29 సెప్టెంబర్ 2026

కవిత : ఒకటే ప్రపంచంలో..

నువు నీ యవ్వనంలో చూసిన
సూర్యోదయాలే, చంద్రకాంతులే,
నక్షత్రాలకీ, నీకూ నడుమ గాలి ఊయలలే 
ఇవాళ నీ పిల్లలు చూస్తున్నారు

ఇవాళ నువు చూసే వెలుగు, నీడలే 
శబ్దాలూ, నిశ్శబ్దాలే, 
గాలుల్లో తేలే అర్థాలూ, అర్థ రాహిత్యాలే
రేపు నీ పిల్లలు చూస్తారు

ఒకే రోజులో నువు నీ ప్రపంచాన్నీ,
పిల్లలు వాళ్ళ ప్రపంచాలనీ,
వృద్ధులైన తలిదండ్రులు వాళ్ళ ప్రపంచాలనీ దర్శిస్తారు

ఒకే ప్రపంచం ఎవరికి వారికి
ఒక్కొక్క పొరలోంచి ఒక్కోలా తోస్తూ..
నీ చుట్టూ పరుచుకున్న దృశ్యం అలాంటిది
నిను కమ్ముకున్న జీవితం అలాంటిది

ఎవరికి అవసరమైనట్టు వారికి,
ఎవరి విస్తృతి మేరకి వారికి,
ఎవరి స్పందనలకి వీలుగా వారికి

ఇంత లోతైన, సాంద్రమైన ప్రపంచాన్ని
మనసారా హత్తుకునే తీరిక లేకుండా
మన చిన్న ఊహల, ఆలోచనల ప్రపంచాల్లో మనం
సంపన్నుడు మతిభ్రమించి
వీధులలో యాచిస్తున్నట్లు..

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి