11 సెప్టెంబర్ 2025

కవిత : దయ

చాలాసార్లు కలగన్నావు 
ఇక మెలకువ రాకపోవటాన్ని,
కనురెప్పలు తెరుచుకుంటాయి,
దృశ్యం జలపాతంలా దుముకుతుంది

చివరి ఘడియ చెంత నిలిచినపుడు
సంతోషంగా చేతులు చాపుతావో,
వెనుదిరిగి కన్నీరు విడుస్తావో తెలీదు

భయం లోపలి ప్రేమా, 
ప్రేమ లోపలి భయమూ 
అంతు తెలియని రహస్య వలయం

ఎవరి ఆనందం కోసం ఇదంతా,
ఎవరి బాల్య చేష్ట,
ఎవరి తీరిక మధ్యాహ్నపు పగటికల

దీనిలో అందం, ఆశ్చర్యమున్నాయి,
దుఃఖం, క్రౌర్యం ఉన్నట్లుగానే;
వాటి నడుమనున్న నిశ్చలతలోకి మేలుకోవాలి

కాలం లేని అనుభవంతో 
కాలం గడవాలనుకోవటం,
స్థలాన్ని దాటి నిలిచి ఉండాలనుకోవటం 
ఏమిటీ వెర్రి అని ప్రశ్నించుకుంటావు

ఏకైక నిశ్శబ్దం ఏమీ బదులివ్వదు, 
ఏకైక శూన్యం అణువంత చలించదు

ఇలాంటి సమయాన దయ స్ఫురిస్తుంది,
భయాలలోకి ఉదయించే కాంతిలా

ఈ లోకంలో నీలో నువు 
నమ్మదగిన ఉద్వేగమేదైనా ఉంటే
అది దయ అనీ, నీకూ ఇవ్వబడిందనీ
నిన్ను ఓదార్చుకుంటావు

ఈ గాలినీ, నేలనీ, గగనాన్నీ తాకితే
కోమలంగా దయ తెలుస్తుంది చూసావా,
బ్రతకటానికి ఇంతకంటే ఏదైనా ఎక్కువ కదా

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి