09 నవంబర్ 2026

కవిత : భాష గురించి

భాష ఎపుడు చనిపోతుంది
మనం అబద్ధాలు చెప్పినపుడూ,
మాటలతో గాయపరిచినపుడూ,
మొక్కుబడిగా పదాలని పలికినపుడూ,
మాట్లాడవలసీ మౌనంగా ఉన్నపుడూ 
భాష కొంచెం, కొంచెంగా ప్రాణహీనమౌతుంది

భాష ఎపుడు శక్తివంతమౌతుంది
మనం నిజం పలికినపుడూ,
మాటలతో ఊరట కలిగించినపుడూ,
హృదయం నుండి పదాలని విడుదల చేసినపుడూ,
మాటల కన్నా మౌనంతో భాషించినపుడూ 
భాష కొంచెం, కొంచెంగా జీవం నింపుకొంటుంది

భాష, కొన్ని గీతలు సూచించే లిపి కాదు,
కొన్ని శబ్దాలు పూరించే అర్థాలు కాదు,
భాష, సరాసరి సూర్యకిరణాల జారిన
జీవనానందపు అభివ్యక్తి
పదాల నడుమ సెలయేటిలా 
ఒంపులు తిరిగే నిశ్శబ్దం, సరాసరి జీవితం

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి