06 అక్టోబర్ 2011

కినిగే.కామ్ లో నా హైకూల పుస్తకం.












నా మూడు హైకూ సంపుటులు, 
హైకూ పై ఇస్మాయిల్, సంజీవదేవ్, 
బివివి ప్రసాద్ వ్యాసాలు, రేడియో ఇంటర్వ్యూ 
అన్నీ కలిపి ఒకే పుస్తకం గా వచ్చాయి.
ఆసక్తి గలవారు చూడండి.

http://kinige.com/kbook.php?id=418




7.5.2013
ఇప్పుడు ఈ పుస్తకం ఆవకాయ.కాం లో ఉచితంగా లభిస్తోంది. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

04 అక్టోబర్ 2011

హైకూలు

ఓ సీతాకోక
చుట్టూ చేరాయి
నదీ, పర్వతాలూ

పిట్టలు కూస్తున్నాయి
గాలి నిండా
రంగుల శబ్దాలు

రాయి నాటాను
కొలను కొలనంతా
తామరాకైంది

పొద్దుటి పొగమంచు
మేలుకొన్నట్టు
కలగంటున్నానా

పాట బాగుంది
దూరంనించి వినిపించటం
ఇంకా బాగుంది

చేయి పట్టుకొంది నిద్రలో
పాప కలలోకి
ఎలా వెళ్ళను

వెన్నెల నదిలో
ఒంటరిగా ఈదుతూ
చందమామ

చందమామ
నా బాల్యంలో
చాలా అందంగా ఉండేది

అనాధ బాలిక
జాలి దానం చేసి
వెళ్ళిపోతోంది

ఆటలో ఓడిపోయాను
ఆ పసివాడి
నవ్వు చూడాలని

పంజరం
ఖాళీగా ఉంది
ప్రేమంటే తెలిసిందేమో

నిద్రలో పాపాయి
జో కొడుతున్నాను
నా కోసం

( 'హైకూ' సంపుటి నుండి )

01 అక్టోబర్ 2011

కవిత్వం పాఠాలు


1
కవిత్వమంటే హృదయ స్పందన
ఈ మాట సరిగా అర్ధమైతే చాలు
ఏది కవిత్వం కాదో, ఏది జీవితం కాదో కూడా తెలుస్తుంది

2
కవిత్వానికి హృదయం రధి, కవి సారధి, వస్తువు రధం
ఉద్వేగం అశ్వం, తత్త్వం మార్గం
శబ్ద వైచిత్రీ, తర్కవిన్యాసం, అలంకారాలూ అస్త్రాలు. ధ్వని బ్రహ్మాస్త్రం
రసజ్ఞునిలో అమానవుని తొలగించి మానవుని రక్షించటం లక్ష్యం

3
తత్త్వం లేని ఉద్వేగం కళ్ళు మూసుకొని నడుస్తుంది
ఉద్వేగం లేని తత్త్వం ఊరికే కూర్చుని చూస్తుంది
అన్ని రంగుల్నీ దాచుకొన్న తెలుపులాంటిది ప్రశాంత ఉద్వేగం
అనంతజ్ఞానానికి తెరుచుకొన్న ఆశ్చర్యమే తత్వసారం

4
పదాలతో కాదు, భావంతో ఉండాలి
భావంతో కాదు, నీతో నువ్వుండాలి
నీతో నువ్వున్నపుడు నీలో జీవన సారం ఉండాలి
నిర్మలమైన దు:ఖంతో నిండిన జీవితముండాలి
అక్కడ మాట్లాడాలన్న కోరిక పుట్టాలి
అది పదాల వరకూ తోసుకు రావాలి

5
ఇవాళ బ్రతకాలి కాని, నిన్నటిలో, రేపటిలో వీలుకాదు
నిలబడినచోట చూడాలి కాని, లేనిచోటును చూడలేము
ఇవాల్టి తాజా పదాలూ, భావాలూ, శిల్పమూ పట్టుకొని
నిజంగా మనదైన బ్రతుకులో నిలబడి మాట్లాడాలి

6
పక్షి రెక్కలు తగిలిస్తే పక్షి కాలేము, మన ఊహ పక్షిలా రెక్కలు విప్పాలి
పూల రేకుల్లో మునిగితే పూవు కాలేము, మన కల పూవులా వికసించాలి
అక్షరాలు కూర్చితే కవి కాలేము
కవిగా జీవించటం సాధన చేయాలి, నిజాయితీగా స్పందించే అలవాటుండాలి

7
కవిత్వం రప్పిస్తే కవులం కాలేము
కవిత్వాన్ని తప్పించుకోలేనివారు కవులవుతారు
భావం కవిని అనుసరిస్తే ఉపన్యాసమౌతుంది
కవి భావాన్ని ఆశ్రయిస్తే, ధ్యానిస్తే కవిత్వం వస్తుంది

__________________
'ఆకాశం' సంపుటి నుండి 

25 సెప్టెంబర్ 2011

ఫొటోలు: వారణాసి, గంగానది, కవిత్వం

వారణాసినీ, గంగానదినీ చూడాలనే ఆర్తి అంతకుముందు చాలాసార్లు కలిగేది. ఇవి ఒక మతానికీ, విశ్వాసానికీ సంబంధించినవి మాత్రమే కాదు, అనాదినుండీ భారతీయ జీవనదార్శనికతకి ఇవి ఉన్నతమైన స్థానాలు. మనిషి మరణించే నిమిత్తం, మరణించాక తిరిగి జన్మించకుండా ఉండే నిమిత్తం ఒక క్షేత్రాన్ని ఎంచుకోవడం బహుశా, భారతీయ జీవనవిధానంలో మాత్రమే ఉంటుందేమో. ఆ ఆలోచనల వెనుక ఉన్న గొప్ప భావవాహిని ఇవాళ్టి ఉపరితల జీవితాలకి అర్ధం కాకపోవచ్చును. అక్కడకు వెళ్ళాక వారణాసీ నగరం నేను ఊహించుకొన్నదానికి అదనంగా కొంత నాగరికతని జోడించుకొన్నట్టు కనిపించింది కానీ, గంగానది నా ఊహల కన్నా ఉన్నతంగా అనిపించింది. గంగానది నా అంతస్సారమేమో అనిపించింది. 'నా' ఒక వ్యక్తి కాదు, మానవజాతి. గంగని దర్శించినపుడూ, గంగ ఒడిలో నన్ను దాచుకొన్నపుడూ గొప్ప స్వచ్చత, గొప్ప సరళత్వం, వాటిని మించి తెలియరాని ప్రశాంతత నా ఉనికిని కమ్ముకొన్నాయి. ఒకరోజు గంగా ఆరతి చూసాను. మరొకరోజు గంగ మొదటి ఘాట్ నుండి చివరి ఘాట్ వరకూ నడిచి తిరిగాను. సుమారు ఒకవారం అక్కడ గడిపి తల్లీ మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను అని గంగానదిని తలుచుకొంటూ తిరిగివచ్చాను.

2006 నవంబరులో గంగను, వారణాసిని మొదటిసారి దర్శించినపుడు తీసిన ఈ ఫొటోలను చూడండి. 156 ఫొటోలు. వాటిని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
తరువాత రెండవసారి 2008 మే లో వెళ్లినపుడు తీసిన ఫొటోలను కూడా ఇక్కడ జత చేస్తున్నాను. 127 ఫొటోలు. వాటిని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.





రెండవ యాత్ర.





23 సెప్టెంబర్ 2011

చాలు


అడవిలో వికసించి రాలిన అనామక పుష్పంలా
ఎవరూ చూడనప్పుడు ఎగురుతూ వెళ్ళిపోయిన పేరు తెలియని పిట్టలా
అక్షరాలు గుర్తించేలోపు అదృశ్యమైన ఊహలా
గుడి తలుపులు మూసాక లోపల వెలుగుతున్న దీపంలా
నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి, నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి

కళ్ళలో దయా, స్పర్శలో నిర్మలత్వం,
మాటలో నిజాయితీ, మనిషిలా స్పందించటం మరిచిపోకుండా ఉంటే చాలు
హాయిగా నవ్వటమూ, హాయిగా ఏడవటమూ పోగొట్టుకోకుండా ఉంటే చాలు

దృశ్యమేదైనా చూడటమే ఆనందంగా
శబ్దమేదైనా వినటమే ఆనందంగా
రుచి ఏదైనా ఆస్వాదించటమే ఆనందంగా
జీవితమెలా వున్నా జీవించటమే ఆనందంగా ఉండగలిగితే చాలు

విశాలమైన మెలకువలూ, విశాలమైన నిద్రలూ తనివితీరా అనుభవిస్తే చాలు
వెలుపలా, లోపలా బోలెడంత విశ్రాంతి సంపాదించగలిగితే చాలు
బ్రతికినంత నిశ్శబ్దంగా, నిరాడంబరంగా మన చోటు ఖాళీ చేస్తే చాలు

It’s Enough
                                              
Like an unknown flower blossomed  
and fallen in the woods;
Like an anonymous bird that has flown away
unnoticed by anyone;
Like an imagining that  has disappeared 
even before the letters realised it;
Like a lamp that is shining inside
after the temple doors are closed
What if we live on silently, 
What if we depart unassumingly?

Compassion in eyes, propriety in touch,
probity in word, responding like a human--
it is enough!
Not forgoing laughing and 
weeping heartily is enough!
  
Whatever the scene,
seeing itself is a joy
Whatever the sound,
hearing itself is a boon
Whatever the taste,
relishing is a gift
Whatever be the life
Enough if living itself becomes a bliss!

It is enough to enjoy to one’s heart’s content
the broad daylights and long sleeps
Enough to have earned plentiful rest
outwardly and inwardly
Enough to vacate our place
as calmly and modestly as one has lived!

Translation : Algati Thirupathi Reddy
__________________
'ఆకాశం' సంపుటి నుండి 

13 సెప్టెంబర్ 2011

'ఆరాధన' మొదటి సంపుటి నుండి..

1
సామ్రాజ్యాలను జయించినా
కీర్తి విస్తరిల్లినా
చిరుగాలికి ఊగే పచ్చగడ్డి మీది నుంచి
జారిపడే మంచుబిందువుని చూసి
మౌనంలో పడకపోతే
జీవితపు విలువలు తెలియవు

2
మరొక వేకువ
నీకు నీరాజనం ఇవ్వటానికి వస్తుంది
పుష్పాలు తమ అలంకారాలను
నీకోసం సిద్దం చేసుకొంటున్నాయి
నీకు దారి ఇవ్వటానికి
మంచుపరదాలు పక్కకు తప్పుకొంటున్నాయి
కానీ
నిన్న రాలిన ఎండుటాకు
తన చివరి వీడ్కోలు తెలుపుతూనే వుంది

3
పిట్టల కూతలు
గాలిని కావలించుకొని
ఉదయకాంతికి స్వాగతం చెబుతున్నాయి

మంచుబిందువు చుంబించే పుష్పాన్ని
ఉదయకాంతి ఆశీర్వదిస్తుంది

పసిపాప నుదుటిని
చిరుగాలి చుంబిస్తుంది
కనులు తెరవని పాప
గాలికి చిరునవ్వుని అద్దుతుంది

చెరువులో జారిపడిన ఎండుటాకు
తన అనుభవాలని చెరువుకి వివరిస్తుంది

అహంకారి మానవుడు
ఈ లోకంలో ఒంటరిగా మిగిలాడు

4
నా మౌనం అరణ్య నిశ్శబ్దాన్ని తాకినప్పుడు
నా నిట్టూర్పు కెరటాలచే ఆహ్వానించబడినప్పుడు
నేను జీవించే ఉన్నానని నాకు స్పష్టమైంది

5
ఉదయం వికసించింది
పుష్పాలు రేకులు విప్పాయి
తుమ్మెద వాలింది
గాలితెర కదిలింది

నన్ను ఎరిగిన నా మిత్రుడు
నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు

6
ప్రశ్నా
పరంపరలతో
నన్ను నేను వేధించుకొంటున్నపుడు
నన్ను తాకిన వాన చినుకు
ఆకాశంలో మెరిసే ఇంద్రధనస్సును చూడమని చెప్పింది

సప్తవర్ణాలలో నా చూపులు కరుగుతున్నపుడు
నన్ను గురించీ
ఇంద్రధనస్సును గురించీ
ప్రశ్నించాలన్న ధ్యాసే నానుండి మాయమైంది