16 సెప్టెంబర్ 2025

కవిత : గుంపులు

మనుషులు ఇప్పటికీ తమని 
గుంపుల్లోనే గుర్తుపడుతున్నారు

నిన్ను చూసుకుంటావా
ఏ గుంపుకీ చెందినట్లు తోచదు,
గుంపులు పిల్లల ఆటలనిపిస్తాయి
కానీ, గుంపు జీవస్వభావం గనక
నీదే గుంపని వెదుకుతావు నీలోపల

ఇచ్చి, పుచ్చుకునే గుంపుల్లో ఉక్కపోస్తుంది,
పరస్పర ప్రదర్శనల గుంపులు డొల్లగా తోస్తాయి,
భయపెట్టే, భయపడే గుంపుల్లో ఇమడలేవు,
నియంతల్ని కలగనే బానిసల గుంపుల్లో నిలబడలేవు

ప్రతిభావంతుల గుంపులిష్టమైనా
వారి పరుగు పందాల్లో పాల్గొనలేవు, 
రసోన్మత్తులు, దయాపూర్ణులిష్టమైనా 
వారి ఉద్వేగాల చివర్ల వెలితి భయం ,
జీవితంపై వెర్రి మోహంతో గుంపులు కనిపిస్తే
వారిలో దూరిపోవాలని ఉత్సాహపడతావు కానీ
వారిని విడిచాక వెంటబడే ఏకాకితనం బావుండదు

కానీ, అగాథమైన నిశ్శబ్దముంది చూసావా,
మనుషులు గుంపుగా వెళ్ళలేనిది,
అది లోపలి నుండి చెబుతుంది,
నువు ఎవరికీ చెందవు, ఎవరూ నీకు చెందరు 
 
పక్షి ఆకాశం నుండి విముక్తి కోసం ఎగురుతున్నట్లు
ఏ గుంపూ లేనిచోటికి ఎగరాలి, 
నీ లోపలికి ఎగురుతున్నపుడు గానీ తెలుసుకోలేవు

గుంపులూ, ఏకాకితనాలూ లేనేలేవని,
నువు తెలియరాని ఏకాంతానివని,
ఉష:కాలపు ప్రశాంతిలో తిరుగాడే
పండని, రాలని నారింజవంటివాడివని

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి