చీకటిలోంచి వెలిగే సూర్యదీపం పైన,
చీకటిలోకి మలిగే సూర్యదీపం పైన,
చీకటివేళల వెలిగే వేనవేల దీపాల పైన
నీకు ఆసక్తి
ఆయా సమయాల కాంతులు
నిన్ను పిలుస్తాయి
చీకటిలో దీపంలా వెలగమని
దీపం లాంటి మెలకువ,
దుఃఖంలో చిరునవ్వు లాంటి కాంతి,
ఊపిరాడని నిరాశ లోపల
ఆశావహమైన ఊహ లాంటి గాలితెర,
ఎడారిలో నీటిచెలమ లాంటి తడి స్పర్శ,
నిశ్శబ్ద రాత్రి పక్షి రెక్కల చప్పుడు
నిన్ను పిలుస్తాయి
ఇక్కడ మరి కాసేపు ఉండమని బ్రతిమాలతాయి
భయస్తులతో కిటకిటలాడే లోకంలో
ఇంకా అమాయకత్వం మిగిలే ఉందని ఆశ పెడతాయి
చీకటి లోపల వెలిగే గాలితెరలు,
గాలితెరల్లో వెలిగే ఆకుల సవ్వడులు,
సవ్వడులతో ఊపిరిపోసుకునే అమాయక హృదయాలు
ఇంకా లోకంలో ఉన్నాయని, ఉంటాయని
ఎప్పటికీ మిణుకు మిణుకు మనే తారలు
నమ్మకంగా చెబుతుంటాయి
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి