30 అక్టోబర్ 2025

కవిత : కాస్త అమాయకత్వం

కాస్తంత అమాయకత్వం కోసం తడుముకుంటావు
ముసురు రోజుల్లో ఎండ కోసం వెదికినట్లు,
చలిరాత్రి నెగడు కోసమూ,
వేసవి సాయంత్రం గాలితెర కోసమూ తడిమినట్లు

పసిపిల్లల నవ్వులాంటి నవ్వు కోసం,
పిల్లల కళ్ళలోని ఆశ్చర్యం కోసం,
వారి మాటల్లోని తేటదనం కోసం,
వారిలో తొణికిసలాడే జీవనానందం కోసం

నీ సాటి ప్రపంచంలోకి,
పెరిగి, పెద్దదై, వడిలిపోతున్న ప్రపంచపు
ముఖాలలోకి తేరిపార చూస్తావు

జీవితం చీకటిగుహలో దారి తెలియక
తిరుగుతున్న, కూలబడిన ముఖాల్లోకి,
సూర్యుని కోసం కాంతి వాలినచోట గాక,
సూర్యుని వైపు చూడాలని తెలియని కళ్ళలోకి,
అమాయకత్వాన్ని 
అమాయకంగా వదులుకున్న హృదయాల్లోకి

బరువైన జీవితం, నీరు నింపుకొనే కడవలా బరువెక్కే,
ఉదయాన కనులు తెరిచే దుఃఖంలా నిరాశ క్రమ్మే,
ఏకాంతపుసుడిలోకి జారే నిస్పృహ నిండిన జీవితం 
నీ చుట్టూ ముసిరినవేళ కూడా
కాస్త అమాయకత్వం కోసం వెదుకుతుంటావు

నీ కెక్కడో నమ్మకం, కాస్త అమాయకత్వం చాలు
ఇంత దుఃఖం నుండి ప్రపంచాన్ని బయటపడేస్తుందని,
చీకటి గుహలోకి దూరపు కిరణంలా దారి చూపిస్తుందని

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి