03 సెప్టెంబర్ 2025

కవిత : స్వగతం

తలుపు తీయటం, 
గడియ చప్పుడు చేయటం,
తలుపు మూయటం,
బయటా, లోపలా రాత్రి సమానంగా వ్యాపించటం,
రాత్రి లోపల నిశ్శబ్దం నిండటం,
నిశ్శబ్దం లోపల శబ్దాలు కువకువలాడటం 
ప్రతిదీ ఆశ్చర్యం, అద్భుతం

గడియారం క్షణాలు లెక్కించటం,
ఫ్యాను గాలి వృత్తాలని లెక్కచూసుకోవటం,
దీపం విసుగులేక ఒకలానే కాంతి ధారపోయటం
ప్రతిదీ తపస్సు, ఎడతెగని ధ్యానం

మెలకువలో తేలు,
గాఢనిద్రలో మునుగు, కలల్లో ఈదు 
ఈ రాత్రి ఇలానే గడుస్తుంది,
చీకటి ద్రవం పూర్తిగా ఒలికిపోయాక
ఖాళీ వెలుతురు ముఖం చూపుతుంది

ఇంతకన్నా ఏం కావాలి బ్రతికి ఉండటానికి, 
బాధనీ, భయాన్నీ, బరువైన పిట్టలా ఎగిరే నవ్వునీ 
అనుభవించటానికి, అనుభవాలని అనుభవించటానికి 

మామూలుగా మొదలవుతావు,
సందడిగా జీవిస్తావు, వినబడకుండా వెళిపోతావు 
జీవుల జీవితచరిత్ర ఇంతకన్నా ఏమీకాదు

కానీ, తలుపు తీయటం, వేయటం,
గడియ చప్పుడు చేయటం,
రాత్రిని నీ చుట్టూ బంధించటం,
చీకటిలో మాత్రమే కనిపించే దేనినో వెదకటం,
కాలాలకావల నక్షత్రాలుగా కాంతులీనుతాయి,
తరువాతి తరాల ప్రాణులతో
తెలియనిరాని సంభాషణలు జరుపుతాయి

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి