30 అక్టోబర్ 2026

కవిత : నీతో నువు..

నీతో నువు ఉన్నపుడైనా
నీకు స్వేచ్ఛ ఇస్తున్నావా
లేక, బానిసలా చూస్తున్నావా

సమాజాన్ని దాటి, 
సమాజం భయాన్నీ, హింసనీ దాటి,
కట్టుబాట్ల గానుగెద్దు బతుకు దాటి,
మర్యాదల బానిసత్వం దాటి,
ఆదర్శాల, నాయకత్వాల భ్రమలు దాటి,
ఎవరేమనుకుంటే ఏమనే చిత్తభ్రమలు దాటి

ఉత్త నేనుగా 
ఖాళీ ఆకాశం లాంటి, గాలి లాంటి
ఖాళీ జ్వాల లాంటి, జలం లాంటి
ఉత్త పేరు లేని, వ్యక్తి లేని 
గత, భవితల మరకలు లేని 
స్వచ్ఛమైన నేనుగా
నిన్ను నువు చూడగలుగుతున్నావా

నీతో నువు ఉన్నప్పడైనా
ఆకాశం ఆకాశంతో నిండినట్లు
గాలి గాలితో, జ్వాల జ్వాలతో, 
నీరు నీటితో నిండినట్లు
నీతో మాత్రమే నువు నిండగలుగుతున్నావా

నిండుగా పొరలి పొంగి
నువు లేకపోవటంలోకి
నీకు స్వేచ్ఛ ఇవ్వగలుగుతున్నావా,
ఏమీ కాకుండా మిగలగలుగుతున్నావా

12.3.26 11.21 రాత్రి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి