12 మార్చి 2018

ఏడు పుస్తకాలు : 2. మిర్దాద్ - మైకేల్ నేమీ

మైకేల్ నేమీ అనే రచయిత (కవి?) రాసిన నవల ఇది. జిబ్రాన్ ప్రాఫెట్ ని పోలిన ప్రబోధాత్మక రచన. ఒక మనిషి జీవితాన్ని, దానిలో తోచే అన్నిదోషాలతో సహా ఇంతగా ప్రేమించవచ్చా అని ఆశ్చర్యం కలిగింది చదువుతుంటే. ఇది ఒక పవిత్రమైన రచన అనిపిస్తుంది. కవరు మీది మాటలు ఓషో అన్నవి అనుకొంటాను. అప్పటికి ఓషోని చదవలేదు గనుక చదివే ముందు పట్టించుకోలేదు. చదివాక వాటినీ, ఓషోనీ కూడా పట్టించుకొన్నాను.


ఈ పుస్తకం తెలుగు అనువాదం పిరమిడ్ ప్రచురణగా లభిస్తోంది.
ఇంగ్లీషు పుస్తకం ఆన్ లైన్ సైట్లలో  లభిస్తుంది.


ఏడు పుస్తకాలు : 1. భగవాన్ స్మృతులు - చలం

 శ్రీ రమణమహర్షి సన్నిధిలో జీవించినవారి అనుభవాలని చలం రికార్డు చేసిన పుస్తకం ఇది. ఇది చదివేనాటికి జీవితం గురించీ, మనుషుల గురించి తీవ్రమైన అయోమయంలో ఉన్నాను. ఇది చదివాక, జీవితానికి ఒక అద్భుతమైన లక్ష్యం ఉందనీ, భూమ్మీద దురదృష్టకరమైన మానవజాతిలో నూరుశాతం ప్రేమించదగిన, నమ్మదగిన మనిషి ఒకరైనా జీవించి వెళ్ళారనీ అర్థమైంది.



ఈ పుస్తకం ఇప్పుడు ప్రియదర్శిని ప్రచురణలు, హైదరాబాద్ వారివద్ద లభిస్తోంది. 
శ్రీ రమణాశ్రమం,  తిరువణ్ణామలై వారి వద్ద కూడా లభిస్తుంది.

పుస్తకాలూ - నేనూ

శరత్ బాబు రచనలతో మొదలైన సీరియస్ సాహిత్య పఠనం దాదాపు రెండు దశాబ్దాలు సాగింది. తరువాత ఒక దశాబ్దం ఎంపిక చేసుకొన్న పుస్తకాలు మాత్రమే చదవగలిగాను. చివరగా ఇష్టంగా చదువుకొన్నది నిసర్గదత్త మహరాజ్ సంభాషణల పుస్తకాలు. సుమారు ఏడెనిమిదేళ్ళుగా చదవటం ఆగిపోయింది. ఇప్పుడు చదవమంటే, బడి పుస్తకాలు చదవమన్నంత బాధ.

చదవటం కన్నా చూడటం, స్పందించటం ముఖ్యం. వాటికన్నా లోనికి చూసుకోవటం ముఖ్యం. లోచూపు చిక్కితే, తనకి కావలసినవి చాలాసార్లు తనకే తెలుస్తాయి. దానిని సహజ జ్ఞానం (intuition) అనవచ్చునేమో. ఇదేమీ ప్రత్యేక విద్యా / ప్రతిభా కాదు. అది ఎప్పుడూ ఉన్నదే. లోపలి దుమ్మునీ, గట్టిపడిన భావజాలాలనీ, ఉద్వేగాలనీ, వాటి వెనుక అంతకన్నా బిగుసుకుపోయిన అహంభావాన్నీ ఎంత వదులుకోగలిగితే, అంతగా ఆ స్ఫురణ ప్రకాశిస్తుంది.

కానీ, బహుశా, చదవటంలో ఏమీ లేదు అని తెలిసే వరకైనా, చదవటం మంచిది. దాని వలన మేథ వికసిస్తుంది. చూపు విస్తృతమౌతుంది, అనేక తలాలని తాకుతుంది. అనుభవశక్తీ, వ్యక్తీకరణశక్తీ సున్నితమౌతాయి. పదును దేరుతాయి. తరువాత, వాటితోనే ఆగిపోకుండా, జీవితానుభవంలోకి ప్రయాణించాలి.

ఫేస్ బుక్ లో సునీతా రత్నాకరం గారు ఏడు పుస్తకాల ఆటకి (చాలెంజ్ పదం బాగోలేదు నాకు) టాగ్ చేసినప్పుడు, జీవితంలో ఆయా దశల్లో బాగా లోతుగా తీసుకొన్న రచనలేవా అని చూసుకొంటే, సుమారు ఇరవై పుస్తకాలు గుర్తొచ్చాయి. మరికాస్త జ్ఞాపకంలోకి వెళితే మరో ఇరవై కూడా ఉండవచ్చును. కొన్నిసార్లు పుస్తకం అంటే రచయిత / కవి అని కూడా అర్థం. :) చివరి ప్రభావాలకి సంబంధించిన ఏడు పుస్తకాల గురించి చెప్పదలిచాను గనుక, మిగిలిన లిస్టు ముందుగా రాస్తున్నాను.

బాగా చదివిన రోజుల్లో ఇంగ్లీషు అంతగా రాకపోవటమూ, కొద్దిగా ఇంగ్లీషు వచ్చాక, చదివే ఆసక్తి పోవటమూ జరగకపోతే ప్రపంచ సాహిత్యం బాగా చదువుకొందును కదా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ, దానికేమీ దిగుల్లేదు.

ఇంతకన్నా రాయటం చాతకాకనో, ఇది రాయటం చాతనయో కవిత్వం రాసుకొంటున్నాను కాని, వ్యక్తిగతంగా రచనా ప్రక్రియల్లో నవలకి అభిమానిని. అంత ఊహ ఎలా చేస్తారా అని ఆశ్చర్యం ఏ టాల్ స్టాయో, చండీ దాసో గుర్తుకు వస్తే. తరువాత వ్యాసం, కథ. ఆ తరువాతనే కవిత్వం. ఈ లిస్టు కూడా ఆ విషయాన్నే ధ్రువ పరుస్తుంది. :)

శరత్ శ్రీకాంత్, ఇతర నవలలు, కథలు  
విశ్వనాథ నవలలు, కథలు  
ప్రేంచంద్ నవలలు 

శ్రీశ్రీ మహాప్రస్థానం
చలం మ్యూజింగ్స్, స్త్రీ, ప్రేమలేఖలు, బిడ్డల శిక్షణ
సంజీవదేవ్ దీప్తిధార, ఇతర వ్యాసాలూ
గోపీచంద్ పోస్టు చెయ్యని ఉత్తరాలు 
నండూరి రామమోహనరావు విశ్వదర్శనం 

వడ్డెర చండీదాస్ అనుక్షణికం
విక్టర్ హ్యూగో బీదలపాట్లు
టాల్ స్టాయ్ యుద్ధమూ శాంతి
అలెగ్జాండర్ కుప్రిన్ యమకూపం
అలెక్స్ హేలీ ఏడుతరాలు
అలెగ్జాండర్ డ్యూమా కౌంట్ ఆఫ్ మాంట్ క్రిష్టో

ఖలీల్ జిబ్రాన్ ప్రాఫెట్, ఇతర కవిత్వం  
టాగోర్ గీతాంజలి, మిగతా కవిత్వం 
చలం వెలుగురవ్వలు
మసనోబు ఫుకువోకా గడ్డిపరకతో విప్లవం
జిడ్డు కృష్ణమూర్తి కామెంటరీస్ ఆన్ లివింగ్ 
మహేష్ భట్  యూజీ కృష్ణమూర్తి 
రిచర్డ్ బాక్ నవలలు
పాలో కోయిలో నవలలు 

13 జనవరి 2018

చేతనావరణం

చేతనకి వెళ్తున్నాము, మీరూ వస్తే బావుంటుంది అన్నారు జయతి. జనవరి రెండున బస్సులు మారి గుంటూరు జిల్లా, చౌడవరంలోని చేతనని చేరుకొన్నాను. జయతీ, లోహితాక్షన్ దంపతులతో, చేతన ఫౌండర్ మంగాదేవిగారితో పలకరింపులయ్యాక, లోపలికి వెళదామా అన్నారు మంగాదేవిగారు. చేతన ఆవరణలో నడక మొదలుపెట్టాము.

సుమారు పది ఎకరాల స్థలంలో, అక్కడక్కడా ఒక్కొక్క విభాగానికి చెందిన భవనాలు, ఖాళీ స్థలమంతా అనేకరకాల వృక్షజాతులు. బహుముఖ ప్రజ్ఞాశాలి మంగాదేవిగారికి మొక్కలంటే కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడి మొక్కల్నీ తెచ్చి, ఇక్కడి నేలకీ, గాలికీ, ఆకాశానికీ జత కలుపుతారు వాటిని.

వాళ్ళు ఏవో మొక్కల గురించి మాట్లాడుకొంటున్నారు కాని, పెద్దగా నా లోపలికి చేరట్లేదు. వాలుతున్న పగటితో పాటు, మనసులో కూడా ఏదో నిశ్శబ్దం ఆవరిస్తోంది. ఆకలితో ఉన్నవాడు నిశ్సబ్దంగా అన్నం తింటున్నట్టు, వేసవి దాహార్తుడొకడు ప్రతిబిందువునీ ఆర్తిగా త్రాగుతున్నట్టు ఆ వాతావరణంలోని స్వచ్చతని, తేలికదనాన్ని, బహుశా అక్కడి గాలికి కూడా అలవాటుగా మారిపోయిన మంచితనాన్ని నెమ్మదిగా లోపలికి నింపుకొంటున్నాననుకొంటాను.

ఆవరణలో సగం దూరం నడిచాక, ఎనభయ్యో ఏడు మంగాదేవిగారిపై కొంత పని చేసిందనుకొంటాను, మా బాధ్యత మరుద్వతిగారికి అప్పగించారు. జయతీ, లోహితాక్షన్ లకి ఇది రెండవ సందర్శన. వాళ్ళని అక్కడక్కడ పిల్లలు పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో కనిపించే ప్రేమా, నిర్భీతీ, వాళ్ళ దేహాల్లో కదలాడే చురుకుదనమూ చాలు, వాళ్ళక్కడ ఎంత సంతోషంగా జీవిస్తున్నారో గ్రహించటానికి. తల్లిదండ్రుల్ని కోల్పోయిన, లేదా వాళ్ళే విడిచిన ఎక్కడెక్కడి పిల్లలో వాళ్ళు.

మరుద్వతి గారు చెబుతున్నారు. వాళ్ళ ముందు ఎప్పుడూ వాళ్ళ తల్లిదండ్రుల గురించీ, కుటుంబం గురించీ మాట్లాడము, అలా మాట్లాడటం వాళ్ళని చిన్న బుచ్చినట్టవుతుంది అని. చూడవచ్చిన వారెవరో, మీరంతా ఒక కుటుంబంలా ఉన్నారు అంటే, వాళ్ళలో ఒక అమ్మాయి 'లా ' కాదు, కుటుంబమే అని సరిచేసిందట. వింటుంటే, కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

మన మోటు పదాల్లో, ఒక అనాధాశ్రమం, ఒక వృద్ధాశ్రమం, చుట్టుప్రక్కలున్న పేదల పిల్లల కోసం ఒక ఉచిత విద్యాకేంద్రం, ఒక్కొక్క ఇంగ్లీషు, తెలుగు మీడియం స్కూళ్ళు అక్కడ నిర్వహిస్తున్నారు. నిర్వాహకులలో కొందరు మంగాదేవిగారి స్నేహితులు, మరికొందరు కఠినమైన ప్రపంచాన్నుండి అక్కడ తలదాచుకొన్నవాళ్ళూ కూడా ఉన్నారు.

రాత్రి భోజనాలప్పుడు 'గిజుభాయి ' పద్దతులేమన్నా పాటిస్తుంటారా అని అడిగాను. ఇతరత్రా, ఎంత గొప్ప ఆదర్శాలున్నా, పిల్లల చదువు దగ్గర కొచ్చేసరికి ఎక్కువో, తక్కువో హింసాత్మక పద్ధతులనే పాటించి, మలితరాన్ని కూడా హింసాత్మక జీవనానికి సిద్ధం చేస్తూ ఉంటాం కదా. నేను చదినంతలో, గిజుభాయివంటివారు బోధనకి సంబంధించి సున్నితమైన విధానాల్ని ప్రవేశపెట్టి చూసారు గనుక, నేనే ఒక పిల్లవాడినైనట్టు తటాలున అడిగాను ఆ ప్రశ్న. గిజుభాయి పద్దతులు ప్రైమరీ క్లాసులకే, మేము స్కూలు పెట్టడానికి ముందు మాంటిస్సోరీ ట్రైనింగ్ తీసుకొని అదే పద్దతుల్లో చెబుతున్నాము అన్నారు మంగాదేవిగారు. రేపు వీళ్ళకి మన ప్రైమరీక్లాసులు చూపించండి అని మరుద్వతిగారికి చెప్పారు.

ఉదయం ఆరింటికి కలుద్దాము, మీతో పాటు పక్షుల్ని వెదకటానికి కొంతమంది అమ్మాయిల్ని పంపిస్తాను అన్నారు జయతితో మరుద్వతిగారు. ఎలాంటి చోటుకి వచ్చాను ఇన్నాళ్ళకి అని ఇంకా తలుస్తూనే, వాళ్ళనుండి సెలవు తీసుకొని, అక్కడే వున్న అతిథి గృహాన్ని చేరాము. ఇలాంటి సేవాసంస్థ నిర్వహించాలనేది నా యవ్వనకాలపు ఆదర్శాలలో ఒకటి. మనం చేయాలనుకొని, చేయలేకపోయిన ఉన్నతకార్యాలు మరెవరైనా చేసినపుడు, వాళ్ళని చూస్తే గొప్ప తృప్తీ, శాంతీ కలుగుతాయి. లోలోపలి న్యూనతాభావం నుండి కొంత బయటపడినట్టు ఉంటుంది.

తెలతెలవారుతుండగా మళ్ళీ చేతనలో అడుగుపెట్టాము ముగ్గురమూ. ప్రశాంతమైన ఆ ఉదయకాంతీ, ఈ చేతనావరణమూ ఒకలాంటివే అనిపించింది. చెరగని చిరునవ్వుతో మరుద్వతిగారు పలకరించి, కొందరు అమ్మాయిల్ని కూడా పంపారు చెట్లనీ, పిట్టలనీ చూపించమని. పదవతరగతి చదువుతున్న పిల్లలు వాళ్ళు. ఒకరిద్దరు పిల్లలు పలకరించబోయి, నా ముక్తసరి మాటలతో దూరం జరిగారు. సూర్యోదయం బావుంది కదా అన్నారు, నవ్వుతూ తలూపాను.

కొంత సమయం చెట్లూ, పిట్టలూ, జయతీ, పిల్లలూ, లోహీ ఒక లోకమై తిరుగుతూ వుంటే, వారిలో కదలాడే సంతోషాలని గమనిస్తూ తిరిగాను. ఉన్నట్లుండి, లోహీ పిల్లలతో, ఈయన పెద్దకవి తెలుసా, కవిత్వం చదవమని అడగండి అన్నారు. కవిత్వం అనగానే సాధారణంగా అందరూ ఎలా ఆందోళన పడుతుంటారో దశాబ్దాలుగా చూస్తున్నాను గనుక, నన్నూ, కవిత్వాన్నీ ఎలా గట్టెక్కించాలా అని ఆలోచిస్తూ, పిల్లలతో, చదవటం సరే కానీ, ముందు కవిత్వమంటే ఏమిటో చెబుతాను అన్నాను. చెప్పండి, చెప్పండి అని పిల్లలంటూ ఉండగా అక్కడే ఉన్న కుటీరంలో అందరం కూర్చున్నాము.

కవిత్వమంటే కొత్తగా చూడటం, చూసింది కొత్తగా చెప్పటం, ఇందాక సూర్యుడిని చూసినప్పుడు మీలో ఒకరు బావుంది కదా అన్నారు నాతో, నాకు ఏమనిపించిందో తెలుసా అప్పుడు, నిర్మలమైన ఆకాశంలో ఎవరో ఒక బంగారు బిందువుని చేజార్చుకొని వెళ్ళిపోయారు అనిపించింది. పిల్లల ముఖాలు ఒక్కసారిగా వెలిగాయి ఆ మాటకి. ఇక దారి దొరికింది, కవిత్వం గురించి వాళ్లకి అర్థమయే మాటల్లో చెబుతూ, కవిత్వం చదువుతూ, వివరిస్తూ ఒక అరగంట గడిచింది. లోహీ మీ ప్రయాణం ఫలించిందా అన్నారు, నా ప్రయాణం నిన్న ఇక్కడ అడుగుపెట్టగానే ఫలించింది, ఇప్పుడు మరింత బాగా హృదయం నిండింది అన్నాను. తీసుకోవటమే కాని, ఇవ్వలేకపోయాను కదా అనిపించింది అప్పటివరకూ.

క్లాసులు మొదలయ్యాక, మాకు కేజీ క్లాసులు చూపమని ఒకర్ని పంపించారు మరుద్వతిగారు. క్లాసంతా చుట్టూరా బ్లాక్ బోర్డ్. బోర్డుపై, ఒక్కో విద్యార్థికీ కొంత చోటు. క్లాసు మధ్యలో గుండ్రటి బల్లలూ, చుట్టూ నాలుగైదు కుర్చీల్లో తీక్షణంగా ఏదో పనిచేసుకొంటూ పిల్లలూ. అంకెలూ, బొమ్మలూ, అక్షరాలూ వాళ్లకిచ్చిన పరికరాల్లో తోచినట్టు సర్దుతున్నారు. ఇదే కదా గిజుభాయి కల అనిపించింది.

భోజనం తరువాత వెళ్తానని చెప్పాను, బయల్దేరేముందు మరుద్వతిగారికి నా పుస్తకాలు ఇచ్చాను. హృదయం నిండిందండీ, ఇక్కడికి రావటానికి ఇది మొదలు మాత్రమే అని చెప్పాను. ఎండకీ, గాలికీ, పిల్లలకీ, కవికీ ఎవరి అనుమతులూ, ఆహ్వానాలూ అవసరం లేదు.
. . .
రెండురోజుల తరువాత మంగాదేవిగారు ఫోన్ చేసారు. చాలా బాగా రాసారు కవిత్వం అని వాక్యాలని ఉదాహరిస్తూ చెబుతున్నారు. నేను మీలా చెప్పలేను, రాయలేను మరి అన్నారు. నేను మీ పని చేయగలిగి ఉంటే, కవిత్వం రాయకపోయినా పర్లేదమ్మా అన్నాను.

పాతికేళ్ళుగా ఎన్నివందల జీవితాలని నిలిపారామె, యాభై ఏళ్ళుగా ఎన్ని వేల హృదయాలకి జీవితాన్ని ప్రేమించటం నేర్పారు. చీకటిని తిడుతూ, కాలక్షేపం చేసే మనుషుల మధ్య నిలిచి, ఎన్ని దీపాలు వెలిగించారు.

ఇదీ వారి వెబ్ సైట్ : http://www.chetanacharity.org/

01 జనవరి 2018

నిద్రలో..


1

నిద్రలో ఎక్కడుంటావు నువ్వు

మెలకువలో నీ దేహాన్ని మోసీ మోసీ అలసిపోయాక
దానిని ఎక్కడకు విసిరేసి, ఎటు వెళ్ళిపోతావు

సృష్టికి పూర్వం ఉన్న ఏ శీతల నిశ్శబ్ద ప్రశాంతతలోకి
నిదురించేవేళల రహస్యంగా ప్రవేశిస్తావు

గాయపరిచే ప్రపంచాన్ని చెరిపేసి,
భౌతిక వ్యాకరణానికి లొంగని రంగుల లోకాలని
నీ నిశ్శబ్దసీమలో ఎగురవేస్తూ ఆడుకొంటావు

2

మెలకువ ఉత్త ఉలికిపాటు
చిరంతన శాంతిలో రేగే కలకలం వంటివీ దృశ్యాలు, శబ్దాలు
రేగిన అలలన్నీ అలసిపోయి, విశ్రమించేవేళ
ఏ దయాపూర్ణ శూన్యం పొగమంచులా సమస్తాన్నీ కప్పుతోంది

3

మృత్యువు లాంటి గాఢనిద్రకీ,
సుషుప్తి లాంటి మృత్యువుకీ జీవులపై ఎంత దయ
ఊహలాంటి జీవితానుభవంలోంచి విస్మృతిలోకి తీసుకెళ్ళి   
విరిగిన నవ్వుల్నీ, కన్నీళ్ళనీ శూన్యంలో ఒంపుతుంది 

శీతలరాత్రి తోసుకువచ్చే చీకటి అలలాంటి నిద్రలోకి
వాళ్ళని అమాంతం విసిరేసి లాలనగా నవ్వుతుంది 

4

చాలు అన్న పదం చివర ఏముందో ఎప్పుడన్నా చూసామా

చూరునుండి చివరిబిందువు జారిపోయాక
గాలితెర ఒకటి ఇక ఇక్కడేమీ లేదని చెప్పి వెళ్ళాక
వెక్కి వెక్కి ఏడ్చి, కాలపత్రంపై గాఢమైన నిట్టూర్పు సంతకం చేసాక 
నీదైన ఏకాంతం కమ్ముకొని, అడవినీడల దుఃఖపుశాంతిలో విడిచి వెళ్ళాక
చాలు అన్న పదం చివర
పూవులో ఒదిగిన తేనెకణం లాంటి శాంతి మెరుస్తూ కనిపిస్తుంది

నిద్రలో నీ జీవితం ఎటుపోయిందో
ఈ చివరికి చేరినపుడు, బహుశా, తటాలున తెలుస్తుంది 

5
అంతే, ఇక చాలు కదా..