21 అక్టోబర్ 2025

కవిత : వేసవిరాత్రి వాన

వీధిలో నడుస్తూ అమ్మ
భుజంపై నిద్రపోయే నిన్ను పొదివి పట్టుకున్నట్లు 
వేసవిరాత్రి ఉన్నట్లుండి వాన కురుస్తుంది

వాన నీటిని మాత్రమే ఒంపదు 
నీటితో నిండిన గాలినీ, గాలితో నిండిన శబ్దాలనీ,
వాటి వెనక దాగిన ఆకాశాన్నీ, నిశ్శబ్దాన్ని కూడా

వాన కురిసినపుడు కరుణ కురిసినట్లుంటుంది
జీవితమ్మీద లాలస కురిసినట్లు,
జీవితేచ్ఛ విత్తనమ్మీద అగాథ నిశ్శబ్దమేదో కురిసినట్లు

వాన కురిసిన రాత్రి ఒంటరిగా మిగులుతావు,
చుట్టూ ఖాళీ స్థలం ఒంటరిగా మిగులుతుంది,
ఖాళీలో కలలు ఒంటరిగా మిగులుతాయి
వాన అంటుంది
ఈ క్షణం బ్రతుకు, ఇంతకన్నా ఏమీలేదు

వాన రాలే వేళల నీకేమీ పని వుండదు 
వానని ప్రేమించటం మినహా,
వానలో ఎంతకీ తడవని చీకటినీ, 
చీకటిలో ఎంతకీ మునగని జీవితాన్నీ
మోహించటం మినహా

లోపలికంటా కురిసే ఒక వాన చాలు
మానవ హృదయాలలోని
ఇంత చీకటి చెరిపేయడానికి

బివివి ప్రసాద్

1 కామెంట్‌:

  1. పాఠకుడిని ధ్యానం లోకి జారిపోయేలా చేసే మహత్తర శక్తి స్వచ్ఛమైన మీ అక్షరాలకుంది. 🙏🌹

    రిప్లయితొలగించండి