13 ఆగస్టు 2011

అంతరాత్మవంటి వాడు

తిట్టాను కదా ఇక రాడేమో అనుకొంటే ఉషస్సులా నవ్వుతూ వస్తాడు
మెచ్చుకొన్నాను కదా తానే వస్తాడనుకొంటే
దీపాలారిన చీకట్లో మాయమైనట్లు మళ్ళీ కనిపించడు

ఏమిటలా చేస్తావంటే తిట్టారా, మెచ్చారా చూడను
మాటల్లో ఆర్ద్రత ఉందా, లేదా చూస్తానంటాడు
నీకుపయోగం మాట్లాడంటే మాటలు రానట్లుంటాడు
ఎవరైనా దు:ఖంలో ఉంటే వెళ్లి మరీ ఎన్నో కబుర్లతో ఓదార్చుతాడు

మన తప్పులకి కోపం వస్తే తాటాకుమంటలా భగ్గుమంటాడు
అంతలోనే చల్లారి నా నీలో సౌందర్యం మాత్రమే ఉండాలంటాడు
మంచి ఎవరిలో కనిపించినా మహా సంబరపడతాడు
మనం మంచివేపు నడిస్తే ఆనందాశ్రువులు రాల్చి దీవిస్తాడు

బలం, ధనం, పదవీ, తెలివీ, పేరూ
మనిషి స్నేహితులా, యజమానులా అని అడుగుతుంటాడు
అవి ఎక్కువైనచోట ఊపిరాడదేమిటంటాడు

దయ ఉంటే చాలంటాడు
దయ కన్నా తెలివేదీ, బలమేదీ ఆలోచించమంటాడు
దయ కన్నా సుఖమేదీ, సౌందర్యమేదీ ప్రశాంతంగా చూడమంటాడు
దయగల వారెవరైనా, పరిచయమే లేకపోయినా తనవారంటాడు

దయ ఉంటే ఓడిపోతామంటే, దయ లేకపోవటమే ఓడిపోవడమంటాడు
ఎక్కడ పోటీ మొదలైనా, పోటీ గెలుస్తుంది, మనిషి ఓడిపోతాడంటాడు

ఇతను ఏ లెక్కలకీ అందడు. లెక్కలు మానేస్తే అర్ధమౌతానంటాడు

ఏమిటో ఇతను - అచ్చం మన అంతరాత్మలా మాట్లాడతాడు
ఏమిటో ఇతను - మనం పోగొట్టుకొన్న జీవితంలా ఉంటాడు


_________________
'ఆకాశం' సంపుటి నుండి 

2 కామెంట్‌లు:

  1. మీ కవిత ఎప్పుడూ హృదిని తాకుతుంది మీరెవరో తెలియక ముందే నేనే ఈక్షణం నుండి కొన్ని పోఎమ్స్ అనువాదం చేశాను ...అప్పుడు ...ఇప్పుడు ఇలా ...ప్రేమతో..జగతి

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది సార్..నిజమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు...

    రిప్లయితొలగించండి