24 అక్టోబర్ 2026

కవిత : తెలియని సమయం

ఈ లోకంలో నీకేమి నచ్చలేదు అంటారెవరో

మనుషులు అంటావు, నిన్నూ కలుపుకొంటూనే
వాళ్ళ ప్రేమలు, వాటి వెనుక భయాలు,
వాటి వెనుక చీకటి నిండిన నేనూ, నాది లు 
చీకటిలో తిరుగాడే క్రౌర్యాలు, హీనత్వాలు

నీకేమి నచ్చాయి లోకంలో అంటారు

శబ్దాలు, దృశ్యాలు, స్పర్శలు,  
సమస్త సంవేదనలు అంటావు
వాటి వెనుక ఏమీ ఉండదు
పసిపాప బోసినవ్వులాంటి
తెల్లని ఖాళీ మినహా, వెన్నెల మినహా
కాస్త అమాయకత్వం మినహా,
ఉత్త జీవనానందం మినహా

ఈ లోకంలో నువ్వెవరికి నచ్చలేదు అంటారు
మనుషులకి అంటావు, నిన్నూ కలుపుకొంటూనే
నిన్ను తెలుసుకొనే తీరిక మనుషులకి లేదు,
మనుషుల్ని తెలుసుకొనే ఓపిక నీకు లేదు

ఎవరికి నచ్చావు ఈ లోకంలో అంటారు
రంగులకి, రాగాలకి, పదాలకి
సమస్త సంవేదనల జీవితానుభవానికి అంటావు
అవి నీలో తేలికగా కరిగిపోతాయి,
నువు వాటిలోకి తేలికగా మాయమౌతావు

ఈ లోకం నీకు నచ్చిందా, లేదా అంటారు
జవాబు తెలియటం లేదంటావు
నీ ముందున్నది పగలో, రాత్రో తెలియనట్లు 

మేఘాలపై నారింజ ఛాయలు విరబూస్తున్నాయి
వాటి రంగులు కరగబోయేది 
తెల్లని కాంతి లోనా, నల్లని చీకటిలోనా 
తెలియరావటం లేదు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి