18 అక్టోబర్ 2026

కవిత : నిన్ను క్షమించుకొనేవేళ..

ఏవో రాస్తాం, మాట్లాడతాం
ఊహిస్తాం, కోరుకుంటాం, భయపడతాం

కానీ, టీ తాగి, కప్పు టేబుల్ పై ఉంచాక
తగిలే గాలి తెరలోకో, 
ముఖంపై వాలే పలుచని బంగారుకాంతిలోకో,
గాలిలో వినీ, వినిపించని శబ్దాల్లోకో
మనం దారి తప్పినపుడు
అన్నీ చెదిరిపోతాయి 
లేదా బలహీనపడతాయి, పలచబడతాయి 

గ్రీష్మ మధ్యాహ్నపు కాంతి
సాయంత్రానికి స్నేహితునిలా పలకరించినట్లు
తీవ్రతలు జ్ఞాపకాలుగా రూపాంతరమౌతాయి

జీవితానుభవం ఇలాంటిది
క్షణంలో శిఖరాల అంచున ఉంటావు
ఆకాశంలోకి చూస్తూనో,
లోయలకి భయపడుతూనో 

మరుక్షణం నేల పైన ఉంటావు,
పోయేవీ, పొందాల్సినవీ 
పిల్లల ఆటలు మినహా
మరేమీ కాదన్న స్థిమితంతో

ఆ క్షణం కోసం జీవితం ఎదురుచూస్తూ ఉంటుంది
ఇంటికి చేరిన తండ్రిని హత్తుకోవటానికి
ఎదురుచూసే పసిబిడ్డలా,
తన కౌగిలిలో చేరి
ఇవాళ్టికి నిన్ను
హృదయపూర్వకంగా మరోసారి క్షమిస్తావు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి