నడివేసవి మధ్యాహ్నపు టెండలా
వికసించింది మరొక పగలు
ఇపుడు దీని నిండా అనేకం నింపటానికి చోటుంది
పక్షుల పాటల్నీ, గాలికి తలలూపే పూలనీ,
పట్టించుకోక, ఎటో ఎగురుతూ పోయే సీతాకోకనీ,
దారి వెంట మనుషుల తొందరలనీ,
వీలైనట్లు నీడల్ని ఒంపే చెట్లనీ, మబ్బుల్నీ, భవనాల్నీ
మనుషుల్లో గలగలమని కొండవాగుల్లా పారే
ఆలోచనలనీ, ఊహలనీ, ఉద్వేగాలనీ,
పసిబిడ్డల కళ్లలో కాంతులీనే రేపటి లోకాలనీ,
వృద్ధుల ముఖాల్లో తెరలుగా వెలిగే జీవించిన జ్ఞాపకాలనీ
అన్నిటినీ నింపవచ్చును
ఇవాళ విచ్చుకొన్న ఈ పగలు
దారిపొడవునా అన్నిటినీ నింపుకొని,
జనంతో కిటకిటలాడే రైలులా
తనలో తాను కూతవేసుకుంటూ,
సాయంత్రపు రంగులు చిమ్ముతూ
రాత్రిలోకి వెళ్ళిపోవచ్చును
నిండైన పగటిని కౌగలించుకొని, రాత్రి,
మేం కలిసివచ్చాం, తలుపులు తెరవమని
సాంద్రమైన ఖాళీని బ్రతిమాలుకొని,
సుషుప్తిలో కరిగిపోవచ్చును
మరలా తెలవారుతుంది
మరొకసారి పగటి పుష్పం వికసిస్తుంది
నిజానికి, అనేక పగళ్ళు, అనేక రాత్రులు
అనుకుంటాం కానీ,
ఉన్నది ఒకటే పగలు, ఒకటే రాత్రి కావచ్చును
అదే పగటిని అనేక విధాల దర్శిస్తూ,
అదే రాత్రిని అనేక విధాల నిద్రిస్తూ
మనం కదలని, మెదలని కొండలా ఉండి ఉండవచ్చును
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి