14 ఆగస్టు 2025

కవిత : కొంచెం మిగిలినా..

ఈ లోకంలో 
కరుణ మిగిలి ఉన్నందుకు ధన్యవాదాలు

ఉదయపు కిరణాలలో కాంతీ, గాలిలో శాంతీ,
మధ్యాహ్నపు ఎండలో నీడలూ,
సాయంత్రపు దిగుల్లో గగనం నిండా రంగులూ 
మిగిలినందుకు ధన్యవాదాలు

పిల్లలింకా అమాయకంగా 
కన్నార్పక చూస్తున్నందుకు ధన్యవాదాలు

చీకటి మూగిన వేళల 
నింగిలో మూగగా వెలిగే తారలూ,
జీవులు భయంలో మునిగినప్పుడు
కొనవూపిరిలా మెరిసే ఆశలూ,
స్పర్శలో అరుదుగా తాకే ఆర్ద్రతా 
ఈ లోకంలో మిగిలినందుకు ధన్యవాదాలు

కొంచెం ప్రేమ మిగిలినా చాలు,
కఠినమైన చలివేళల ఒక వెచ్చని ఊపిరి చాలు,
ద్వేషాలూ, అపనమ్మకాల మధ్య తడిచూపు చాలు

ఈ లోకం మరిన్ని వేలయేళ్ళు బతుకుతుంది,
ఒక మనిషి మరికొన్ని రోజులు బ్రతుకుతాడు,
నీరెండ మరికొన్ని క్షణాలు 
జీవితాన్ని దీవించి వెళుతుంది

బివివి ప్రసాద్

13 ఆగస్టు 2025

కవిత : ఉండాలి..

ఉండగా ప్రేమించటానికి లెక్కలు వేస్తాం
వెళ్ళిపోయాక చెల్లా చెదురవుతాయి,
మనుషుల కన్నా బుద్ధిహీనం ఉంటాయా,
కాస్త ప్రేమిస్తే చాలు 
ఉదయాలు తాకినట్టు బ్రతుకుతారు వాళ్ళు 
ఒకరికొకరమని సంతోషపడుతూ

ఏ పగలు ఒకరు రాలిపోతారో తెలీదు,
ఏ రాత్రి ఒంటరితనాన్ని మిగిల్చివెళతారో,
బ్రతికున్నాం కదా, ప్రేమించుకుందామని
ధైర్యం చెప్పుకునే తెలివొస్తుందా ఏనాటికైనా
బ్రతికివెళ్లారు కదా ప్రేమించుదామనే రోజులొస్తాయా 

మనుషుల కన్నా అమాయకం ఉన్నాయా,
కాలాలకి తమవారిని బలి ఇచ్చే 
తెలివిలేని జీవులు ఉంటాయా,
లేవగానే, నువు ఉన్నావు చాలనే 
భరోసాతో ఒకరికొకరు ఉండటం కన్నా,
ఈ ఒంటరిలోకం ఎవరి నుండి ఏమాశిస్తుంది
కొంచెం ప్రేమ కోసం కదా, ఇదంతా ఇలా పుట్టింది

నవ్వుతావో, ఏడుస్తావో నీ స్వేచ్ఛ,
ఇక్కడ ఉండు నీకు నచ్చినట్టు,
నాకు దగ్గరగానో, దూరంగానో,
నువు ఉన్నావన్న స్పృహ చాలు,
నేను నిండుగా ఉండటానికి అని
ఎవరితోనైనా, ఎప్పుడైనా అనగలుగుతామా

బివివి ప్రసాద్

12 ఆగస్టు 2025

కవిత : కలలాంటి బంధాలు

కలవటం ఎంతసేపు, విడిపోవటం ఎంతసేపు
చిటికె వేసినట్టు కలవొచ్చు,
పూలు రాలినట్టు విడిపోవచ్చు,
విడిపోవటం భారమా, తేలిక పడటమా

నిజాయితీ కదా వెలగాల్సింది 
బంధంలో, విడివడటంలో,
కలిసి ఉండటమా ముఖ్యం
ఒకరుగా నిండుగా ఉండటం కదా

కాలమింకా చాలా మారాలి
మనం ఎదగాలి, పండాలి,
మరింత కాంతిలోకి వికసించాలి

బ్రతికి ఉండటం కన్నా 
ఏదీ విలువ కాదని తెలియాలి,
తనతో తానుండటం కన్నా 
అపురూప బంధమేదీ లేదని కూడా

మనుషులతో, విలువలతో కాదు
ఊరికే కలిసి ఉండాలి జీవించటంతో

చెట్లు జీవిస్తున్నాయి నీతో కలిసి
నీరు జీవిస్తోంది, గాలి జీవిస్తోంది,
ఆకాశం జీవిస్తోంది, కాలం జీవిస్తోంది

నీవు కలిసిన వారిలోంచి,
విడివడిన వారిలోంచి,
జీవితం తనని తాను జీవిస్తోంది,
కలలాగా నిన్ను తాకుతోంది

బివివి ప్రసాద్

11 ఆగస్టు 2025

కవిత : వీడ్కోలు ప్రేమలేఖ

అమాయకపు స్వర్గం నుండి
జారిపోతున్నా హాయిగానే వుంటుంది

ఆ హాయి లౌక్యానిది కాదు,
అమాయకత్వానిది,
ఈ సంగతి లౌకిక పాతాళంలో 
చిక్కుకున్నాక కానీ తెలిసిరాదు

ఏం ఉపయోగం,
అప్పటికే ఈ లోకపు డొల్లలలో 
ఒకటిగా మిగులుతాము, 
అమాయకమైన కాలం
మనని చూసుకుని దుఃఖపడుతుంది

బివివి ప్రసాద్

10 ఆగస్టు 2025

కవిత : క్షణికం

 1
ఇవాళ ఉన్న ప్రేమ రేపు ఉండకపోవచ్చు,
నిన్నటి కోపం ఇవాళ మిగలనట్లే
జీవితం క్షణమాత్రం కదా, ఇక ఉద్వేగాలెంత 

ఈ క్షణంలోకి నిన్ను కోల్పోవటంలో దాగివుంది
జీవితంలోని అందమంతా,
కొనసాగించాలనిపిస్తుంది చూడూ
అప్పుడు మొదలవుంది జీవనవిషాదం

ఇంద్రధనువు వెళ్ళిపోయాక గగనం వెలిసిపోదు
తనతోనే నిండి వుంటుంది హాయిగా, 
నింగిలో నుండి వచ్చావు కదా
ఉండలేవా చూడు నీతో నిండిపోయి

2
ఏకాంతం జీవన రహస్యం
ఎవరూ లేనప్పుడు, ఏ చప్పుడూ కానప్పుడు,
అద్దంలోని మనిషి ఒకడే ఎదురైనపుడు
ప్రేమించు తనని కూడా,
ఎదురుచూపుల వేదనంతా ఆవిరైపోయి 
తేలికైనకాంతి చొరబడుతుంది లోపలికి

నిన్ను నువు ప్రేమించాలి, క్షమించాలి, 
హృదయానికి దగ్గరగా తీసుకోవాలి,
ఉనికి నిన్ను ప్రార్థించేది ఈ లాలన కోసమే, 
మిగిలిన ప్రపంచం బ్రతిమాలినా నీతో ఉండదు,
దాని పని దానికి ఉంది

ఒంటరితనం శాపం కాదు, వరం
ఇది అర్థమైతే లోకం అందంలోకి మారుతుంది

3
జీవితాన్ని నిజంగా ప్రేమించిన వాళ్ళు
తమ ముద్రలు ఇక్కడ మిగలాలనుకోరు
రేపటి కాంతి కోసం తమ రాత్రిని ఖాళీ చేస్తారు
ఏమి మిగలాలి ఇక్కడ, ఎంతకాలం

నువు ఏడవలేదు, నవ్వలేదు
నీలోంచి ఎవరో వాటిని చూసారు, చూపించారు
నువు ఉండేది లేదు, వారు వెళ్ళేది లేదు

ఇంత అద్భుతమైన లోకం
ఒక్క మృత్యువుతో మాయమవుతుంది
తరువాత మిగిలేది ఏమిటి! ఎవరికి!

బివివి ప్రసాద్

09 జులై 2025

కవిత : నిర్మోహం

1
మనుషులతో నీకెలాంటి బంధం లేని క్షణాల్లో
నీ ప్రపంచం తటాలున విశాలమౌతుంది

దారిన పోయే మనుషుల్ని,
బజారులో నడకలో, పనుల్లో, మాటల్లో 
మునిగిన మనుషుల్ని
ఊరకనే గమనిస్తున్నపుడు నీకు
వారిపై వాలే వెలుగునీడలు కూడా కనిపిస్తాయి

వెలుగునీడల్ని పొదువుకొన్న గాలీ,
గాలిని పొదువుకున్న ఆకాశమూ,
ఆకాశాన్ని పొదువుకున్న జీవితమూ 
కనుల ముందు సాక్షాత్కరిస్తాయి

మనుషులు నీకేమీ కాని క్షణాలు
ఎవరూ నిన్ను వారి చేతనలోకి లాగని,
నీ చేతనలోకి చొరబడని క్షణాలు అద్భుతం

2
ఆ కొండ చుట్టూ నడిచే సమయాల్లో
బాటప్రక్క బైరాగులని చూసినప్పుడు
నీలో సోదరభావం కలిగేది

వాళ్ళకి మనుషులతో బంధమేమీ లేదు
నువు చూసినా, లేకున్నా,
ఏమన్నా ఇచ్చినా, ఇవ్వకున్నా 
వారికేమీ పట్టింపులేదు

కొండని చూస్తూ వాళ్ళు
జీవితంలో మునిగినట్టు 
కొండలో మునిగి వుంటారు

3
ఏదీ పట్టని క్షణాలు అద్భుతం

నీ ఊరిలోనూ, నీ ఇంటిలోనూ కూడా
నువ్వొక బైరాగిలా తిరుగాడే సమయాలుంటే,
ఇతరులలోకీ నువ్వూ, నీలోకి వారూ
చొరబడని సమయాలుంటే

నీకు తొలిసారి తెలుస్తుంది
ఇతరుల్ని నువు ఎంతగా ప్రేమిస్తున్నావో,
వారిలోపలి సుతిమెత్తని జీవనానందాన్ని 
మృదువుగా తాకుతున్నపుడు తెలుస్తుంది
నీకు జీవితమంటే ఎందుకింత మోహమో

బివివి ప్రసాద్
ప్రచురణ : సారంగ 1.7.2025