ఎవరైనా వస్తారా
కలిసి ప్రయాణిద్దాం ఒకే వెన్నెల బింబంలోకి,
ఒకే వెన్నెల నవ్వులోకి,
ఒకే వెన్నెల వంటి ప్రేమలోకి
వస్తారా ఎవరైనా
కలిసి వెళదాం ఒకే కరుణ నిండిన
కన్నీటి బిందువులోకి,
ఒకే కాంతి నిండిన మెత్తని భవితలోకి
ఈ క్షణాన వస్తారా
ఏమీ అక్కర్లేని స్వేచ్ఛలోకి,
ఎవరూ అక్కర్లేని నిండైన ఏకాంతంలోకి
ఊరికే ప్రక్కప్రక్కన కూర్చుందాం,
కళ్ళలోని కాంతులు పంచుకుందాం,
ఊరికే నవ్వుల్ని పావురాల్లా ఎగరేద్దాం,
క్షణాల్ని గింజల్లా పక్షులకో, చేపలకో పంచిపెడదాం
అర్థంలేనితనంలోకి పసిపిల్లల్లా పరుగులు తీద్దాం
ఊరికే మనని మనం కోల్పోయి
మనం లేని స్వర్గానికి తరలిపోదాం
ఎవరైనా వస్తున్నారా
ఏమీ లేని చోటుకి కలిసివెళ్ళటానికి
బివివి ప్రసాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి