06 నవంబర్ 2026

కవిత : నువూ, పిల్లలూ

ఉదయాన పక్షులు 
వాటి శబ్దాలతో సహా వచ్చినట్లు
పిల్లలు వస్తారు నీ జీవితంలోకి

వాళ్ళు నవ్వటం చూసి
మళ్ళీ నవ్వటం నేర్చుకుంటావు
వాళ్ళు ఏడవటం చూసి
మళ్ళీ ఏడవటం కూడా..

నీలోంచి వాళ్ళు 
వాళ్ళ జీవితం ఏరుకొన్నట్లు,
వాళ్ళలోంచి నువు
నీ జీవితం ఏరుకుంటావు

వాళ్ళు ఎగురుతూ, ఎదుగుతారు
వాళ్ళతో ఎగురుతూ, పండుతావు 

సాయం సమయాన పక్షులు
వాటి శబ్దాలతో సహా వెళ్ళినట్లు 
పిల్లలు వెళతారు నీ జీవితంలోంచి

వాళ్ళు నవ్వుతారని నమ్మి, నవ్వుతావు
వాళ్ళు ఏడుస్తారనిపిస్తే, ఏడుపొస్తుంది 

పిల్లలకి నువు చాలా ఇచ్చావు,
నిన్ను కూడా ఇచ్చుకున్నావు
అలా చేసావని అనుకోవు

పిల్లలు నీకు ఒకటే ఇచ్చారు
నిన్ను నువు కోల్పోయి 
మరొకరిలా జీవించే అనుభవం
అలా చేశామని వాళ్ళకి తెలీదు

నీ కాంతులన్నీ వాళ్ళకి అప్పగించి 
నిశ్శబ్దంలోకి వెళిపోతావు చూసావా,
అప్పుడు దైవం అంటారు

నువు పిల్లలని ప్రేమించినట్లే
నేనూ నిన్ను ప్రేమించాను
ఎంతగా ప్రేమించానో 
నాకూ తెలియలేదు, నీకూ తెలియలేదు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి