25 డిసెంబర్ 2020

కవిత : వీధి అరుగుపై

ఆమె వీధి అరుగుపై కూర్చుని
దారిన పోయే అందరినీ పలకరిస్తుంది

ఎలా ఉన్నారనో
ఏం చేస్తున్నారనో అడుగుతుంది
తోచిన మాటలేవో
వడపోత లేకుండా మాట్లాడుతుంది

ఊరికే మాటల కోసం ఆమె
మనుషుల్ని కదిలించటం కోసం ఆమె
బ్రతికి ఉన్న స్పృహ ఏదో
తనలో, మనలో మేల్కొలపటం కోసం ఆమె

మనుషులు
కాలువలో నీటిలా వెళ్లిపోతూ వుంటారు
ఆమె ఒడ్డున నిలబడి
నీటిలోకి నీడని పరిచిన చెట్టులా పలకరిస్తుంది

ఇప్పుడేమీ అనిపించకపోవచ్చు
వినేవాళ్ళకి కాస్త విసుగు పుట్టవచ్చు
ఆమె అరుగుపై కనిపించని రోజుల్లో
అక్కడి వెలితి కాళబిలంలా
జీవనకాంతిని పీల్చుకొన్నపుడు తెలుస్తుంది

ఇన్నాళ్లూ అక్కడ కూర్చుని మాట్లాడింది
ఆమె కాదని, జీవితమని

01 నవంబర్ 2020

కవిత : అక్కడికి

ఎక్కడా లేని చోటికి
ఎప్పుడూ లేని కాలానికి
ఏదీ లేని అనుభవానికి
నాలుగు ద్వారాలున్నాయి

నేను
ఇప్పుడు
ఇక్కడ
ఇలా

ఏదో ఒక ద్వారంలోంచి
లోనికి వెళ్ళినపుడు
పూర్తిగా వెలుపలికి వెళ్లిపోతావు
కాలం కక్ష్య దాటి అనంతంలోకి

అక్కడ
రంగులేని రంగు
రూపంలేని రూపం
రుచిలేని రుచి
స్పర్శలేని స్పర్శ
శబ్దంలేని శబ్దం
వాసనలేని వాసన
నీకోసం ఎదురుచూస్తాయి

తెలిసినచోటు నుండి
దానిని మృత్యువంటారు
తెలియనిచోటు నుండి
దానిని జీవితమంటారు

02 అక్టోబర్ 2020

కవిత : పాతబడని..

చీకటి పొదిగిన సూర్యునిలోంచి
తెల్లని రెక్కలు విదిలించుకొని లేచిన
వెలుతురు పక్షి
తూర్పు ఆకాశం నుండి పడమటికి ఎగురుతోంది

పగటికాంతి పొదిగిన చంద్రునిలోంచి
చల్లని రెక్కలు మెల్లగా కదిలించి కదిలిన
వెన్నెల పక్షి
తూర్పు తీరం నుండి పడమటికి ఈదుతోంది

ఎందరు కవులు ఊహించి వుంటారో
అక్షరాలా ఇలానో, అటూ ఇటుగానో

ఊహలు పాతబడతాయి గానీ
ఊహించటం పాతబడదు
అనుభవాలు పాతబడతాయి గానీ
అనుభవించడం పాతబడదు

కన్నీళ్లూ, చిరునవ్వులూ పాతబడతాయి గానీ
నవ్వటమూ, ఏడవటమూ పాతబడవు
జీవితం పాతబడుతుంది గానీ
జీవించటం పాతబడదు

అవును, జీవించటం పాతబడదు
దేహం పాతబడినా
నాకు నేను ఎప్పటికీ పాతబడనట్లు..

ప్రచురణ : పాలపిట్ట, సెప్టెంబర్ 20


కవిత : నాది

నాది కావాలనో
నాది కాకుండా పోకూడదనో
నీ శ్వాసల్లో నూటికి తొంభై ఖర్చు చేస్తావు గానీ

నాది అనుకున్నదల్లా
నీ శ్వాసపైనే కూర్చోవటం గమనించావా
నీకు గాలాడకపోవడం చూసుకున్నావా

అప్పుడప్పుడూ
బహుశా, ఎప్పుడూ కూడా
ఊపిరాడని నిన్ను వదిలించు కోవటానికి

వినోదాలూ, విహారాలూ
స్నేహాలూ, కబుర్లూ
బాధ్యతలూ, సరదాలూ
బాధలూ, సందర్భాలూ అంటూ

నీనుండి నువ్వే
తప్పించుకు తిరగటం కనిపెట్టావా

నాది ఒక గోడ
దాని కొలతలు అనంతం
దాని ముందు ఆకాశం ఒక పిట్ట

ఈ కథ నిజంగా నీకు అర్థమైన క్షణంలో
నువ్వు గోడ మీద ఉంటావు

ప్రచురణ : కవిసంధ్య సెప్టెంబర్ 20

27 సెప్టెంబర్ 2020

కవిత : నీటిలాంటి..

ఉన్నది ఉంది, లేనిది లేదు
ఉన్నది లేదు, లేనిది ఉంది
ఉన్నదీ ఉంది, లేనిదీ ఉంది
ఉన్నదీ లేదు, లేనిదీ లేదు

ఇది నీటిలాంటి కవిత
గాలి లాంటి కవిత
ఎలా కావాలంటే అలా వంపు తిరుగుతుంది
మడతలు పడుతుంది, సర్దుకుంటుంది
ఎప్పుడు ఎలా కావాలంటే అలా
మార్చుకొని చదువుకోవచ్చు

అవి ఉత్త పదాలనుకొంటే
పదాల్లోకి దారి తప్పుతావు
భావాలనుకుంటే భావాల్లోకీ
అనుభవమనుకుంటే అనుభవంలోకీ తప్పిపోతావు

నీకిప్పుడు కావలసింది
పూలు రాల్చిన కొమ్మలానో
ఆకులు రాల్చిన చెట్టులానో ఉండటం కాదు
చెట్టుని రాల్చిన ఆకాశంలా ఉండటం
ఆకాశాన్ని రాల్చిన అనంతమై పోవటం

ఉన్నావా, లేవా
ఈ పదాలతో మరో కవిత రాస్తున్నావా
ఎవరో తలుపు తట్టినట్టు
ఏదో నీ నిద్రని తట్టిన చప్పుడయితే చెప్పు

ప్రచురణ : సారంగ 15.9.20