08 నవంబర్ 2026

కవిత : అలవాటు పడి..

అలవాటు పడిపోయి
మనకేమీ తెలియటం లేదు కానీ,
పగలు రావటం, కాంతి విప్పారటం
కాంతిలో సకలమూ ఈదులాడటం అద్భుతం,
రాత్రి రావటం, చీకటి వికసించటం
చీకటిలో సమస్తమూ మునిగిపోవడం అద్భుతం

అలవాటు పడిపోయాము గానీ
మెలకువ వెలుతురు రెక్కలు మనని తాకటం, 
మనం ఊహల్లోకో, పనుల్లోకో 
రెక్కలు విప్పుకొని ఎగిరిపోవటం,
నిద్ర వెలుతురు రెక్కలు మనని తాకటం
మనం శూన్యంలోకో, కలల్లోకో 
రెక్కలు ముడుచుకొని ఒదిగిపోవటం అద్భుతం

అలవాటయిపోయాయి కానీ
మనం శబ్దాలు చేయటం, 
వాటిలో అర్థాలనేవి ప్రయాణించటం,
మనం మౌనంగా ఉండటం,
దానిలో ఉద్వేగాలనేవి ప్రవహించటం అద్భుతం

పుట్టడం, చనిపోవటం బహుశా
అలవాటయిపోయి ఉండవచ్చు గానీ
పూవులానో, ఇంద్రధనువులానో 
వాన చినుకంతగా ఇక్కడ రాలి పడటం,
ఖాళీ గాలి లానో, గగనంలానో 
అంతలోనే శూన్యమై పోవటం అద్భుతం

అలవాటనే మహామాయ
ఇన్ని అద్భుతాలకి మూలమైన మనని
పెనుకెరటమై ముంచి వేస్తుంది
తెప్పరిల్లేసరికి 
మన కళ్ళలో అద్భుతాలు ఆవిరైపోయి
మామూలుతనం ఎడారిలా విస్తరిస్తుంది

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి