10 నవంబర్ 2026

కవిత : వీధిదీపాల కాంతి

నిజంగా, ఇది విలువైనది, పిచ్చితండ్రీ 

ఇందాక దుకాణం మూస్తున్నపుడు
మూసుకున్న షట్టరుపై,
మూస్తున్న నీ మనుషులపై
వీధిదీపాల కాంతి పడుతూ
ఇవాల్టికి మనందరికీ 
ఒకరినుండి ఒకరికి సెలవా అంటున్నప్పుడు
కాంతిలోంచి ఆ పదాలు పలికినది జీవితం,
కాంతినీ, పదాలనీ అనుభవించింది నువు

నువూ, జీవితమూ వేరువేరా, ఒకటేనా అని
నీకు సందేహం కలుగుతుంది
తల్లీ, బిడ్డా వేరు, వేరా ఒకటేనా అన్నట్లు

చీకటి పడ్డాక షట్టర్ మూస్తున్నపుడు,
దానిపై, మూస్తున్నవారిపై, నీపై
ఒకే మసక ట్యూబ్ లైట్ కాంతి ప్రసరించినట్టు
ఒకే జీవితం ప్రసరిస్తూ ఉంది

ట్యూబ్ లైట్ కాంతి అడుగుతూ ఉంది
నా కాంతికీ, జీవితానుభవానికీ భేదమేమిటి అని
ఒకే చీకటి నుండి, 
చీకటిని వెలిగించిన కాంతి నుండి
మేం మొదలయ్యాం కదా అని..

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి