12 ఆగస్టు 2011

ప్రేమలోంచి జీవితంలోకి

నేను మగవాడనే లేత నీలి భావాన్ని
నీవు స్త్రీవనే స్వచ్ఛ ధవళ భావానికి పూర్తిగా సమర్పించాను
గరుకు చీకటి గర్భంలో ఒంటరి విత్తనంలా ముడుచుకొన్న నేను
నీ కోమల స్నేహ పరిమళం లోకి పూవులా వికసించాను

అంతులేని దయతో మనని ఒకరినొకరికి చూపిన కాలం
నాకు అర్ధం కాని వాత్సల్యంతో వేరు చేసినపుడు
పూవును మరలా విత్తనంలా మారమన్నాను
కానీ వేరు తొలగించిన బాధ ఏదో పీడకలలా ముసురుకొంది

నువ్వు రాకముందు నుండీ నాలో ఉన్న చీకటిని
నువ్వు వచ్చి వెళ్ళాక గమనించి భయపడ్డాను

పాతాళం నుండి ఎగసివచ్చిన పవిత్ర జలధార వంటి దు:ఖంలో
పసివాడిలా నేను పదేపదే స్నానం చేసినా
నీలో కరిగిన నా నీలి ఛాయ తిరిగి నన్ను చేరటానికి నిరాకరించింది
. . .
కాలం నిజంగా కరుణామయి
నా లోపలి చీకటిలో నేనెవరినో, ఎక్కడ వున్నానో
తెలియని నిద్రా గర్భావాసంలో మునిగిన రోజులలో
సన్నని కిరణం లాంటి, కొన ఊపిరి లాంటి జీవన కాంక్షని
కాలం ప్రభాత పవనంలా, అమ్మలా, మానవ హృదయాలలోని దయలా కాపాడింది

నెలల తరబడి నక్షత్రాలు నేను పలకరించకుండా తరలిపోయాక
క్రమంగా సూర్యోదయంలా, మృదువుగా జీవన స్పృహ మేలుకొంది

ఇప్పుడు చూస్తున్న జీవితం గత జీవితం కాదు
తన బూడిద లోంచి పునరుత్థానం పొందే ఏదో పురాణ పక్షిలా
నా కలల, భయాల భస్మం లోంచి పునరుత్థానం పొందిన సరిక్రొత్త జీవితం

తన మరణాన్ని నవ్వుతూ పలకరించి వచ్చినవాడిలా
క్షణ క్షణమూ సాహసంతో, ఉత్సాహంతో పరవళ్ళు త్రొక్కే జీవితం

ఇప్పుడు నేను పురుషుడిని కాదు, స్త్రీనీ కాదు
నేను మానవుడినీ, మరే ప్రాణినీ కాదు
ఎ భావాల మేఘాలూ లేని స్వచ్ఛ వినీల గగనాన్ని, నేను స్వచ్ఛమైన జీవితాన్ని
. . .
నువ్వు వెళ్ళేటపుడు నీ నన్ను జాగ్రత్తగా గుర్తుంచుకొమ్మని
పసివాడిలా పదే పదే చెప్పానని జ్ఞాపకం
నీ జ్ఞాపకాలు నా ముందు నిలిచినపుడు నా పెదాలపై దయగా చిరునవ్వు మెరుస్తుంది

ఇప్పుడు నువ్వు నాకు దూరంగా లేవు
నువ్వు దగ్గర ఉన్న రోజుల్లో మన మధ్య తెలియని దూరం ఉండేది
ఇప్పుడు మన మధ్య తెలియని సాన్నిహిత్యం కనిపిస్తోంది

మన జీవితాలు ఒకటి కాలేదు కానీ మనం ఒకటే జీవితం అని తెలిసింది
అన్ని జీవితాలూ కలిసి ఒకటే జీవితమని అర్ధమైంది

ఏ బంధంలేని, ఈ అంతం లేని జీవన మైదానం లోకి
నిన్ను తీసుకు రాలేకపోయానని ఎపుడైనా అనిపించటం మినహా
నేస్తం, నేను బాగున్నాను. జీవితమంత నిండుగా, నదిలా ఉన్నాను

_________________
'ఆకాశం' సంపుటి నుండి 

3 కామెంట్‌లు:

  1. ప్రసాద్....ఈ కవిత ఆంగ్లం లోకి చేయడానికి అనుమతి ఇస్తే చేస్తాను .....మాటల్లో చెప్పి కవిత్వం అర్ద్రతని పోగొట్టలేను ...ప్రేమతో...జగతి

    రిప్లయితొలగించండి
  2. "గరుకు చీకటి గర్భంలో ఒంటరి విత్తనంలా ముడుచుకొన్న నేను" మరో అందమైన అనుభవం

    రిప్లయితొలగించండి