృష్టకరమైన మానవజాతిలో నూరుశాతం ప్రేమించదగిన, నమ్మదగిన మనిషి ఒకరైనా జీవించి వెళ్ళారనీ అర్థమైంది.



ఈ పుస్తకం ఇప్పుడు ప్రియదర్శిని ప్రచురణలు, హైదరాబాద్ వారివద్ద లభిస్తోంది. 
శ్రీ రమణాశ్రమం,  తిరువణ్ణామలై వారి వద్ద కూడా లభిస్తుంది.

పుస్తకాలూ - నేనూ

శరత్ బాబు రచనలతో మొదలైన సీరియస్ సాహిత్య పఠనం దాదాపు రెండు దశాబ్దాలు సాగింది. తరువాత ఒక దశాబ్దం ఎంపిక చేసుకొన్న పుస్తకాలు మాత్రమే చదవగలిగాను. చివరగా ఇష్టంగా చదువుకొన్నది నిసర్గదత్త మహరాజ్ సంభాషణల పుస్తకాలు. సుమారు ఏడెనిమిదేళ్ళుగా చదవటం ఆగిపోయింది. ఇప్పుడు చదవమంటే, బడి పుస్తకాలు చదవమన్నంత బాధ.

చదవటం కన్నా చూడటం, స్పందించటం ముఖ్యం. వాటికన్నా లోనికి చూసుకోవటం ముఖ్యం. లోచూపు చిక్కితే, తనకి కావలసినవి చాలాసార్లు తనకే తెలుస్తాయి. దానిని సహజ జ్ఞానం (intuition) అనవచ్చునేమో. ఇదేమీ ప్రత్యేక విద్యా / ప్రతిభా కాదు. అది ఎప్పుడూ ఉన్నదే. లోపలి దుమ్మునీ, గట్టిపడిన భావజాలాలనీ, ఉద్వేగాలనీ, వాటి వెనుక అంతకన్నా బిగుసుకుపోయిన అహంభావాన్నీ ఎంత వదులుకోగలిగితే, అంతగా ఆ స్ఫురణ ప్రకాశిస్తుంది.

కానీ, బహుశా, చదవటంలో ఏమీ లేదు అని తెలిసే వరకైనా, చదవటం మంచిది. దాని వలన మేథ వికసిస్తుంది. చూపు విస్తృతమౌతుంది, అనేక తలాలని తాకుతుంది. అనుభవశక్తీ, వ్యక్తీకరణశక్తీ సున్నితమౌతాయి. పదును దేరుతాయి. తరువాత, వాటితోనే ఆగిపోకుండా, జీవితానుభవంలోకి ప్రయాణించాలి.

ఫేస్ బుక్ లో సునీతా రత్నాకరం గారు ఏడు పుస్తకాల ఆటకి (చాలెంజ్ పదం బాగోలేదు నాకు) టాగ్ చేసినప్పుడు, జీవితంలో ఆయా దశల్లో బాగా లోతుగా తీసుకొన్న రచనలేవా అని చూసుకొంటే, సుమారు ఇరవై పుస్తకాలు గుర్తొచ్చాయి. మరికాస్త జ్ఞాపకంలోకి వెళితే మరో ఇరవై కూడా ఉండవచ్చును. కొన్నిసార్లు పుస్తకం అంటే రచయిత / కవి అని కూడా అర్థం. :) చివరి ప్రభావాలకి సంబంధించిన ఏడు పుస్తకాల గురించి చెప్పదలిచాను గనుక, మిగిలిన లిస్టు ముందుగా రాస్తున్నాను.

బాగా చదివిన రోజుల్లో ఇంగ్లీషు అంతగా రాకపోవటమూ, కొద్దిగా ఇంగ్లీషు వచ్చాక, చదివే ఆసక్తి పోవటమూ జరగకపోతే ప్రపంచ సాహిత్యం బాగా చదువుకొందును కదా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ, దానికేమీ దిగుల్లేదు.

ఇంతకన్నా రాయటం చాతకాకనో, ఇది రాయటం చాతనయో కవిత్వం రాసుకొంటున్నాను కాని, వ్యక్తిగతంగా రచనా ప్రక్రియల్లో నవలకి అభిమానిని. అంత ఊహ ఎలా చేస్తారా అని ఆశ్చర్యం ఏ టాల్ స్టాయో, చండీ దాసో గుర్తుకు వస్తే. తరువాత వ్యాసం, కథ. ఆ తరువాతనే కవిత్వం. ఈ లిస్టు కూడా ఆ విషయాన్నే ధ్రువ పరుస్తుంది. :)

శరత్ శ్రీకాంత్, ఇతర నవలలు, కథలు  
విశ్వనాథ నవలలు, కథలు  
ప్రేంచంద్ నవలలు 

శ్రీశ్రీ మహాప్రస్థానం
చలం మ్యూజింగ్స్, స్త్రీ, ప్రేమలేఖలు, బిడ్డల శిక్షణ
సంజీవదేవ్ దీప్తిధార, ఇతర వ్యాసాలూ
గోపీచంద్ పోస్టు చెయ్యని ఉత్తరాలు 
నండూరి రామమోహనరావు విశ్వదర్శనం 

వడ్డెర చండీదాస్ అనుక్షణికం
విక్టర్ హ్యూగో బీదలపాట్లు
టాల్ స్టాయ్ యుద్ధమూ శాంతి
అలెగ్జాండర్ కుప్రిన్ యమకూపం
అలెక్స్ హేలీ ఏడుతరాలు
అలెగ్జాండర్ డ్యూమా కౌంట్ ఆఫ్ మాంట్ క్రిష్టో

ఖలీల్ జిబ్రాన్ ప్రాఫెట్, ఇతర కవిత్వం  
టాగోర్ గీతాంజలి, మిగతా కవిత్వం 
చలం వెలుగురవ్వలు
మసనోబు ఫుకువోకా గడ్డిపరకతో విప్లవం
జిడ్డు కృష్ణమూర్తి కామెంటరీస్ ఆన్ లివింగ్ 
మహేష్ భట్  యూజీ కృష్ణమూర్తి 
రిచర్డ్ బాక్ నవలలు
పాలో కోయిలో నవలలు