19 ఫిబ్రవరి 2012

ఫొటోలు: శ్రీ భీమ శంకరం, సహ్యాద్రి పర్వతాలు.

ప్రకృతిధర్మాన్ని అనుసరించి మనిషి సంచారజీవి ఏమో అనిపిస్తుంది. గమనించి చూస్తే, మనిషి సంచరిస్తున్నపుడు మనస్సు స్తిమితంగా ఉంటుంది. స్తిమితంగా ఒకచోట కూర్చున్నపుడు మనసు సంచరిస్తూ ఉంటుంది. అయితే తిరగటం కేవలం తిరగటం కోసమే అయినప్పటికంటే, ఉన్నతమైన గమ్యాన్ని చేరటానికి తిరుగుతున్నపుడు మనలో సాంద్రమైన ఉద్వేగం ఉంటుంది. మనిషి ఇల్లువిడిచి వెళుతున్నప్పటికంటే, బహుకాలం తరువాత తన ఇంటికి తిరిగి వెళుతున్నపుడు ఒక ఉద్వేగానికి లోనవుతాడు. 

ప్రపంచంతో కేవలం బౌద్ధిక (intellectual) సంబంధం మాత్రమే కాక, హృదయగతమైన సంబంధం కూడా మేలుకొన్నపుడు, ఈ సమస్తాన్నీ విభాగాలుచేసి చూడటం మాత్రమే కాక, అంతటినీ ఏకంచేసి చూడాలనే కాంక్ష కూడా కలుగుతుంది. అట్లా అంతటినీ ఒకటిగా చూసే క్రమంలో సమస్తాన్నీ కలిపి ఒకే పేరుతో పిలిస్తే, ఆ పేరే దైవం అని భావిస్తాను. విశ్వం, సృష్టి లేదా జీవితం అనే పూర్ణభావనలే పూర్తిగా హృదయం నుండి పలికినపుడు దైవంగా భావించబడతాయి. ఈ దైవభావం భయం సృష్టించే దైవం కాదు, ప్రేమ సృష్టించే దైవం. ఇది స్వార్ధసృష్టి కాదు, త్యాగసృష్టి. అహంకార సృష్టి కాదు, మానవీయ విలువల సృష్టి. 

కొన్ని పవిత్ర స్థలాలలో, జీవులలో ఆ ప్రేమస్వభావం శక్తివంతంగా వ్యక్తమౌతుంది. ఆయా స్థలాలనూ, మహాత్ములనూ దర్శించినపుడు, సాధారణజనులకు తమ హృదయంలోకి తామే మరొక అడుగు త్వరగా వేసినట్లు అనిపిస్తుంది. అనేకమంది తాము ఎందుకు యాత్ర్ర చేస్తున్నారో తెలియకుండానే చేసినా, వారిలోని మానవీయ స్పందనలనూ, స్వచ్ఛతనూ అనుసరించి వారు తమ అంతరంగంలోనికి వేగంగా ప్రయాణిస్తారు. ఎలాంటి మానసిక పరిపక్వతా లేకుండా, తమలోని స్వార్ధమనే మహాభూతానికి సేవచేయడానికే యాత్రలుచేసే మొరటు మనుషుల నడుమ, అరుదుగానైనా అలాంటి ఆర్తిగల కొందరుంటారు. బహుశా, ఆ అరుదైనవాళ్ళకోసమే ఆ పవిత్రక్షేత్రాలూ, మహాత్ములూ ఓరిమిగా ఎదురుచూస్తుంటారు. 

దైవాన్ని దర్శించడం అంటే తన మూలాన్ని, తన స్వగృహాన్ని దర్శించడం. అట్లాంటి భావంతో యాత్రకు బయలుదేరినప్పుడు, మనలో ఇంటికి చేరుతున్న ఉద్వేగం ఉంటుంది. తన తండ్రినీ, తల్లినీ చిరకాలపు వియోగం తరువాత దర్శించబోతున్న ఆర్తి ఉంటుంది. అంతేకాకుండా తానొక ప్రేమపూర్వకమైన సన్నిధిని చేరుతున్నానన్న స్పృహ వలన, దారివెంట తాను చూస్తున్న ప్రతిదీ ప్రేమమయమౌతుంది. దారివెంట తాను చూసిన ప్రకృతీ, జీవులూ, మానవులూ - సమస్తమూ, తాను చూడబోతున్న దివ్యత్వానికి సన్నిహితమైనవి అయినట్టూ, అవి అన్నీ తనను అక్కడికి చేర్చేందుకు దారిచూపుతున్నట్టూ అనిపిస్తుంది. కాలం నిండా పలుచని గాలిలా, మంచుతెరలా, వానజల్లులా ప్రేమ అలముకొన్నట్టుంటుంది. చివరకు ఆ దివ్యస్థానాలను చేరినప్పుడు హృదయం కరుగుతుంది, కళ్ళు సజలాలౌతాయి. గాఢమైన, లోతైన నిశ్శబ్దం లోపల మేలుకొంటుంది. బహుశా, యాత్ర ముగుస్తుంది.. 

దైవాన్ని జ్యోతిస్వరూపంగా పెద్దలు భావించిన క్షేత్రాలలో ఒకటైన శ్రీ భీమశంకరం యాత్ర, మార్గం నుండి గమ్యం వరకూ మెత్తనికాంతి నింపిన అనుభవం. దారివెంట మంచుతెరల దోబూచులాటలతో పాటు కనిపించీకనిపించకుండా ఆ దివ్యత్వం మనిషితో ఆడుతున్న దోబూచులాట.. ఈ పొగమంచు ఎవరు తొలగించాలి.. మనిషా.. దైవమా..    

అన్ని ఫొటోలనూ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 







17 ఫిబ్రవరి 2012

ఫొటోలు: ఎల్లోరా గుహలు

మన పూర్వ మానవులు తమ సౌందర్య స్పృహనీ, కలల్నీ, విశ్వాసాలనీ ఈ గుహలలో పొందికగా పదిలపరిచారు. కఠినమైన శిలలలో దాగిన మృదువైన భావాలను శ్రద్ధగా ఆవిష్కరించారు. ఇవి జీవితానికి మనిషి సమర్పించిన ప్రేమలేఖలు. తన తరువాతి తరాలకు మిగిల్చిన కలలసంపద.

రాళ్ళలో సౌందర్యం వుంటుంది. మరలా ఆ సౌందర్యం వెనుక కఠినమైన శిలవుంటుంది. మనిషిలో సౌందర్య స్పృహ వుంటుంది. మరలా ఆ స్పృహవెనుక అగాధమైన దు:ఖం వుంటుంది. సున్నితమైన సౌందర్యమూ, కఠినమైన జీవితమూ వేరువేరా, ఒకటేనా. అవి రెండూ ఒకదానినొకటి ఆశ్రయించుకొన్నట్లుగా కనిపిస్తున్న రెండు వస్తువులా, ఒకే వస్తువా. శిలలోని ప్రతి రేణువూ తానొక శిల్పంలా కోమలంగా వ్యక్తం కావాలని సదా తపిస్తుంది. శిల్పంలోని ప్రతి ఒంపూ సదా తాను శిలలా స్థిరంగా, నిశ్చలంగా నిలబడాలని కలగంటుంది.

శిల్పులు చెక్కగా, ఇంకా అవ్యక్తంగా మిగిలిపోయిన జీవన సౌందర్యమేదో, విషాదమేదో ఈ శిల్పాలచుట్టూ పారాడుతూవుంటుంది.

అన్ని ఫొటోలనూ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.









24 జనవరి 2012

మీరు కవిత్వ ప్రేమికులై, మనశ్శాంతిని కలిగించగల కవిత్వం కావాలనుకొంటే ఆకాశం చదవండి.





'ఆకాశం' కవిత్వం అతి సున్నితమైన జీవన స్పర్శ నుండీ, ప్రగాఢమైన తాత్విక చింతన నుండీ వ్యక్తమైంది. దీనిని నేను పాఠకుడికి కేవలం కావ్యానందం ఇవ్వటం కోసం కాని, ఈ కాలం సాహిత్య వాతావరణం లో బాగా ప్రచారం లో ఉన్న సామాజిక, రాజకీయ స్పృహ తో కానీ రాయలేదు. వాటికి పైనున్న ఒక ఉదాత్త లక్ష్యంతో రాసాను.

ఇటువంటి కవిత్వం రాయటానికి కవికి జీవితంపట్ల ఎటువంటి  గౌరవమూ, శ్రద్ధా  కావాలో, తనలోకి తాను నిష్కపటంగా పరిశీలించుకోగల శుభ్రమైన దృష్టి కావాలో, పాఠకునికీ అటువంటి శ్రద్ధా, దృష్టీ కావాలి. అటువంటివారు ఏ దేశకాలాలకీ, జీవన విధానాలకీ చెందినవారైనా, మాయపొరల వెనకాల ఉన్న తమ స్వచ్ఛమైన ప్రతిబింబాన్ని ఈ కవిత్వంలో దర్శించి ఆశ్చర్యపడతారు.  

ఇటువంటి కవిత్వాన్ని మార్మిక కవిత్వం గా పిలవటం సాహిత్య ప్రపంచం లో వాడుక. అంటే జీవన మౌలిక సత్యాలను వెదికేది, అనుభవం లోకి తెచ్చే ప్రయత్నం చేసేది అని. టాగోర్, సూఫీ కవులు, కన్నడ శివకవులు, కొన్ని సందర్భాలలో మన అన్నమయ్య, వేమన, పోతన లు, ఖలీల్ జిబ్రాన్ ఈ తరహా కవిత్వం రాసిన వారిలో కొందరు. జపాన్ కు చెందిన హైకూ కూడా ఇటువంటి కవిత్వమే.

ధ్యానమంటే సమగ్రమైన, సంపూర్ణమైన స్పందన అని అనుకొంటే, దీనిని ధ్యానకవిత్వంగా కూడా భావించవచ్చు.

కవినో, కవిత్వాన్నో తెలుసుకోవటం కోసమో, కాలక్షేపం కోసమో కాకుండా, మీ హృదయం నిజంగా జీవితానుభవాల వల్ల బరువెక్కి ఉంటే, మీ మనసే మీకు అర్థంలేని గీతలతో, మరకలతో నిండిన కాగితంలా కనిపిస్తూ, అసహనానికి గురి చేస్తుంటే, జీవితం ఏమిటి, ఎందుకు వంటి ప్రశ్నలు లోలోపల ఎక్కడో ముల్లులా గుచ్చుతూ ఉంటే, ఈ కవిత్వం తప్పక చదవమని చెబుతాను.

ఇది తప్పక మీలో ఒక ప్రశాంతమైన వెలుతురునీ, నెమ్మదినీ, నిజమైన వివేకంతో నిండిన ఆలోచనా శక్తినీ, అతి సహజమైన జీవనానందాన్నీ మేలుకొలుపుతుందని నమ్ముతున్నాను.


ఆకాశం కవితాసంపుటి దొరికేచోట్లు:
హైదరాబాద్: నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ
విజయవాడ: మైత్రి బుక్స్, ఏలూరు రోడ్ 
కర్నూలు: విశాలాంధ్ర బుక్ సెంటర్
నిజామాబాద్: కీర్తి బుక్‌స్టాల్, బస్‌స్టాండ్
పోస్టులో కావలసిన వారు: పాలపిట్ట బుక్స్, 040-27678430
ఇంటర్నెట్ ద్వారా కావలసినవారు: kinige.com 

18 జనవరి 2012

బుద్ధుడు స్థల కాలాలను దాటిన నేల, బుద్ధగయ

నాకు తెలిసినంత వరకూ, ఏ నమ్మకాలతోనూ, భయాలతోనూ సంబంధం లేకుండా సత్యాన్వేషణ ను ప్రపంచానికి పరిచయం చేసినవారు గౌతమ బుద్ధుడు.

సత్యం ఒకటే అయినా, అది అనేక దేశ కాలాలో అన్వేషకుల చేత, జ్ఞానుల చేత అనేక రకాలుగా వర్ణించబడింది. సత్యం వర్ణనకూ, ఆ మాటకు వస్తే మనస్సుకీ అందనిదని వారే చెబుతుంటారు. నాకు అర్ధమైనంత వరకూ, సత్యానుభవం లేదా సత్యస్ఫురణ అత్యంత నిర్మలమైన, ప్రశాంతమైన మనస్సుకి తెలుస్తుంది. స్వచ్చమైన నీటికి రంగు లేనట్లు, స్వచ్చమైన సత్యానుభవానికీ ఏ భావనా స్థితీ ఉండదు. అయితే ఇందరు జ్ఞానులు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పారు. చెప్పినవన్నీ భావాలనుండి విముక్తి పొందటానికే కాని, క్రొత్త భావాలను కల్పించు కోవటానికి కాదు. మనస్సు అమనస్సు కావటానికి, ఎన్ని ఉపాయాలు అవసరమో అన్నీ ఎవరో ఒకరు, ఏదో ఒక కాలంలో చెబుతూ వచ్చారు.

మనలో చాలామందికి మతానికి, సత్యాన్వేషణ కూ భేదం తెలీదు. మతం ఏదైనా కొన్ని భయాల, నమ్మకాల, అలవాట్ల సమాహారం. సత్యాన్వేషణ, జీవితం పట్ల తీవ్రమైన శ్రద్ధ గలవారి మార్గం. మతం సామాన్యులకు జీవితం సాఫీగా సాగేందుకు అవసరమైన కొన్ని పద్ధతులను నేర్పుతుంది. కాని మతం నమ్మమంటుంది, భయపడమంటుంది. సత్యాన్వేషణ ప్రశ్నించమంటుంది, మరింత కాంతివంతమైన ప్రేమలోకి మేలుకోమంటుంది. ప్రతి మతం లోనూ, సామాన్యులూ, అన్వేషకులూ ఎవరిదారిన వారు నడుస్తూ ఉంటారు.

నిన్ను నువ్వు అత్యంత సన్నిహితంగా పరిశీలించుకో, నీ లోపలి ప్రపంచాన్ని నిజాయితీగా, భయం లేకుండా గమనించు. నిన్ను నువ్వు సరిగా పరిశీలించుకొంటే చాలు, క్రమంగా నీ లోపలి సంక్లిష్టత అంతా మాయ మౌతుంది. నువ్వు నీ లోతుల్లోకంటా భయరహితంగా ఉన్నపుడు, జీవితం పట్ల నువ్వు ఉదాత్తంగా స్పందించ గలుగుతావు. నువ్వు సజీవమైన ప్రేమతో నిండుతావు. అప్పుడు నీవలన ప్రపంచానికి నిజమైన మేలు జరుగుతుంది, నువ్వు ఉండటమే ప్రపంచానికి దీవెన అవుతుంది. దీనినే ఉపనిషత్తులూ, బుద్దుడూ, జీసస్ ఇంకా అనేక మహాత్ములు చెప్పారని, నాకు అనిపించింది.

అటువంటి మహాత్ముడు ఒకప్పుడు సంచరించాడని, నమ్ముతున్న నేల బుద్ధగయ. వారికి ఇక్కడే సత్యస్పురణ కలిగిందని ప్రజల నమ్మకం. స్థల కాలాతీతమైన సత్యాన్ని, దర్శించిన వారిని, అటువంటి సత్యం లో తమను లీనం చేసుకొన్నవారిని, స్థలకాలాలకు లోబడిన మనం, వాటి ద్వారానే గుర్తిస్తాం, గుర్తుపెట్టుకొంటాం. ఇది ఒక విరోధాభాస లా ఉన్నప్పటికీ, మనలో వారిపట్ల నిజమైన ప్రేమ ఉంటె, వారు సంచరించిన ప్రదేశాలలో, ఇంకా వారి ప్రేమపూర్వక శ్వాస ఏదో చరిస్తున్నట్లు అనిపిస్తుంది. వారి పిలుపు మరింత గాఢంగా వినిపిస్తున్నట్లుంటుంది.

అన్ని ఫొటోలనూ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.










10 డిసెంబర్ 2011

నేను చదివిన 'నేను తిరిగిన దారులు'


శ్రీ చినవీరభద్రుడు గారికి

నమస్తే

'నేను తిరిగిన దారులు' చదవటం పూర్తి చేసాను. ఇటీవలి చాలా సంవత్సరాలలో నేను విడవకుండా చదివిన పుస్తకం ఇది.

ఈ పుస్తకం అట్లా చదవటానికి గల కారణాలలో ముఖ్యమైనవి ఆయా ప్రదేశాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఒకటైతే, జీవితం పట్ల శ్రద్ధా, విస్తృతమైన అధ్యయనం, ఆర్ద్రత కోల్పోని వ్యక్తిత్వం, విశాల దృక్పధం గల ఒక వ్యక్తి ఆయా స్థల, కాలాలకు ఎట్లా స్పందించారో తెలుసుకోవాలనుకోవటం ఒకటి. ఈ రెండు ఆసక్తులనీ పుస్తకం తృప్తిపరిచింది.

పుస్తకం అంతటా నేపధ్యం గా పరుచుకొన్న మీ వ్యక్తిత్వమే, ఈ పుస్తకానికి ఎక్కువ విలువనిచ్చింది. పుస్తకం పొడవునా మీరు నడిచిన దారిలో ఒక విశ్వమానవుడిని దర్శించటం ఒక ప్రశాంతమైన సంతోషాన్ని కలిగించింది. మీ వాక్యాలలోని సంయమనం, నా వంటి పాఠకులకు, ఆలోచనలలో అట్లాంటి సంయమనాన్ని అలవరచుకోవటానికి ప్రేరణగా నిలుస్తుంది.

ఏ విశ్వాసాలనుండి సాహిత్య సృజన, కళా సృజన చేసినా అది చివరికి పాఠకుడికి మరింత ఉన్నత స్వభావం కలిగి ఉండటం వైపుగా ప్రేరణ కలిగించేది అయి ఉండాలని, నేను పూర్తిగా నమ్ముతాను. అటువంటి స్పష్టమైన నిబద్ధత గలవారు అరుదైన రోజులు మానవ ఇతిహాసం లో నిద్రాణ దినాలుగా భావిస్తాను.

సకల కళా రూపాలూ, ఆ మాటకు వస్తే నిత్య వ్యవహారాలతో సహా సకల మానవ అభివ్యక్తీ, మరింత ఉన్నతమైన మానవవిలువల సాధనా క్షేత్రంగా మనుషులు భావించగలిగితే, జయాపజయాలకన్నా, కీర్తికన్నా, సదా జ్వాలామయమయ్యే ఇంద్రియవాంఛల తృప్తి కన్నా, ఇట్లాంటి విలువలు మాత్రమే మానవులకు సదా పథనిర్దేశం చేసేవిగా ఉంటే జీవితానుభవం స్వర్గతుల్యమౌతుంది కదా అనిపిస్తుంది.
సకలాభివ్యక్తీ ఒకరి జ్ఞానాన్నీ, బలాన్నీ, బుద్ధికౌశల్యాన్నీ, ఉద్వేగపటిమనూ, ఊహాశక్తినీ వ్యక్తీకరించేది మాత్రమే కాకుండా, వాటి నేపధ్యం లో నిర్మల అంతఃకరణ సంగీతాన్ని, సజీవ హృదయస్పందననీ వినిపించేది కావాలని సదా కలగంటాను.

మనిషి, తనకు దేహాత్మ బుద్ధి వలన ఉత్పన్నమయ్యే అహంకారాన్ని ఉపేక్షించి, అతనికి అంతర్వాణి రూపంలో దృశ్యాతీత సత్యం వినిపించే పిలుపుని సదా అనుసరించగలిగితే జీవితానుభవం తేజోమయమౌతుంది గదా అనుకొంటూ ఉంటాను.

మరికొన్ని లక్షల సంవత్సరాలకు ఈ మానవ జీవన బీజం సంపూర్ణంగా వికసిస్తుందనుకొంటాను. ప్రాచీనులు అలాంటి కాలాన్నే సత్యయుగం అని ఉంటారు.

మరీ గాఢంగా మాట్లాడాను. మీ పుస్తకం ఏ భావాల నేపధ్యం నుండి చదివానో, ఆనందించానో మీతో పంచుకోవాలని ఈ మాటలు.

ప్రేమతో, గౌరవంతో

మీ
బివివి ప్రసాద్ 

06 నవంబర్ 2011

ఫొటోలు: నా ఉత్తరదెశ యాత్ర : కేదారనాధ్, హిమాలయాలు

       సాహిత్యం, తాత్వికత నా జీవితాన్ని ఆక్రమించి, నన్ను శాసించిన యవ్వన కాలం నుండీ, ఈ దేశం అంతా తిరిగి చూడాలని ఉండేది. భిన్నమైన భాషలు, నమ్మకాలు, అలవాట్లతో కూడిన ఈ దేశపు సామాన్యుల జీవితాన్ని కళ్ళారా చూడాలని ఉండేది. మరీ ముఖ్యంగా చనిపోయేలోగా, హిమాలయాలను, గంగా నదిని చూడాలని ఒక కోరిక లోపల వెలుగుతూ ఉండేది. నేను సహజంగా స్వాప్నికుడిని. కారణాలు ఏమైనా, నా కలల్ని అనుసరించి నా పాదాలు ఏనాడూ కదలలేదు.

అయితే నాలుగైదు సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా, సమీప బంధువుల తో కలిసి ఉత్తర దేశ యాత్రలకు వెళుతున్న బస్సు లో బయలుదేరాను. నేను స్వప్నించిన జీవితానుభవాన్ని, ఒక మినియేచర్ దృశ్యంగా అయినా అనుభవించే అవకాశం కలిగింది. సుమారు యాభై రోజులు చేసిన ప్రయాణంలో రెండువేలకు పైగా ఫొటోలు తీసాను. చాలాకాలం క్రితమే ఇవి నా పికాసా ఆల్బంలో ఉంచాను. ఇప్పుడు నా బ్లాగ్ ద్వారా వాటిని మరలా మిత్రులతో పంచుకొంటున్నాను.

ఈ దేశపు గ్రామీణులలో ఇంకా జీవితంలోని పచ్చదనం కొద్దిగా మిగిలి ఉంది. వారిని చూస్తున్నపుడు ఫొటోల కోసం నా ఆనందాన్ని పాడు చేసుకోవాలనుకోలేదో, లేదా నిశ్చల చిత్రాలను మాత్రమే కావాలనుకొన్నట్లు తీయగల వ్యవధీ, నైపుణ్యం మాత్రమే ఉండటమో కారణాలు సరిగా జ్ఞాపకం లేవు కాని, వీటిలొ ఈ నేల ప్రాచీన పరిమళాలూ, ప్రకృతీ మాత్రమే ఉంటాయి. ఒక దృశ్యంలోని కవితాత్మకతను కెమెరాలో పట్టుకోవటానికి, నాకున్న వ్యవధిలొ ప్రయత్నించాను.

ఇంతకు ముందు, పాపికొండలు, వారణాసి ఫొటోలు తీసినపుడు తరువాత, వాటికి కవితాత్మక లేదా తాత్విక వ్యాఖ్యలు రాసాను. వీటికి కూడా, ఎప్పటికైనా రాయగలిగితే బాగుండును.

స్వప్నం నుండి స్వప్నానికి, దిగులు నుండి దిగులుకి ప్రయాణిస్తూ ఉంటాం కదా. ఒక విషాద సౌందర్యమేదో, మనలో అంతర్వాహినిలా ప్రవహిస్తూ ఉంటుంది, బహుశా దానినే హిమాలయాలలో, గంగానదిలో నేను దర్శించి ఉంటాను...

వీటిని నేను ప్రయాణించిన క్రమంలో చూడదలచినవారు, నా పికాసా వెబ్ సైట్ ని చూడవచ్చు. లేదా వీలునుబట్టి, నేను ఒక్కొక్క ఆల్బం బ్లాగ్ లో జత చేస్తూ ఉంటాను.

అన్ని ఫొటోలనూ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.