30 డిసెంబర్ 2015

భగవాన్ స్మృతిలో..

ఇంగ్లీషు తేదీల ప్రకారం ఇవాళ భగవాన్ శ్రీ రమణమహర్షి పుట్టినరోజు (30.12.1879)

కాస్త సాహిత్యం చదువుకొని, సమాజంలోని అన్యాయాలపై ఆగ్రహంతో ఊగిపోతున్న, ఆదర్శాల కలలు కంటున్నఇరవైఏళ్ళ వయసులో, తెలియని అశాంతి ఏదో మనసంతా కమ్ముకొని, బయటపడే దారి కోసం వెదుక్కొంటున్నపుడు, సౌందర్యస్పృహని బలంగా మేల్కొల్పిన, సమాజంలోని కపట విలువల పట్ల ధిక్కారాన్నినేర్పిన చలమే మళ్ళీ, ఇదిగో నీ గమ్యం ఇక్కడుందేమో చూడు అన్నట్టు ఒక దైవాన్నిజీవితంలో ప్రవేశపెట్టారు. ఆ దైవం పేరు భగవాన్ శ్రీ రమణమహర్షి. ఆయన గురించి  చలం రాయగా చదివిన ఆ పుస్తకం 'భగవాన్ స్మృతులు'.

'ఆధ్యాత్మిక గురువులంటే నిన్నుకండిషన్ చేసేవారు. నీ మనస్సునీ, ఎమోషన్స్ నీ, రీజనింగ్ నీ సహానుభూతితో గమనించకుండా ఆదర్శాలని నీపై మోపుతారు.' అని తెలిసీ, తెలియని భయాలతో, ఊహలతో - మనశ్శాంతికోసం వారివంక చూడటానికైనా తటపటాయించే రోజులలో- చలం రాసారు గనుక, ఆశ్రయించారు గనుక, ఈయనను గురించి తెలుసుకోవాలి అనుకొంటూ తెరిచిన పుస్తకం అది.

పుస్తకం చదువుతున్నపుడు భగవాన్ జీవితఘటనలూ, జ్ఞానం గురించిన ఆయన బోధనలూ, తనచుట్టూ ఉన్న సమస్త జీవులపట్లా ఆయన సహజ కరుణాపూర్ణ స్పందనలూ, అత్యంత సరళమైన జీవనవిధానమూ  తెలుస్తున్నకొద్దీ, ఈయన గురించే కదా వెదుక్కొన్నది అనే భావంతో గొప్ప ఆనందమో, దుఃఖమో మనస్సు నిండా.

బయటి జీవితపు లక్ష్యాలు, తప్పులు, ఒప్పులు, ఆనంద, విషాదాలకన్నా లోతుగా, వాటికన్నా విలువగా,  బాధ్యతగా చేయవలసినది ఉంది, అది తనను తాను తెలుసుకోవటం. ప్రాచీనులు జ్ఞానమనీ, మోక్షమనీ చెప్పింది దీని గురించే. పుస్తకం పూర్తయే సమయానికి అంకురించిన ఇలాంటి నిర్ణయమేదో, తరువాతి జీవితాని కంతటికీ అంతస్సూత్రంగా ఉందనుకొంటాను. 

17 ఏళ్ళ యువకుడొకరు అకస్మాత్తుగా, అకారణంగా మృత్యుభయానికి లోనై, సరే ఈ మృత్యువేమిటో చూద్దామని, శరీరాన్నీ, శ్వాసనీ, మనస్సునీ స్తంభింపచేసి, శరీరం కాలిపోయినా మిగిలే దొకటుందని, అదే తన నిజస్వరూపమని, 'తా'నని అంత సులువుగా గ్రహించిన విషయం, మనం గ్రహించవలసివస్తే, మనతో మనం ఎంత తగాదా పడాలో, మనల్ని ఎన్నివిధాల శుభ్రం చేసుకొంటూ, చేసుకొంటూ వెళ్ళాలో, లోలోతుల్లో కంటా ఎంత నిజాయితీ, ఓర్పూ, సాహసం ఉండాలో.. ఎంత కోమలత్వమూ, కాఠిన్యమూ సమకూడాలో..

'భగవాన్ స్మృతుల' కి చలం రాసిన ముందుమాట ఒక కాలేజీ ఎఫ్ఎం రేడియో కోసం చదివింది ఈ సందర్భంగా మరోసారి మిత్రులతో పంచుకొంటున్నాను.

సుమారు ఇరవై నిమిషాలుండే ఈ ఆడియో రికార్డింగ్ వినదలిస్తే ఇక్కడ క్లిక్ చేయండి.

08 నవంబర్ 2015

జీవిత పరమార్థానికి అద్భుతరూపం 'నీలో కొన్నిసార్లు'

ఏదైనా వశం తప్పితే ఏమవుతుంది? మనిషి జీవితం కూడా అంతే మరి. ఆశలు-ఆశయాలు, క్రమశిక్షణ-కట్టుబాట్లు, నడవడిక-నాగరికత, అభివృద్ధి-ఆకాంక్షలు ఇలాంటి కృత్రిమ వ్యవస్థలన్నీ కలసి ఆధునిక మానవాళిని ఎంతలా కుదించి వేస్తున్నాయంటే అంతకంతకూ ఉబ్బిపోతున్న గాలిబుడగలోని ఒత్తిడి అంతలా. అవశమై పోయినప్పుడు భళ్లున పగిలి, పేలి పోవడం తప్ప దానికి వేరే గత్యంతరం ఉండదు. అలవికాని అప్రాకృతిక వ్యవహారాలకు అలా కట్టుబానిలవుతున్న ఫలితంగానే మనుషుల జీవితాలూ ఇలాగే, ఇంత భయానకంగా తయారవుతున్నాయా అంటే అవుననే సమాధానం ఆలోచించే వారికి ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. కాకపోతే, బతుకులు అలా పగిలిపోక ముందే అందరం మేల్కొనాలి. నీలో కొన్నిసార్లు శీర్షికన బివివి ప్రసాద్ వెలువరించిన తాజా కవితా సంకలనం ఈ అనూహ్య దృశ్యాన్నే ఆవిష్కరించింది. 
చాలా సామాన్యుడిలా కనిపించే ఈ కవి యాంత్రికమై పోయిన ఇప్పటి మానవుల జీవితాలకు చెప్పిన భాష్యం యావత్ ప్రపంచాన్నే అచేతనం చేసేలా ఉంది. 

అవును, మనిషి అసలైన జీవిత పరమార్థానికి ఆయన అక్షరాలతో అద్భుత రూపమే ఇచ్చారు. ఇవాళ అనేకమంది మనుషులు జీవిస్తున్న విధానం ఆయనను ఎంతలా అతలాకుతలం చేస్తే ఇంత లోతైన, గాఢమైన, మార్మికమైన, మహోత్కృష్టమైన భావుకత ఉద్భవిస్తుంది! 

జీవించడమంటే మరేం కాదు/ గాలిలా, నేలలా, నీటిలా ఊరికే ఉండడమే (బతకాలి-పే: 53) అని ఆయన తేల్చేసిన తీరు చాలామందితో నిజంగానే భుజాలు పునుక్కునేలా చేస్తుంది. అలా ఏమీ చేయకుండా బతికేయడమే మనిషి ధర్మమని తాను చెప్పడంలోని తాత్వికత విధిగా ప్రతి పాఠకుడినీ ఆలోచింపజేస్తుంది. జీవితమంటే అంతులేని ఒక పోరాటం/ బతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం అంటూ ఓ సినీకవితోపాటు ఎందరో మేధోజీవులు చూపిన జీవన మార్గం ఎంత సంక్లిష్టం, అప్రాకృతికం కాకపోతే ఆయన ఇక్కడ ఇంతలా, ఇన్ని కవితల్లో నిట్టనిలువునా చీల్చేసినంత పని చేస్తారు! ఇక, అలాంటి వారందరినీ, వ్యవస్థలన్నింటినీ మరోమాటకే తావు లేకుండా కవితాత్మకంగా తాను ఎండగట్టిన తీరు అసాధారణం.

జీవితం తనను తాను చూసుకునేందుకు/ నిన్ను కన్నది కానీ, నువ్వేదో చేసి తీరాలని కాదు అంటూనే ఏదో చెయ్యటానికే అన్నీ ఉండాలనుకొంటే/ ఏదీ చెయ్యని ఆకాశం ఏనాడో మాయమైపోయేది (పై కవితాపంక్తులు). అలా ఏమీ చేయకుండా ఖాళీగా ఉండడమే జీవితమా! అంటే అంతేకాదు, అసలు అలా ఉండడమే ఉత్సవమైనట్టు ఉండడం/ మిగిలిన పనులన్నీ నిద్రపోయాక నీ పక్కలో ఒంటరివైన ఆటబొమ్మలు అంటారు. దీనిని ఇక్కడికే ఆపకుండా, ఇంకా స్పష్టంగానూ చెప్పారు. జీవితమంటే ఏమిటైతే ఏమిటి, ఊరికే జీవించు/ కళ్లముందు ప్రవహిస్తున్న నదిలా, ఎదుగుతున్న చెట్టులా/ ఎగురుతున్న ఉదయాల్లా, అస్తమయాల్లా, నక్షత్రాల్లా (జీవితార్థం, పే: 68) అన్నారు. కవి తన ఆవేదనలోని అసలు మూలాన్ని మరో కవితలో చెప్పేశారిలా, జీవితాన్ని అనుభవించటం తెలియకుండానే జీవితోత్సాహం అస్తమిస్తుంది (అవతలి తీరం గుసగుసలు, పే: 71). ఒక కవిగా బివివి ప్రసాద్ మనిషి జీవితాన్ని చాలా లోతుగా అవగాహన పరచుకున్నారు. దీనిని నిరూపించే స్థాయిలోనే ఇంకా అనేక కవితల్లో అనేక కొత్త అనిర్వచనీయానుభూతులను వెల్లడించారు. 

సమాజానికి మార్గనిర్దేశనం చేయవలసిన తాత్వికులూ, మేధావులూ, కవులూ, కళాకారులూ, నాయకులూ, వినోద ప్రసార మాధ్యమాలూ అందరికీ స్వీయగౌరవమూ, స్వప్రయోజనమే పరమావధిగా ఉంది. వాటి నిమిత్తం వారు కూడా మానవ విలువల్నీ, సత్యనిష్ఠనూ ఉపేక్షిస్తున్నట్టు కనిపిస్తోంది. వారే సరిగా లేకపోతే, స్వంతంగా బలమైన ఆలోచన లేని, ప్రభావాలలో పడి కొట్టుకుపోయే సగటు మనుషుల సంగతి చెప్పేదేముంది? అంతగా తెలివి వికసించని వారిని ఆకర్షించటం కోసం, తెలివైన వారూ అవివేకంగా ప్రవర్తించటం ఇవాళ్టి విషాద జీవనశైలికి ఒక ముఖ్యకారణం (చీకోలు సుందరయ్యకు 2012లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, పే: 138) అని ప్రసాద్ తన అభిప్రాయాన్ని ఈ సందర్భంలోనే కుండబద్దలు కొట్టారు. ఇంత సంచలనాత్మక ప్రాకృతిక పరమార్థ సిద్ధాంతాన్ని వ్యక్తీకరించిన ఈ కవి నేపథ్యం ఏమై ఉంటుందా అని తరచి చూస్తే మరింత ఆశ్చర్యమేస్తుంది.

బివివి ప్రసాద్ భావ కవిత్వంలోనే కాక హైకూల్లోనూ తనదైన ప్రత్యేకతను విలక్షణంగా చాటుకున్న సందర్భాలెన్నో. అయితే, పెద్దగా సైద్ధాంతిక చదువులేవీ లేకున్నా సంచలనాత్మక కవిత్వాన్ని సృష్టించడం వెనుక ఆయన అరుదైన సాహిత్యోపాసనే అసలు కారణంగా చెప్పాలి. 

నీలో కొన్నిసార్లు, కవిత్వం రచన: బివివి ప్రసాద్, పేజీలు: 154, వెల: రూ. 90/-, బివివి హైకూలు, పేజీలు: 162, వెల: రూ. 90/-, ప్రతులకు: వాసిరెడ్డి పబ్లికేషన్స్, బి-2, టెలికామ్ క్వార్టర్స్, కొత్తపేట, హైదరాబాద్-60. ఫో॥ 90005 28717, కవి చిరునామ: 23-12-21, సజ్జాపురం, తణుకు, ప.గో.జిల్లా-534211, సెల్: 90320 75415.
-దోర్బల
నమస్తే తెలంగాణ లో సమీక్ష.


10 అక్టోబర్ 2015