31 ఆగస్టు 2025

మాయాతెరల వెనుక అన్వేషణ - బివివి ప్రసాద్ కవిత్వం

"అనంతమైన కొలతలతో అలల్లా ఎగసిపడే సృష్టి ఇది/ దీనిలోకి వెలుతురు పుట్టినట్టు పుట్టి/చీకటి పుట్టినట్టు వెళ్ళిపోతావు/లేదా నీలో ఇది చీకటి పుట్టినట్టు పుట్టి/ వెలుతురు పుట్టినట్టు వెళ్ళిపోతుంది" అంటారు కదా ఈ కవి.. ఇది మొదలు కాదు.. చివరా కాదు. జీవన ప్రయాణంలో ఎదురైన అనుభవాల తాలూకు వాస్తవం.. నిజానికి సృష్టి నిన్నటినీ, నేటినీ కలిపే అనేకానేక కలిపే రేఖలతో పాటు ఒకే ఒక్క విడదీసే రేఖతో కూడా నడుస్తూనే వుంటుంది. అలాంటి రేఖలకు ఎదురైన శిలా మస్తకాల్ని పలకరిస్తూ, మచ్చిక చేసుకుంటూ ఎదురపుతున్న కంటక ముఖాల్ని తొలగిస్తూ కదల్లేక పోతున్న కాలాన్ని కదిలిస్తూ, నడిపిస్తూ పదం పదం ముందుకు పయనం చేసేవాడే కవి. ఏదో తోచక రాస్తున్నారనుకునే మీమాంశతో సమాజం నడుస్తున్నా కవి తన అక్షరాలతో అర్పేది ఆకలి మంటల్నే కాదు. రాలే కన్నీటి చుక్కల్ని కూడా.. నిత్యం మానసిక దౌర్భల్యంతో ఎదురవుతున్న దిబ్బల్ని, దుబ్బల్ని సస్యశ్యామలం చేస్తూ నవ చలనం కలిగించే రీతిలో సాగే మహా ఋషి కవి.

ఆధ్యాత్మికత, తాత్వికత, వాస్తవికత మూడింటిని ఒక తాటిపై ఒడిసి పట్టుకున్న బొల్లిన వీరవెంకట ప్రసాద్ తెలుగు సాహిత్యంలో కవితా ప్రపంచానికి తనదైన ముద్ర వేసుకున్న కవి. 1966 నవంబరు 21న జన్మించిన ఆయన బాల్యం మాతామహులు, మేనమామలు ఉన్న ఉమ్మడి కుటుంబంబో గడిచింది. అనంతరం తల్లిదండ్రుల వద్ద చాగల్లులో ఏడవ తరగతి వరకు, తణుకులో బీకాం రెండవ సంవత్సరం వరకు, చివరి సంవత్సరం కాకినాడలో చదివారు.

సాహిత్యం పట్ల ఆయనకున్న ఆసక్తి చిన్ననాటి నుంచే అవిర్భవించింది. స్కూలు చదివే రోజుల్లో చిత్రకళలో మొదలైన సృజనాత్మకత కళాశాల దశలో కవిత్వంగా రూపాంతరం చెందింది. 1989లో ఆయన తొలి కవితా సంపుటి "ఆరాధన" వెలుపడేలోపు అనేక కవితలు, కథలు, సాహిత్య తత్త్వ చింతనలు రచించారు. ఆరంభంలో వచన కవిత్వం రాసిన ఆయనకు హైకు ప్రక్రియపై ప్రత్యేక ఆకర్షణ పెరిగింది. ఫలితంగా 1995, 1997, 1999లో వరుసగా "దృశ్యాదృశ్యం", "హైకూ", "పూలురాలాయి" పేర్లతో మూడు హైకూ సంపుటాలు వెలువడ్డాయి. ఆయన హైకూలలో ప్రకృతి సౌందర్యం, జీవన సత్యం, అనుభూతి విశ్వం సులభమైన పదాలతో అవిష్కృతమవుతాయి.

వచన కవిత్వంలో ఆయన శైలి అనుభూతి ప్రాధాన్యతను చాటి చెబుతుంది. 2006లో “నేనే ఈ క్షణం”, 2011లో "ఆకాశం", 2015లో "నీలో కొన్నిసార్లు" అనే సంపుటాలు ఆయన కవితా వైశాల్యానికి నిదర్శనం, ఈ కవిత్వంలో కవి మనిషి అంతర్ముఖంలోని నిశ్శబ్దాన్ని, సమాజంపై ఉన్న అవగాహనను సున్నితంగా వ్యక్తం చేస్తారు. 2022లో "ఊరికే జీవితమై" అనే వచన కవితా సంపుటి కూడా ఈ ప్రయాణానికి చిహ్నం. అదనంగా హైకూలు, హైకుపై వ్యాసాలను కలుపుకొని "బివివి ప్రసాద్ హైకూలు" అనే పుస్తకాన్ని కూడా ఆయన అందించారు. వీరి కవితల్లో సహజత్వం, వాస్తకవిత్వం ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. ఉదాహరణకు "అమాయకం" అనే కవితలో కవి అమాయకత్వాన్ని ఒక శక్తిగా, జీవన విలువల మూలంగా చూపిస్తారు. లోకం అమాయకుడిని హేళన చేసినా, గెలుపు కోసం పరిగెత్తినవారు ఎవరూ తృప్తిగా జీవించలేదని, ఒంటరితనంలోనూ సంపూర్ణత ఉందని కవిగా తమ దోరణిని వ్యక్తీకరిస్తారు. ఈ దృక్పథం వీరి కవిత్వానికి ప్రత్యేకతను అందిస్తుంది.

ప్రకృతిలోని ప్రతి చిన్న చలనం ఆయన కవిత్వంలో ఒక సంకేతంలా కనిపిస్తుంది. గాలి వీచటం, చెట్లు చిగురించడం, వానజల్లులు రావడం అన్నీ కవి దృష్టిలో జీవన సౌందర్యానికి ప్రతీకలు. "మనం ఒకరి లోపలికి ఒకరం మరీ ఎక్కువ చొరబడుతున్నామేమో" అనే ఆయన భావన, ఆధునిక జీవితంలోని హడావిడిలో మనిషి కోల్పోతున్న స్వాతంత్ర్యాన్ని గుర్తు చేస్తుంది. ఆయన కవిత్వం కేవలం భావాల వ్యక్తీకరణ కాదు, అది జీవితాన్ని అనుభవించమనే పిలుపు. భావోద్వేగాలకు, ప్రకృతికి, సంబంధాల సౌకుమార్యానికి ఆయన కవిత్వం అద్దం పట్టింది. అందుకే ప్రసాద్ గారి కవిత్వం నేటికీ పాఠకుడి మనసును మృదువుగా తాకుతూ, అలోచనల్లో కొత్త వెలుగులు నింపుతుంది.

బివివి ప్రసాద్ కవిత్వం సరళమైన భాషలో గాఢమైన అర్థాలను మోసుకువస్తుంది. హైకూలలో సంక్షిప్తత, వచన కవిత్వంలో విస్తృతి కలగలిపిన అయన సాహిత్యసృష్టి తెలుగు కవితా సంప్రదాయానికి ఒక విలువైన వనరుగా నిలిచింది. హైకూ ప్రక్రియలో అనవసర పదాల్లేకుండా, మూడు పాదాల్లోనే ఒక విశ్వాన్ని సృష్టించే సామర్థ్యం ఆయనలో ఉంది. హైకూలలో ప్రకృతి దృశ్యాలు కేవలం వర్ణనకే పరిమితం కాకుండా, జీవన సత్యాలను ప్రతిబింబించే సాధనాలుగా నిలుస్తాయి. "పూలురాలాయి" వంటి హైకూ సంపుటాల్లో కవి ఉపయోగించిన దృశ్యాలు పాఠకుడికి ఒక క్షణానుభూతిని కలిగిస్తాయి.

బివివి ప్రసాద్ కవిత్వ శైలిని విశ్లేషిస్తే, ఆయన రచనల్లో స్పష్టంగా కనబడే కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఆయన కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మొదటగా, ఆయన శైలిలో సహజత్వం ప్రధానంగా ఉంటుంది. బలవంతపు అలంకారాలు, గజిబిజి ప్రయోగాలు ఆయన రాతల్లో కనిపించవు. కవి అనుభవాన్ని ఏకకాలంలో సులభమైన భాషలో, కానీ లోతైన భావాలతో వ్యక్తం చేస్తాడు. ఉదాహరణకు, ప్రకృతిలోని చిన్న సంఘటనలు గాలి. వీయటం, చెట్లు చిగురించటం, వాన చినుకులు పడటం అన్నీ వీరి కవిత్వంలో జీవితానికి ప్రతీకలుగా మారుతాయి. ప్రకృతిని కేవలం వర్ణించడమే కాదు, జీవన తత్త్వాన్ని అందులో కనుగొని పాఠకుడికి అందజేస్తాడు. మరొక్క విషయం వీరి కవితా శైలిలో అనుభూతి ప్రధాన స్థానం కలిగి ఉంటుంది. కవిత్వం కేవలం భావుకతతో కాకుండా, లోతైన మానసిక అన్వేషణతో నిండి ఉంటుంది. ఉదాహరణకు, "మనం ఒకరి లోపలికి ఒకరం మరీ ఎక్కువ చొరబడుతున్నామేమో" అనే వాక్యం, అధునిక మనిషి సంబంధాలపై లోతైన అవగాహనను తెలియజేస్తుంది. ఈ భావనల్లో కవి ఒంటరితనం, మనుషుల మధ్య దూరం, అంతర్మధనం వంటి అంశాలను సున్నితంగా వ్యక్తం చేస్తారు.

వీరి వచన కవిత్వంలో విస్తృతమైన భావప్రవాహం ఉంటుంది. వచనకవిత్వంలో సంప్రదాయ లయ లేదు కానీ, ఆయన రాతల్లో అంతరంగ లయను సృష్టించే పద ప్రయోగం కనిపిస్తుంది. ఈ లయ పాఠకుడికి చదివేటప్పుడు ఒక మృదువైన నాదాన్ని అందిస్తుంది. కవితలోని అత్మీయత, వ్యక్తిగత అనుభవాల సౌకుమార్యం పాఠకుడిని కవితో మమేకం చేస్తాయి. వీరి శైలి తాత్వికతతో కూడి ఉంటుంది. "స్వర్గం వేరే లేదనీ, సంతోషం ముందు కాలంలో దాగి లేదనీ, ఉన్నాం మనం ఒకరి కొకరమని" అనే వాక్యాలు ఆయన తాత్విక దృష్టిని స్పష్టంగా తెలియజేస్తాయి. జీవితం అంటే వర్తమానాన్ని అస్వాదించడం, ప్రస్తుత క్షణంలోనే సంపూర్ణత ఉందని కవి నమ్మకం వ్యక్తం చేస్తారు. వీరు తమ శైలి సంప్రదాయానికి గౌరవం ఇవ్వడంతో పాటు ఆధునికతను కూడా అక్కున చేర్చుకున్నారు.. వీరి భావమేదయినా పాఠకుడిని మృదువుగా తాకుతూ, జీవితాన్ని కొత్తకోణంలో చూడమని అహ్వానిస్తుంది. సరళమైన పదాల్లో గాఢమైన అనుభూతి వ్యక్తం చేయడం ఆయన శైలికి మూలసారం. ఉదాహరణకు...

"నిష్కపట స్వప్నం" కవితను పరిశీలిస్తే, ఇందులోని భావనలతో పాటు కవి శైలిని గమనించడం ఆసక్తికరం.

ఈ కవితలో ప్రధానాంశం నిష్కపటత. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ వంటి విలువలను కవి జీవితంలో ఉన్న అత్యున్నత అనుభూతులుగా చూపించాడు. "ఎవరైనా ఇద్దరు మనుషులు నిష్కపటంగా ప్రేమించుకోవటం చూస్తే కనులు చెమ్మగిలుతాయి" అనే పాదంలో కవి మానవ సంబంధాల సౌందర్యాన్ని సున్నితంగా వ్యక్తం చేశాడు. ప్రేమను కేవలం వ్యక్తిగత అనుభవం కాకుండా, సామాజిక విలువగా ప్రతిపాదించారు.

వీరి కవితలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ప్రవాహం ఉంది. ప్రతి పద్యంలో మొదట ఒక దృశ్యం ప్రేమ, జీవనానందం, దయ చూపించి, తరువాత దాని ఫలితంగా కలిగే అంతరంగ మార్పుని వ్యక్తం చేశాడు. ఉదాహరణకు, "ఒక జీవి నిష్కపటంగా జీవనానందంలో మునిగితే హృదయం సారవంతమౌతుంది" అనే వాక్యం పాఠకుడికి ఒక నిశ్శబ్దమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది. భాషలో సరళత ఉన్నప్పటికీ, భావంలో లోతు ఉంది. కవి కట్టుబాట్లకు, భయాలకు అతీతమైన ఆత్మీయ క్షణాన్ని సృష్టిస్తాడు:

"ఉన్నట్లుండి పనులు పక్కన పెట్టేస్తావు, భయాలు మరిచిపోతావు, / కట్టుబాట్లు గాలికి వదిలేస్తావు"
 "ఎందుకు బతికావని/ ఎవరూ అడగకూడదనుకొన్నట్టే/ఎందుకు వెళ్ళిపోయావని కూడా ఎవరూ అడగకూడదనిపిస్తే/జీవితానికి పరమ గౌరవంతో నమస్కరిస్తావు// బహుశా అప్పుడు జీవితం కూడా నిన్ను మహా ప్రేమతో హత్తుకుంటుంది" 
ఈ పాదాల్లో ఒక తాత్విక స్వేచ్ఛా భావం వ్యక్తమవుతుంది. ఇది బివివి ప్రసాద్ కవిత్వానికి ప్రత్యేకత.

ఈ కవి ఒక సామాజిక-తాత్విక దృక్పథాన్ని చేర్చడం మనం గమనించవచ్చు. ఆ క్షణాలు భవిష్యత్ తరాల మనుషుల్లో కూడా మిగులుతాయని చెప్పడం ద్వారా ప్రేమ అనేది కేవలం వ్యక్తిగత అనుభవం కాదు, అది మానవ జాతి పరంపరలో కొనసాగుతున్న ఒక సాంస్కృతిక శక్తి అని స్పష్టం చేయడం కూడా మనం గమనించవచ్చు. శైలి ప్రయోగంలో సరళమైన వచనంలా కాకుండా వుంచడానికి ప్రయత్నిస్తారు. కృత్రిమ అలంకారాలు లేకుండా, సున్నితమైన అనుభూతుల్ని జతచేస్తూ వ్యక్తిగత అనుభవం నుంచి విశ్వానుభూతి వరకు తామెరిగిన దృశ్యాల ద్వారా భావవ్యక్తీకరణ చేస్తూ ప్రేమ,
దయ, జీవనానందం వంటి అరుదైన భావాలను దృశ్య రూపంలో చూపించడం ఒక ప్రత్యేకతే. దానితో పాటు తాత్విక స్పర్శ వర్తమానంలో మునిగి, సత్యాన్వేషణ చేయమనే పిలుపును వినిపించడం విశేషం. ఉదాహరణకు "నట్టనడిమి" కవితలో బివివి ప్రసాద్ గారి శైలిని, భావాన్ని విశ్లేషిస్తే అనేక సున్నితమైన లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఈ కవితలో ప్రధానంగా ధ్యానంలో ఒక క్షణికమైన మెలకువ, అంతరంగపు నిశ్శబ్ద అనుభూతి ప్రధాన పాత్రల్ని పోషిస్తాయి. ఈ కవి మొదటి పద్యంలోనే ఒక ప్రతీకాత్మక దృశ్యాన్ని సృష్టించారు గమనించండి.

"తుదిమొదలు తెలియని శూన్యంలో/ తెగిన గాలిపటంలా ఊగుతున్న జీవితమిది" ఇది కవితలోని పరివర్తన భావాన్ని బలంగా తెలియజేస్తుంది. కఠినత నుండి సున్నితత్వానికి, ఆందోళన నుండి విశ్రాంతికి మధ్య వుంచే మార్పును కవి ఒక శబ్దంతో, ఒక అనుభూతితో కలిపి చూపించారు. ఈ రూపకం కవి శైలిలోని అధ్యాత్మికతకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ.

 "మెలకువొకటి" అనే కవితలోని దృశ్యాల్ని సందర్శించాల్సి వస్తే "పూలపై వాలిన బంగారు కిరణం", "ఎగిరే పక్షి రెక్కల నుండి లీలగా తాకిన గాలి", "హోరు తరువాత వికసించే నిశ్శబ్దం" ఇవన్నీ కేవలం వర్ణనలు కాకుండా మనసుకు శాంతి ఇచ్చే ప్రతీకలుగా మిగిలిపోతాయి. వాటిని అనుసరిస్తూ ఒకే దిశగా కవితను ముందుకు నడిపిస్తాయి అందోళనల నుండి విముక్తి, ఒక తాత్కాలిక స్వేచ్చ, 

"భారమవుతున్న జీవితాన్ని తలుచుకొని ఏమీ లేదులే అంటావు శాంతంగా" అనే పాదం కవితలోని తాత్విక మెలకువను వ్యక్తం చేస్తుంది. ఇది జీవితభారాన్ని గుర్తించడం, కానీ దానికి లొంగిపోకుండా క్షణాన్ని అస్వాదించడం అనే భావన. కవి ఇక్కడ భయాలను అధిగమించే అంతరంగిక శాంతిని ప్రతిపాదించాడు.

తదుపరి పాదాల్లో కవి తన కవిత్వ స్వభావాన్నే ప్రతిబింబించాడు: "మరి కొంచెం సమయం అక్కడే ఉండమని పసిపిల్లల్లా అదుగుతాయి ఈ అక్షరాలు" ఇది కవిత్వం పాఠకుని దగ్గరికి రావడాన్ని, ఆ అనుభూతిలో మరికొంత సమయం గడపమని చేసే వేడుకోలు. కవి ఇక్కడ కవిత్వాన్ని ఒక ప్రాణమున్న జీవిగా ప్రతీకాత్మకంగా చూపించాడు.

కవిత యొక్క హృదయాన్ని అవిష్కరించడదలిస్తే "కానీ, ప్రేమ ఉంది చూసావా ఆ సున్నితమైన శబ్దం గుర్తుకు తెచ్చినది" కవిత ఒక తాత్విక వాక్యంతో ముగుస్తుంది చీకటా, వెలుతురా అనేది సందేహంగా ఉన్నా, ప్రేమ మాత్రం ఉందని కవి దృవీకరిస్తారు. చివరి పాదాలు "మబ్బుల వెనుకకి మాయమయే ముందు విశాలమైన గగనంలో ఒంటరిగా సంచరించే చందమామ" కవితను ఒక సజీవమైన, దృశ్యాత్మక ముగింపుకు తీసుకువెళ్తాయి.

పచ్చగడ్డి కోసం వచ్చిన లేళ్ళు ఇనుప కంచె తీగల్లో తలదూరుస్తాయి లేదా కాలు చాస్తాయి. తిన్నది తక్కువైనా పాపం నెత్తుటి కాళ్లతో బయటపడతాయి. నక్కిన నక్కల్ని, పొంచివున్న పులుల్ని ఈ మాటుకో తరిమేస్తూ నేటిని రేపు అనే అశతో కదిలించే దిశగా వీరి కవితల్లోని శైలి లక్షణాలు సున్నితమైన భాష, సులభమైన వచన నిర్మాణం, ప్రతీకాత్మక దృశ్యాలు పూలు, కిరణం, పక్షి, చందమామ తాత్విక మెలకువ జీవితం కంటే విలువైనది అనుభూతి, ప్రేమ అంతర్ముఖ దృష్టి, భయాల నుంచి బయటకు తీసుకువచ్చే అంతరంగ శాంతి కవిత్వ స్వరూపంపై అవగాహన అక్షరాలను పసిపిల్లలుగా పోల్చడం.

ఇది బివివి ప్రసాద్ శైలిలోని ప్రత్యేకత భావం, దృశ్యం, తత్త్వం కలిసిన సరళమైన కవిత్వం. బివివి ప్రసాద్ కవిత్వం సహజత్వంతో, మానవీయతతో నిండి ఉంటుంది. ఆయన పదాలు అలంకారభరితం కావు, కాని అనుభూతి లోతైనది. ప్రతి కవితలో ఒక తాత్విక మెలకువ, జీవితాన్ని కొత్త కోణంలో చూడమనే ఆహ్వానం ఉంటుంది. నిష్కపట ప్రేమ, దయ, కృతజ్ఞత వంటి విలువలను కవి అత్యున్నత సత్యాలుగా ప్రతిపాదిస్తాడు. ప్రకృతిని ఆయన కవిత్వంలో కేవలం దృశ్యరూపంగా కాకుండా, అంతరంగ శాంతికి ప్రతీకగా ఉపయోగిస్తాడు. చిన్న క్షణాల్లో పెద్ద అర్థాలను సృష్టించడం ఆయన శైలికి ప్రత్యేకత. హైకూలలో సంక్షిప్తత, వచన కవిత్వంలో భావ విస్తృతి కవిత్వానికి ద్వంద అందాన్ని తెస్తాయి. అందోళనలతో నిండిన ప్రపంచంలో ఆయన కవిత్వం పాఠకుడికి శాంతి, స్వేచ్ఛ, ప్రేమ అనే మార్గాలను చూపుతుంది. బివివి ప్రసాద్ కవిత్వం మనసుకు మృదువైన స్పర్శ, జీవితానికి అంతరంగ వెలుగులా నిలుస్తుంది. ఎంతో భావాలున్నాయి ఇంకా వర్ణించడానికి.. ఎన్నో వ్యక్తీకరణలున్నాయి.. వివరించడానికి.. కవి అంతరంగాన్ని కొలవడానికి కామాలుండవు. చుక్కలుండవు. అయినా గెలుపు కవిదే.. ఒక కవిని విశ్లేషించాలనుకున్న నా ధైర్యానిదే.. ప్రణామాలు..!

శైలజామిత్ర

ప్రచురణ : సృజనక్రాంతి 31.8.25
శైలజామిత్రగారికి అనేక ధన్యవాదాలు,
మిత్రులు పెరుగు రామకృష్ణ గారికి నమస్సులు 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి