29 సెప్టెంబర్ 2025

కవిత : అపురూపం

 కొన్ని క్షణాలు నవ్వుతావు చూసావా,
ఆ క్షణాల కోసమే బ్రతికుంటావు
అనేకసార్లు మృత్యువును దాటి

ఇంత విశ్వం నిన్ను కలగని ఎదురుచూసింది
ఆ నవ్వు కోసమే కావచ్చు,
ఉదయాలు బంగారాన్ని వెదజల్లింది
నీ ప్రశాంతమైన చూపు కోసమే కావచ్చు,
పూలు పలురంగుల్లో దోబూచి ఆడింది
నీ కళ్ళలోని ఆశ్చర్యం కోసమే కావచ్చు

జీవుల కళ్ళలోని జాలిపుట్టించే అమాయకత్వమూ,
మనుషుల్లోంచి వ్యక్తమయే, నిశ్శబ్దరాత్రి ఎగిరే 
పక్షిరెక్కల చప్పుడులాంటి మెత్తని ప్రేమా,
ఒక కవి నీ లోపల కూర్చున్నట్టు పలికే మాటలూ, 
ఏ స్వాప్నికుడో పలికించే వాయిద్యపు ధ్వనులూ 
నువ్వు ఉండటం కోసం ఎదురుచూసినవే కావచ్చు

రోజుల కేమి 
శిశిరపత్రాల కన్నా వేగంగా రాలిపోతాయి,
మాటల కేముంది 
నీటిబుడగల కన్నా వేగంగా చిట్లిపోతాయి,
అనుభవాల కేముంది
ఇదే కదా కోరుకున్నది అనేలోగా వెలిసిపోతాయి

కన్నా, ఈ నిమిషాన బ్రతికున్నావు చూడు,
ఇది కాలాల కావలి నుండి, గోళాల కావలి నుండి
తెలియని ఎవరో గాఢంగా కోరుకున్న కల

ఈ ఉదయం గడ్డిపరకపై వాలిన 
మంచుబిందువుని చూసావా, 
దానిలో ఆడుకుంటున్న రంగుల్నీ..
ఆ తెలియనివానికి ఆ బిందువుపై, 
ఆ బిందువువంటి నీపై ఎంత ప్రేమ

బివివి ప్రసాద్

28 సెప్టెంబర్ 2025

కవిత : కలలు

ఒక ఉదయం లేచేసరికి
పూవుగా మారిపోయి వుంటావు,
నీ రెక్కలపై మంచుబిందువులు
రంగుల కలలు కంటూ వుంటాయి

మంచుబిందువులకి
ప్రాణం ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోతావు,
వాటి కలలకి ప్రాణం ఉంటుందా అని
కనుగొనబోతూ వుండగానే
అవి పలుచని గాలిలోకి మాయమౌతాయి 

పలుచని గాలితెరలు 
సుతారంగా చిరునవ్వు నవ్వటం వినిపిస్తుంది,
నిజంగా విన్నానా అని చూడబోతే
తలలు తిప్పి ఏమీ జరగనట్లు సాగిపోతాయి

సూర్యకాంతి నీ ఆశ్చర్యంతో 
కనులు కలిపి చూస్తుంది
కేరింతలు కొడుతూ తలవూపుతావా,
పక్షి రెక్కల చప్పుడు కాంతిని ఎగరేసుకుపోతుంది

మనకి ఎగిరే వీలుందా అని
ఇటు తిరిగి తల్లిని అడుగుతావు;
మనకా అవసరం లేదంటుంది
భూసారంలోకి తనని అల్లుకున్న మొక్క

అతనికేం అవసరమై ఇటు వస్తున్నాడు
అంటూ వుండగానే, 
అతని చేయి నిన్ను సమీపిస్తుంది 
కల లోంచి ఉలికిపడి లేస్తావు

బివివి ప్రసాద్

27 సెప్టెంబర్ 2025

కవిత : కొన్నిసార్లు..

కొన్నిసార్లు రాయాలనిపించదు,
ఊరికే బ్రతకాలనిపిస్తుంది 
అపుడు గాలిలో కాక, గాలిలా ఉంటావు 
చీకటిలో కాక, చీకటిలా,
దీపకాంతిలో కాక, దీపకాంతిలా

జీవితంలో కాక, జీవితంలా ఉండేవేళల
నీటిలా పలుచగా, 
గాలిలా తేలికగా, కాంతిలా వికసిస్తూ

ఊహించని శబ్దమై చిట్లిన నిశ్శబ్దం
ఇదంతా నిజమని చెవిలో చెబుతుంది,
శబ్దంలోంచి వికసించే నిశ్శబ్దం
ఇదంతా కల అని కంటిముందు చూపిస్తుంది

కొన్నిసార్లు ప్రపంచాన్ని అనుభవించాలనిపించదు,
ఊరికే ఉండాలనిపిస్తుంది,
వట్టినే నిద్రలోకి జారిపోవాలనిపిస్తుంది

అప్పటివరకూ పరిపరి విధాల పలకరించిన ప్రపంచం
వానలో తడిసే చిత్రపటంలా కరిగిపోతుంది,
అదృశ్య చిత్రకారుడెవరో నిర్వికారంగా, శాంతిగా 
నిన్ను నిన్నులా చూస్తున్నట్లుంటుంది

బివివి ప్రసాద్

26 సెప్టెంబర్ 2025

కవిత : అహం..

ఎంత సంతోషం
క్షణం విడవలేని ఒకరు నీకుండటం,
ఎంత దుఃఖం ఆ ఒకరు నీకు,
ఎవరు సంతోషమో, వారు దుఃఖం
ఎవరు భద్రతో, వారు భయం

ఇలా వుంటుంది ఇక్కడంతా,
తోటి చిన్నారులు ఆడుకుందాం రమ్మన్నట్టు,
వాళ్ళతో ఆడితే కాలం మాయమవుతుంది,
వాళ్ళు లేకుంటే కాలం భారమౌతుంది

కాలం వలలో పడినట్లు తెలియని చేపపిల్లవి,
గాలి అందనపుడు విలవిల్లాడుతావు 
ఆశావహమైన మాటలేవీ వినిపించవు,
విన్నా, గాలి అందనివేళ వాటికి అర్థముండదు 

ఇదంతా ఆనందమో, బాధనో
తెలీని క్షణాల్లోకి ఇంకిపోతావు చూడు,
అప్పుడెవరో నీ దేహాన్ని తడతారు,
తెల్లవారింది, ఇంకా లేవలేదేమిటని

లేచాక తెలుస్తుంది ప్రేమించాల్సింది వేరే లేదని,
నిన్ను నువు తలమునకలుగా ప్రేమిస్తున్నావని

బివివి ప్రసాద్

25 సెప్టెంబర్ 2025

కవిత : బందిఖానా

 నిన్ను నువు మెచ్చే పనులు పదులు చేసావు,
క్షమించలేనివి వందలు చేసావు,
జీవితం ఊబిలో చిక్కుకున్నాక
ఎవరైనా ఇంతకన్నా ఏం చేస్తారు

ఎగురుదామనిపిస్తుంది, రెక్కలుండవు,
ఈదాలనిపిస్తుంది, మొప్పలుండవు,
చెట్టులా ఎదగాలి, గాలికి ఊగాలనిపిస్తుంది,
వేర్లుండవు, కొమ్మలూ, ఆకులుండవు

నిన్ను నువు కాపాడుకొనే భయాన్ని పెట్టి, 
సంతోషపరచే బాధ్యత పెట్టి,
ఎవరో విశ్వంలో గింజలా పాతారు

ఊబిలోంచి వెలికి రాబోయే ప్రతి కదలికా
ఇంకా ఊబిలోకి దించుతుంది,
ఇంత పెద్ద ప్రపంచం ఇంకా నిజమై కనిపిస్తుంది,
నిజంగా తెలీదు, ఇదేమిటో, ఏం జరుగుతుందో

కాలంతో ఉక్కపోత పెరుగుతుంది,
వేడిగాలితో బరువెక్కిన మేఘం
ఎప్పుడో కుండపోతగా కురుస్తుందేమో తెలీదు

కురిసీ, కురిసీ మేఘం నీరై, గాలై, ఆకాశమై 
లేకుండా పోతుందేమో తెలీదు,
లేనిదేదో ఉండటం కలలోంచి
ఉలికిపడి లేస్తుందేమో తెలీదు

బివివి ప్రసాద్

24 సెప్టెంబర్ 2025

కవిత : ఉద్వేగాల నుండి

ఉద్వేగాలు అడవిలో వృక్షాలు,
వృక్షాలలోంచి జారే కిరణాలు,
కిరణాలలో మిలమిలలాడే సెలయేళ్ళు,
సెలయేళ్లలో దప్పిక తీర్చుకునే 
కీటకాలు, మృగాలు, పక్షులు

ఎప్పుడూ ఏదో ఒకటిగా ఉండాలనిపిస్తుంది
వృక్షంలానో, కిరణంలానో, సెలయేటిలానో,
కీటకంలానో, మృగంలానో, పక్షిలానో

అడవిలోని ఏదో ఒకటై ఉన్నపుడు
అడవివి అయినట్టుంటుంది,
నువు ఎన్నో అయినట్లూ, నీకు ఎన్నో ఉన్నట్లూ 
కానీ, ఇది ఎప్పటికీ నిండదు
ఎప్పటికీ ఒకలా ఉండదు, ఎప్పటికీ నిలవదు

చెట్లు ఎండుతాయి, చీకట్లు వాలుతాయి
సెలయేళ్ళు పొడిబారతాయి, జీవాలు వెళ్ళిపోతాయి 
ఏదీ మిగలని విషాదం భయపెడుతుంది,
భయపడీ, భయపడీ 
ఇక పడలేక అడవిని వదిలేస్తావు చూడు

అప్పుడు మెలకువ వస్తుంది,
నువు అడవివి కావని, కాలేవని,
అడవిలో తిరుగాడే నిశ్శబ్దానివని,
అడవినీ, నిశ్శబ్దాన్నీ అలముకొన్న ఆకాశానివని,
ఆకాశాన్ని ప్రశాంతంగా కలగనే అనంతానివని

బివివి ప్రసాద్

23 సెప్టెంబర్ 2025

కవిత : అశక్తుడు..

 రెండు తలుపుల్లో ఒకటి తెరుస్తావు, 
ఒకటి మూసి వుంచుతావు
సగం ఆకాశం రమ్మంటుంది,
సగం గది ఉండమంటుంది
ఎటూ తేల్చుకోక గుమ్మంలో నిలబడతావు

నిలబడే ఉంటావు, పుట్టింది మొదలు
అనుభవాల కెరటాల్లో మునిగి, తేలి,
ఇక్కడి నుండి వెళ్ళి పోయేవరకూ

ఎన్ని చీకటి రాత్రులు తడిమాయి, 
ఎన్ని పగటి కాంతులు పిలిచాయి
తమలో కరిగిపొమ్మని, కరిగి నీరై పొమ్మని, 
కాంతిలా మారిపొమ్మని, శాంతిలా మిగిలిపొమ్మని

పాదాలలో పాదుకొన్న భయం
కదలనివ్వలేదు, ప్రేమలోకి ఎగరనివ్వలేదు
గాలి జాలిగా తిరిగింది వలయాలుగా నీ చుట్టూ,
గుమ్మంలో ఉండగానే కాలం ఒలికిపోయింది

వట్టి చేతులతో, వట్టిపోయిన చూపులతో
ఎవరికోసమో ఎదురుచూస్తూ
ఉన్నచోట నిలుచుండి పోయావు 

ఉన్నచోటును విడిచి 
లోనికి వెళ్ళలేకపోయావు,
బయటికి రాలేకపోయావు

బివివి ప్రసాద్

22 సెప్టెంబర్ 2025

కవిత : నీకు నువు గుర్తుకు వచ్చి

చాలా సమయం తర్వాత నీకు నువు గుర్తొస్తావు
 
ఉద్వేగాల్లో మునుగుతూ, ఊహల్లో తేలుతూ,
పనుల్లో కొట్టుకుపోతూ, మనుషుల్లోకి ఈదుతూ
గగనంపై ఎప్పుడు సూర్యకాంతి ఒలికిందో,
సూర్యుడు జారుడుబల్లపై పడమటికి జారాడో,
నక్షత్రాలు గుప్పున వెలిగాయో, 
వీధుల్లోకి నిశ్శబ్దం కాలువలా ప్రవహించిందో 

గమనించకనే రోజు కాగితం గీతలతో నిండుతుంది,
పిచ్చిగీతల కాగితాన్ని నలిపి, విసిరాక,
నిద్రకి ముందు తటాలున నీకు నువు గుర్తొస్తావు

అలసిన మనసునీ, దేహాన్నీ దయగా పరికిస్తావు,
నిను ఏకాంతానికి అప్పగించిన
లోకానికి కృతజ్ఞతలు చెబుతావు,
నిన్ను ఒంటరిగా విడువని చీకటినీ, 
చీకటిలో ఆడుకొనే గాలినీ,
గాలిలో ఊయలలూగే జీవితాన్నీ ప్రేమగా పలకరిస్తావు

రోజు చివరికి చేరాక
నువు జీవిస్తున్నావని గుర్తొస్తుంది,
ఆటల తర్వాత పిల్లలు తల్లిని కౌగలించుకున్నట్లు 
జీవితాన్ని కౌగలించుకుంటావు

జీవితం నక్షత్రాలతో తల నిమిరి,
గాలితో ముఖంపై ముద్దులు ఒంపి,
బ్రతికున్నావు చాలు నా కని నిద్రలోకి పంపిస్తుంది

బివివి ప్రసాద్

21 సెప్టెంబర్ 2025

కవిత : నువ్వూ - ప్రపంచమూ

నువ్వనుకుంటావు ఇది చేసానని
పని అనుకుంటుంది ఇతనితో చేయించానని, 
ఇది నేను పొందాననుకుంటావా
ఇతని ద్వారా ఉనికిలోకి వచ్చానంటుంది అనుభవం,

నీకు స్వంతమయేవి
ముందుగా నిన్ను స్వంతం చేసుకుంటాయి,
యజమాని ముందు ప్రేమ నటించే బానిసలా
నీ ముందు అణగివుండి, లొంగదీసుకుంటాయి

నువు తలక్రిందులుగా 
లోకంలోకి జారాననుకొంటావు గానీ
నీలోకి లోకం తలక్రిందులుగా చొరబడింది

లోకాన్ని నువ్వూ,
నిన్ను లోకమూ చేయగలిగిందేమీ లేదు,
ఒకేచోట తిరుగాడే గాలిదీ, కాంతిదీ 
వేరువేరు ప్రపంచాలైనట్లు,
ఒకదాని నొకటి ఏమీ చేయలేనట్లు,

నీదీ, ప్రపంచానిదీ వేరువేరు ఉనికి;
ఇది తెలిసాక, మాష్టారిని చూసిన పిల్లల్లా
ఒకరితో ఒకరు ఆడుకోవడం మాని,
ఎవరి స్థలంలో వాళ్ళు బుద్ధిగా కూచుంటారు 
నువ్వూ, ప్రపంచమూ

బివివి ప్రసాద్

20 సెప్టెంబర్ 2025

కవిత : ఇలాగైతే తెలీదు

చాలారోజులు 
మనుషుల తలలు చూస్తూ గడిపాక
తటాలున గుర్తొస్తుంది,

ప్రణాళికలు చిట్లిన విరామంలోనో,
కలలల్లోంచి సందేహాల మంచులోకి తప్పినప్పుడో,
నీ మనుషుల నుండి ఊహించని నిశ్శబ్దాల్లో, 
గొంతుల్లో, చూపుల్లో, తప్పించుకోడాల్లోనో 

నీ చుట్టూ పెద్ద ప్రపంచం ఉందని,
తల వాల్చితే నీడలు కనిపిస్తాయని,
ఎత్తితే చెట్లు నీతో నివసిస్తున్నాయని,
వాటిపై పక్షులు వాలుతూ, ఎగురుతూ, 
దూరాలకి మాయమవుతున్నాయని

వాటిపై గగనంలో ఎండ అనేదొకటి 
పగలంతా చాప పరిచి నిద్రపోతుందని,
అది చాప చుట్టాక నల్లని నేల ఒకటి
చుక్కలతో శుభ్రంగా తళతళ్లాడుతుందని

నీ అయిదారుడుగుల ఎత్తు జీవితం నుండి
క్రిందికో, పైకో చూసినపుడు తప్ప తెలీదు

నువు బ్రతకాల్సిన జీవితంలో
నూరో వంతైనా బ్రతకటం లేదని,
నీ విశాలమైన గదిలో ఒక మూలన కూర్చొని 
ఊపిరి ఆడడం లేదంటున్నావని

తరాలుగా ఊడలు దించిన
భయాలు, మొరటుదనాలు
నీ జీవితం నీది కాకుండా చేసాయని

నీ అంతట నువు అడవిలోనో,
నక్షత్రాల గుంపుల్లోనో తప్పిపోతే తప్ప తెలీదు
వానలోకో, ఎడారిలోకో 
నిన్ను విడిచిపెట్టుకొంటే తప్ప తెలీదు

బివివి ప్రసాద్
ప్రచురణ : కవితా సెప్టెంబర్ 2025




19 సెప్టెంబర్ 2025

కవిత : దాగుడుమూతలు

నదులూ, పర్వతాలూ,
ఒళ్ళు విరుచుకునే ఆకాశమూ,
దానిలో ఈదే పగటి కాంతీ,
కాంతిలో ఆడే గాలిపిల్లలూ,
వీటిలో గీతలా సాగిపోతూనో,
చుక్కలా నిలబడి చూస్తూనో నువ్వు

ఇది కదా జీవితం, ఇది కదా జీవించట
మనిపించే క్షణాలు కొన్ని,
ఇంతలోనే ప్రేమికుల కౌగిలిలోకి
పరుగున వచ్చే పరాయి శబ్దంలా 
లోపల తొలిచే విసుగు పురుగు

ఇంత అందమైన జీవితం, తేలికైన, హాయైన జీవితం 
ఇంతలో బరువుగా, చీకటిగా ఎందుకు మారుతుందో 
తెలియని అమాయక ముఖంతో నువ్వు

రాత్రులు పొడిలా రాలుతాయి,
పగళ్ళు అద్దాల్లా పగులుతాయి,
రంగులూ, గీతలూ, లోతులూ చెదిరిపోతాయి,
కలుస్తూ, విడిపోతూ దిగ్భ్రమ కలిగిస్తాయి

ఏదీ జీవితం, ఇప్పుడెటు పోయిందని 
అల్లాడుతావు ఒడ్డున పడిన చేపపిల్లలా

కలలోని అందమైన మొహాన్ని
మెలకువలో వెదకబోయినట్లు,
ఇంత చిక్కని గీతల వలలోంచి 
బయటపడేందుకు తడుముకొంటావు

ఈ చిక్కని చీకటి తరువాత
వెలుతురు రాబోతూ ఉందని నమ్మినట్లు,
ఇంత వెదుకులాట తరువాత
శాంతి తప్పక దొరుకుతుందని నమ్ముతావు

బివివి ప్రసాద్

18 సెప్టెంబర్ 2025

కవిత : దుఃఖం తర్వాత

దుఃఖపు తుపాను వెళ్ళిపోయాక
పగటికాంతిని మరింత ప్రేమిస్తావు,
పిల్లల నవ్వులకి లోతైన అర్థం తోస్తుంది,
జీవులకి, జీవితమంటే
ఎందుకింత మోహమో అర్థమైనట్లుంటుంది

పూలు వికసించటం, గాలితెరలు ఎగరటం,
నీరు సరళంగా ప్రవహిస్తూ సంభాషించటం,
పిట్టలూ, ఇంద్రధనువులూ గాలిలో ఈదటం,
నేలమీది జీవులు తీరికగా ధ్వనులు చేయటం, 
వాటికి అర్థాలుండటం కొత్తగా ఉంటుంది,
నీరెండలోకి లోకం మొదటిసారి తెరచుకొన్నట్లుంటుంది
 
దుఃఖం తర్వాత, వ్యక్తి ధూళి అయిన తర్వాత,
నీటికడవలా భళ్ళున విడిన తర్వాత,
భద్రవలయాలు మసకబారిన తర్వాత,
నింగీ, నేలా కంపించిన తర్వాత

నీకు నువు కొత్తగా పరిచయమౌతావు
తలారా స్నానం చేసినట్లు, కొత్త బట్టలు కట్టినట్లు,
పండుగపూట గడుపుతున్నట్లు
నీపై లాలస వంటిదేదో కలుగుతుంది

గాఢమైన దుఃఖం తర్వాత మళ్ళీ పుడతావు,
లోపలి జీవితేచ్ఛ నిన్ను మళ్ళీ ప్రసవిస్తుంది,
గతం బీటల్లోంచి చిమ్మే జీవధార అనుభవానికొస్తుంది,
భవిత తెగిన గాలిపటమై స్వేచ్ఛలోకి ఊపిరితీస్తావు

గాఢమైన దుఃఖం తర్వాత
భయం నుండి ప్రేమలోకి 
ఉలికిపాటున మెలకువొస్తుంది 

బివివి ప్రసాద్

17 సెప్టెంబర్ 2025

కవిత : పాప వెదుకులాట

దేవాలయంలో ప్రార్థన జరుగుతోంది గంభీరంగా,
లీనం కాలేని చిన్నారి,
తనని లీనం చేసుకునే దృశ్యం కోసం 
వెదుకుతోంది తలల మీదుగా

తూనీగ ఎగురుతూ పలకరించకపోతుందా,
కదలక శ్రద్ధగా కూర్చున్న ఏనుగు బొమ్మ
ఏమరుపాటున పిలవకపోతుందా అని

గోడలపై బొమ్మల రంగులు 
గతకాలపు పిల్లల్లా శాంతిగా చూస్తున్నాయి,
కిటికీలోంచి తొంగి చూసే ఎండ తెరచాప 
రానున్న కాలంలోకి రమ్మని పిలుస్తోంది

గిరగిరా తిరుగుతోంది పాప,
బొంగరాల్లా తేలుతూ పాపలో ఊహలు,
హేమంతఋతువులోని నదిలా 
మెల్లగా కదులుతోంది కాలం

లీనమయా మనుకొంటున్న పెద్దలు
బరువుగా ఊపిరి విడిచి నిలబడ్డారు,
ఇంతసేపూ కాలం తటాకంలో
కాళ్లూ, చేతులూ ఆడించిన పాప
తనను కొనుగొన్న నిద్రలో కరుగుతూ 
తల్లి భుజంపై తలవాల్చింది

బివివి ప్రసాద్

16 సెప్టెంబర్ 2025

కవిత : గుంపులు

మనుషులు ఇప్పటికీ తమని 
గుంపుల్లోనే గుర్తుపడుతున్నారు

నిన్ను చూసుకుంటావా
ఏ గుంపుకీ చెందినట్లు తోచదు,
గుంపులు పిల్లల ఆటలనిపిస్తాయి
కానీ, గుంపు జీవస్వభావం గనక
నీదే గుంపని వెదుకుతావు నీలోపల

ఇచ్చి, పుచ్చుకునే గుంపుల్లో ఉక్కపోస్తుంది,
పరస్పర ప్రదర్శనల గుంపులు డొల్లగా తోస్తాయి,
భయపెట్టే, భయపడే గుంపుల్లో ఇమడలేవు,
నియంతల్ని కలగనే బానిసల గుంపుల్లో నిలబడలేవు

ప్రతిభావంతుల గుంపులిష్టమైనా
వారి పరుగు పందాల్లో పాల్గొనలేవు, 
రసోన్మత్తులు, దయాపూర్ణులిష్టమైనా 
వారి ఉద్వేగాల చివర్ల వెలితి భయం ,
జీవితంపై వెర్రి మోహంతో గుంపులు కనిపిస్తే
వారిలో దూరిపోవాలని ఉత్సాహపడతావు కానీ
వారిని విడిచాక వెంటబడే ఏకాకితనం బావుండదు

కానీ, అగాథమైన నిశ్శబ్దముంది చూసావా,
మనుషులు గుంపుగా వెళ్ళలేనిది,
అది లోపలి నుండి చెబుతుంది,
నువు ఎవరికీ చెందవు, ఎవరూ నీకు చెందరు 
 
పక్షి ఆకాశం నుండి విముక్తి కోసం ఎగురుతున్నట్లు
ఏ గుంపూ లేనిచోటికి ఎగరాలి, 
నీ లోపలికి ఎగురుతున్నపుడు గానీ తెలుసుకోలేవు

గుంపులూ, ఏకాకితనాలూ లేనేలేవని,
నువు తెలియరాని ఏకాంతానివని,
ఉష:కాలపు ప్రశాంతిలో తిరుగాడే
పండని, రాలని నారింజవంటివాడివని

బివివి ప్రసాద్

15 సెప్టెంబర్ 2025

కవిత : ఉన్నట్లుండి

ఉన్నట్లుండి ప్రేమ కమ్ముతుంది
కొన్నిసార్లు దుఃఖం కమ్మినట్లు,
మోహమో, భయమో కమ్మినట్లు

అప్పుడు నువ్వు నువ్వు కాదు
తుపానులో ఊగే వృక్షానివి,
సముద్రంలో విరిగిపడే అలవి,
ఏకధారగా కురిసే వెన్నెలవి,
నిద్రించే పక్షి రెక్కల్లోని నిశ్శబ్దానివి 

ఉన్నట్లుండి 
నువ్వు నువ్వు కాకుండా పోతావు చూడు
అప్పుడు నీకు నువ్వు దొరుకుతావు,
సముద్రగర్భంలో ముత్యం దొరికినట్లు,
ఊహల ఖాళీలో నీకు నువ్వు ఎదురైనట్లు

ఉన్నట్లుండి జీవితానికి తలుపులు తెరుస్తావు,
సందేహపడి మూసేలోగా 
అది కొన్ని కాంతులు ప్రవేశపెడుతుంది,
ప్రియురాలికి జారవిడిచే ప్రేమలేఖల్లా 

కాంతుల్లో తలపోస్తావు 
ఇదంతా కల్పన, పిచ్చివాని ఊహ,
పిల్లల ఆటల్లో తేలే ఆనందం,
పగలూ, రాత్రులుగా పొంగే అలల సందడి

మిగిలిన మాటలేమైనా ఉంటే
నీ కలల్లో నువు పూరించుకోవాలి,
మిగిలిన నిశ్శబ్ద మేమైనా ఉంటే
దానితో నిన్ను నింపుకోవాలి

బివివి ప్రసాద్

14 సెప్టెంబర్ 2025

కవిత : మునుగీత

రంగుల నుండి చూసినపుడు
రంగులు మినహా జీవితం మరేమీ కాదని తోస్తుంది,
రాగాల నుండి చూసినా అలానే

కాసిని అక్షరాల్లో రూపుతేలే
ఉద్వేగాల నుండి చూసినా 
ఉద్వేగాలు మినహా జీవితం మరేమీ కాదనిపిస్తుంది

జీవితం అద్భుతం, జీవించటం అద్భుతం 
ఇక్కడి రంగులూ, రాగాలూ, 
దీనిలో చేపల్లా ఈదే పగళ్ళు, రాత్రులూ,
అలల్లా ఊగే ఉద్వేగాలూ అద్భుతం

మన మనుకుంటాం 
జీవితం దుఃఖదాయిని అని,
ఇంతింత మనసుల, ఇంతింత భావాల్లో ఇరుక్కుని

ఆ జనన్మాంతం గాలిపటంలా ఎగిరే ఆకాశాన్ని 
కాసేపైనా ఆగి చూడలేం,
జీవితం మన చేతులు పట్టుకుని లాగి చూపే
ఆకుల పచ్చటి ఆనందాన్ని క్షణం గమనించలేం,
ఎండ సన్నగా పాడుకుంటూ ఉండే 
నేపథ్య సంగీతం ఎప్పటికీ వినలేం

గభాలున, భారమైన జీవిత మనేస్తాము
జీవితాన్ని మనమే మోస్తున్నట్లు,
తానే మనని మోస్తుందని మరిచి

మళ్ళీ చెబుతాడితను, గాయపడ్డాక కూడా,
జీవించటం ఆనందదాయకం
ఇంతకన్నా ప్రేమాస్పదం లేదు

ఇంతకీ, నీ బిడ్డని 
కడుపారా కావలించుకున్నపుడు గమనించావా 
నీకు జీవితమంటే ఎంత మోహమో..

బివివి ప్రసాద్

13 సెప్టెంబర్ 2025

కవిత : వాంగో

అతనేమిటో తెలీదు ఆ రంగులు చూసే వరకూ,
ముదురు రంగులతో, బలమైన రేఖలతో 
తానేం చెప్పదలిచాడో తెలిసినట్టు తోచింది
అతని కుంచె నుండి ఒలికిన బొమ్మలు చూసాక

వాంగో, నీకు కృతజ్ఞతలు,
జీవితం రంగులకి
కళ్ళని మరింత తెరిచినందుకు

ఇపుడు మరింత విప్పార్చి చూస్తున్నాను,
మేఘాల రంగుల్లో దాగిన హృదయాన్నీ, 
హృదయంలో తెరలెత్తిన మేఘాల రంగుల్నీ 

నువు జీవితాన్నెంత బలంగా ప్రేమించావో
నీకు దశాబ్దాల తర్వాత పుట్టిన 
ఇతను కూడా బహుశా, అంతే బలంగా..,
లేకుంటే నీ రంగుల్లో ఇతనెలా మునిగేవాడు 

వాంగో, ఎప్పుడో వెళిపోయిన సోదరుడా 
మన కోసమే కదా సూర్యుడు కిరణాలు చిమ్మాడు,
భూమిపై గడ్డి మొలకెత్తి, గాలికి ఊగింది,
మనల్ని కలగనటానికే కదా
ఆకాశం భళ్ళున తెరుచుకుంది

బివివి ప్రసాద్

12 సెప్టెంబర్ 2025

కవిత : ఒక రాత్రి

 దుఃఖం ముసిరినపుడు 
పిల్లల నవ్వుల కోసం వెదుకుతావు,
నవ్వుల్లోంచి జీవితోత్సాహం మెరుస్తుందేమోనని

జీవితం ఉత్సవమో, శాపమో 
ఇన్నేళ్లు గడిచినా అర్థం కాలేదు,
జీవితంపై మిగిలింది ప్రేమో, భయమో
ఈ వెలుగునీడల్లో తెలియరాలేదు

నిద్రపోయినా రోజు గడుస్తుందంటూ 
చాలాసార్లు ఊరడించుకుంటావు నిన్ను

జీవించటం భూమికంటే భారమైన పనా,
ఆకాశం కంటే తేలికైన ఆటా,
కలలోని మనుషులు వివరించలేరు

గాలి నిదురిస్తూ వీచినట్టు,
ఎండ నిదురిస్తూ కాంతి పరిచినట్టు
జీవితం నిదురిస్తూ నిన్ను కలగన్నదనుకొంటాను

ఈ చలిరాత్రి రెక్కలు విప్పి
చీకటిలోని ధాత్రిపై నిశ్శబ్దంగా ఎగురుతోంది,
అదృశ్యదేవతలు నీ జీవితంపై ఎగురుతున్నట్టు

చీకటిలోంచి ఒంటరి పక్షిపాట వినవస్తుంది 
పాట చుట్టూ తేలుతున్న నిశ్శబ్దంలో
నీకు నువ్వు దొరికినట్లు తోస్తుంది

ఈ రాత్రి లోపల 
అలలాగా తేలుతున్న నీ మెలకువ
తెల్లవారేసరికి ఏ తీరం చేరనుంది

బివివి ప్రసాద్

11 సెప్టెంబర్ 2025

కవిత : దయ

చాలాసార్లు కలగన్నావు 
ఇక మెలకువ రాకపోవటాన్ని,
కనురెప్పలు తెరుచుకుంటాయి,
దృశ్యం జలపాతంలా దుముకుతుంది

చివరి ఘడియ చెంత నిలిచినపుడు
సంతోషంగా చేతులు చాపుతావో,
వెనుదిరిగి కన్నీరు విడుస్తావో తెలీదు

భయం లోపలి ప్రేమా, 
ప్రేమ లోపలి భయమూ 
అంతు తెలియని రహస్య వలయం

ఎవరి ఆనందం కోసం ఇదంతా,
ఎవరి బాల్య చేష్ట,
ఎవరి తీరిక మధ్యాహ్నపు పగటికల

దీనిలో అందం, ఆశ్చర్యమున్నాయి,
దుఃఖం, క్రౌర్యం ఉన్నట్లుగానే;
వాటి నడుమనున్న నిశ్చలతలోకి మేలుకోవాలి

కాలం లేని అనుభవంతో 
కాలం గడవాలనుకోవటం,
స్థలాన్ని దాటి నిలిచి ఉండాలనుకోవటం 
ఏమిటీ వెర్రి అని ప్రశ్నించుకుంటావు

ఏకైక నిశ్శబ్దం ఏమీ బదులివ్వదు, 
ఏకైక శూన్యం అణువంత చలించదు

ఇలాంటి సమయాన దయ స్ఫురిస్తుంది,
భయాలలోకి ఉదయించే కాంతిలా

ఈ లోకంలో నీలో నువు 
నమ్మదగిన ఉద్వేగమేదైనా ఉంటే
అది దయ అనీ, నీకూ ఇవ్వబడిందనీ
నిన్ను ఓదార్చుకుంటావు

ఈ గాలినీ, నేలనీ, గగనాన్నీ తాకితే
కోమలంగా దయ తెలుస్తుంది చూసావా,
బ్రతకటానికి ఇంతకంటే ఏదైనా ఎక్కువ కదా

బివివి ప్రసాద్

10 సెప్టెంబర్ 2025

కవిత : సరేనా!

1
జీవితం అల్లరిపిల్లాడి వంటిది
ఆనందించలేం, ప్రేమించకుండానూ ఉండలేం,
ఎంతకీ పగలని కొబ్బరికాయలా 
దీని రహస్యాలు అర్థంకావు

ఆకాశం శాంతినిస్తుంది, నేల దుఃఖ పెడుతుంది
అయినా నేలని అంటిపెట్టుకుని వుంటాం

తేలిపోయే మేఘాల్లాంటి, ఇంద్రధనువుల్లాంటి
కలలు చాలా కంటాం కానీ,
నిజం కావటం ఇష్టం ఉండదు,
నేల మీద నమ్మకం పోదు, 
ఆకాశం పై నమ్మకం కలగదు,
లేకుంటే ఎప్పుడో పక్షిలా ఎగిరేవాళ్ళం

నేల దుఃఖదాయిని
అయినా నేల మేల్కొలిపే కరుణ ఇష్టం,
ఆకాశం సుఖ ప్రదాయిని
అయినా స్వేచ్ఛలోని ఒంటరితనం అయిష్టం

ఇలా కవ్విస్తుంది జీవితం 
నిన్ను ఇష్టపడీ, పడనట్టు నటించే ప్రియమైన వ్యక్తిలా,
దీని మాయలో చిక్కుకుంటావు ఇష్టంగానే
సాలెగూటిలో చిక్కిన జీవిలా 

జీవితం మోహపడి, దుఃఖపడాల్సిన వస్తువు కాదు,
అట్లా అని తప్పుకోతగింది కూడా కాదు,
ఖాళీ ఉనికిలో ఈ నాటకం కొంత సరదా

ఏదైనా ఉండటం బావుంటుంది,
ఉండకపోయినా పరవాలేదు,
గొప్ప స్నేహం దొరికితే ఆనందం,
దొరకకపోయినా ఆనందానికి లోటులేదు

2
సరేనా!

బివివి ప్రసాద్

09 సెప్టెంబర్ 2025

కవిత : ఏకాంత సమయం

చెట్టు నుండి రాలిన ఆకు
తనదైన ఏకాంతంలో మునిగింది,
ఆకులు రాలిన ఊరు 
తన ఏకాంతంలో తాను మునిగివుంది

ఊరు నివసించే భూమి
తన ఏకాంతంలోకి చేరుకొంది,
భూమిని శూన్యంలో తేల్చే విశ్వం
తనదైన ఏకాంతంలోకి మేలుకొంది

ఆకులు రాల్చిన కాలం
తనదైన ఏకాంతంలో
లోలోపలికి మేలుకొంటోంది;
నీ లోంచి, నా లోంచి
నవ్వుల్లోంచి, భయాల్లోంచి

కాలంలా ప్రవహించే ఆనందం
ఎప్పుడూ, ఏమీ పట్టక 
తనదైన ఏకాంతంలో
తనలోనే మునుగుతూ, తేలుతూ..

బివివి ప్రసాద్

08 సెప్టెంబర్ 2025

కవిత : జరగనివ్వాలి..

పూలు రాలుతుంటే రాలనివ్వాలి,
సీతాకోకలని ఎగరనివ్వాలి,
వాటిని కవిత్వం చేయాలనీ,
బొమ్మలుగా తీర్చాలనీ తలచరాదు 

నీ లోంచి నవ్వు వస్తే రానివ్వాలి,
భయం పుడితే పుట్టనివ్వాలి
వాటిని తిరిగి తిరిగి దిద్దాలనీ,
కాదనో, ఔననో తేల్చాలనీ చూడరాదు

గాలి వీచినట్టు సహజంగా,
నీరు పారినట్టు సరళంగా
జరగనివ్వాలి, వెళ్ళనివ్వాలి

తేలికగా ఉండాలి, తెలియనట్లుండాలి
ప్రపంచాన్ని తన కల కననివ్వాలి,
అనంతాన్ని తన కౌగిలిలో ఉండనివ్వాలి

పెద్దగా గొడవపడేదేం లేదు ఇక్కడ,
అంతగా నిలబెట్టుకోవలసింది కనరాదు,
కాలం గడిచిందా, లేదా అన్నట్లుండాలి,
స్థల మొకటుందా, లేదా అనుకోవాలి

ఊరికే కదలాలి, మాట్లాడాలి, 
అలసటతో హాయిగా నిద్రపోవాలి,
కడపటి బిందువు ఎదురైనపుడు
తృప్తిగా దానిలో లీనం కావాలి

బివివి ప్రసాద్
ప్రచురణ : సారంగ 1.9.25

కవిత : ఖాళీగా..

ఖాళీలోంచి వచ్చావు
ఖాళీలో కలిసిపోతావు
మధ్యలో ఖాళీగా ఉండలేవా 
అన్నారాయన టీ కప్పు పెదాలకి తాకిస్తూ

ఈ లోకం కూడా
ఖాళీలోంచి వచ్చింది
ఖాళీలోకి పోతుంది
మధ్యలోవి ఖాళీ పనులే గదా
అన్నాడతను కప్పు కింద పెడుతూ

ఖాళీలని గుర్తిస్తే సరే
అన్నారాయన 
కప్పులు ప్రక్కకి జరుపుతూ

బివివి ప్రసాద్ 
ప్రచురణ : సారంగ 1.9.25

06 సెప్టెంబర్ 2025

కవిత : చిన్న మెలకువ

పూల మీద
గాలికి ఊగే రంగులు కదిలిస్తాయి;
ఇంత ఆకాశంలో
తేలే రంగులు కదిలించలేనపుడు,
ఇంత జీవితంలో
మునిగే అనుభవాలు తాకలేనపుడు 

పూలలోంచి కదిలింది ఆకాశమేనని,
రంగుల్లో ఊగింది జీవితమేనని 
నీకపుడు తోచకపోవచ్చును

ఇదంతా ఒకటేనని,
కదలాడే నీటిబుడగపై
తిరుగాడే బొమ్మలాంటిది ప్రపంచమని
గుర్తించలేకపోవచ్చును

గాలికి ఊగే రంగులు
నీ చేతన తలుపులు తట్టినపుడు
నీదైన ఏకాంతంలోకి మెలకువ వస్తుంది

ఇదంతా ఒకటో, కాదో చెప్పాలనిపించని 
అనాసక్తతలోకి శాంతిస్తావు

బివివి ప్రసాద్

05 సెప్టెంబర్ 2025

కవిత : అడ్డు వస్తున్నది

ఇక్కడి నుండి ఎగరేసుకుపోయేవి ఏవో,
ఇక్కడ బంధించేవి ఏవో
స్పష్టంగా తెలుసు కనుకనే
ప్రేమంటే అంత భయం, ప్రేమలేమి అంతవసరం

సందేహించటానికి, దాగొనడానికి,
భయపడటానికి, తలపడటానికి,
ఎవరో కావాలి నీకన్నా బలంగా,
ఇక్కడ పని ఉంటుంది అప్పుడు,
ఉండాల్సిన కారణం దొరుకుతుంది

కాస్త ప్రేమించావా, దయ చూపావా,
క్షమించావా, వదిలేశావా,
చేతులు ఖాళీ అవుతాయి, 
బరువులు తొలగిపోయాక,
ఇక ఎగురుదామా అని వినవస్తుంది 

ఇదంతా వెలుగునీడల ఆట,
చెట్లు అట్లానే ఉంటాయి;
నీడలు సంధ్యలలో దీర్ఘమౌతూ 
మధ్యాహ్నాలు దాక్కుంటాయి చూసావా,
అలానే భయాలు, ఆశలు, సందిగ్ధాలు

క్షమించతగనిది ఏమీ కనిపించపుడు
పసిదనంలోకి జారిపోతావని భయం,
పసిదనంలోంచి అనంతం ఎత్తుకుపోతుందని

చిటికెడు ప్రపంచాన్ని చుట్టుకొన్న
అనంతమైన ఆకాశం 
ఇక్కడ కనులు తెరిచింది మొదలు
నీకు చెబుతూనే ఉంది
నీకు తెలిసిన జీవితం చాలా చిన్నది,
నీ జీవితం చాలా పెద్దదని,
వినడానికి అడ్డు వస్తున్నది ఏది 
అది ఎప్పుడు దారి ఇస్తుంది

బివివి ప్రసాద్

04 సెప్టెంబర్ 2025

కవిత : ఏకాంతం

ఎదగాల్సి ఉంది 
ఒకరి భుజంపై తలవాల్చడం నుండి,
అపు డనంతమైన ఏకాంతంలోకి 
నడక మొదలవుతుంది

ఉదయాస్తమయాలు లేని, 
వెన్నెలలూ, వానజల్లులూ
నీనుండి నిన్ను వేరుచేయలేని,
నీతో నువు నిండిపోయే ఏకాంతంలోకి

చాలా వేదన, గాయాలు,
అణచుకున్న రోదన, కాలువల కన్నీరు
రాత్రి కంటే పెద్దవైన దుఃఖాలు
నిన్ను నీదగ్గరకు చేర్చటానికని 
అప్పటి వరకూ తెలియదు

జీవితమేమీ మధురం కాదు, చేదూ కాదు,
దాని మానాన అది ఉంది,
గుమ్మంలోంచి చూస్తే ఎగురుతూ వెళ్ళిన పక్షిలా
తన మానాన తాను జీవిస్తూవుంది

సూర్యకాంతి అద్దంలా భళ్ళున పగిలినట్టు 
అనిపించిందా ఎపుడైనా
బాధలోనో, భయంలోనో, ఏకాకితనంలోనో

అనిపిస్తే, మంచిది,
నీదైన ఏకాంతం నిండా నువు
అడవిలో చీకటిలా వ్యాపిస్తావు.

కాలేదా, మరీ మంచిది
కాగితంపై ఒలికిన రంగుల్లాంటి 
మనుషుల మధ్య జీవితాంతం గడిపేస్తావు

బివివి ప్రసాద్

03 సెప్టెంబర్ 2025

కవిత : స్వగతం

తలుపు తీయటం, 
గడియ చప్పుడు చేయటం,
తలుపు మూయటం,
బయటా, లోపలా రాత్రి సమానంగా వ్యాపించటం,
రాత్రి లోపల నిశ్శబ్దం నిండటం,
నిశ్శబ్దం లోపల శబ్దాలు కువకువలాడటం 
ప్రతిదీ ఆశ్చర్యం, అద్భుతం

గడియారం క్షణాలు లెక్కించటం,
ఫ్యాను గాలి వృత్తాలని లెక్కచూసుకోవటం,
దీపం విసుగులేక ఒకలానే కాంతి ధారపోయటం
ప్రతిదీ తపస్సు, ఎడతెగని ధ్యానం

మెలకువలో తేలు,
గాఢనిద్రలో మునుగు, కలల్లో ఈదు 
ఈ రాత్రి ఇలానే గడుస్తుంది,
చీకటి ద్రవం పూర్తిగా ఒలికిపోయాక
ఖాళీ వెలుతురు ముఖం చూపుతుంది

ఇంతకన్నా ఏం కావాలి బ్రతికి ఉండటానికి, 
బాధనీ, భయాన్నీ, బరువైన పిట్టలా ఎగిరే నవ్వునీ 
అనుభవించటానికి, అనుభవాలని అనుభవించటానికి 

మామూలుగా మొదలవుతావు,
సందడిగా జీవిస్తావు, వినబడకుండా వెళిపోతావు 
జీవుల జీవితచరిత్ర ఇంతకన్నా ఏమీకాదు

కానీ, తలుపు తీయటం, వేయటం,
గడియ చప్పుడు చేయటం,
రాత్రిని నీ చుట్టూ బంధించటం,
చీకటిలో మాత్రమే కనిపించే దేనినో వెదకటం,
కాలాలకావల నక్షత్రాలుగా కాంతులీనుతాయి,
తరువాతి తరాల ప్రాణులతో
తెలియనిరాని సంభాషణలు జరుపుతాయి

బివివి ప్రసాద్

02 సెప్టెంబర్ 2025

కవిత : వర్తమానం

సుఖముంటుంది
కన్నతల్లి కనుల ముందు వున్నపుడు,
కన్న ఊరు పాదాలని అంటినపుడు,
మర్యాదల దుమ్ము దులుపుకొని
చిననాటి నేస్తాలతో నోరారా మాట్లాడినపుడు,

అప్పటి చెట్లపై, చెరువుపై
అప్పటి ఎండ కాసినపుడు,
అప్పటి నిద్రలోకి జారుతూ, కప్పల శబ్దాల్లోంచి 
అప్పటి వానచప్పుడు వింటున్నపుడు 
స్వర్గం ఎవరికి కావాలనిపిస్తుంది

మారిన ఊర్లు, వయసులు,
మారిన మనుషులు, మనసులు
చేరిన బరువులు, గాయాలు
వెన్నెల తెల్లబోవడం, 
పగలు చీకటి కురియడం పరిచయం చేసాక, 
నరకం ఎక్కడో లేదని తెలియవస్తుంది

భూమి పైన దొరికేవి
స్వర్గం, నరకమేనా అని తడుముకొంటావు
మెలకువలలో, నిద్రల్లో, ఊహల్లో, కలల్లో;
రెండిటి విముక్తి కోసం తపిస్తావు

దుఃఖం శిఖరాలని చేరినపుడు,
అటు గగనం, ఇటు లోయలూ 
ఒకేసారి బలంగా పిలుస్తున్నపుడు
ఉలికిపడతావు శిలలాంటి వర్తమానంలోకి
బహుశా,
అపుడు నువ్వు ఉండవనుకొంటాను, 
పగటిలో దీపకాంతిలా
వర్తమానంలో నీ ఉనికి లీనం కావచ్చును

బివివి ప్రసాద్

01 సెప్టెంబర్ 2025

కవిత : అనంతం ప్రేమ

మనుషులిద్దరు అకలుషంగా 
కౌగలించుకుంటారు చూసావా
అపుడు వాళ్ళు రెండు చేపలు,
రెండు చీమలు, ఇద్దరు పిల్లలు,
రెండు పక్షుల ముక్కులు,
నీరెండలోని పొడవాటి జంట నీడలు

కౌగిలిలో కనులు మూసుకొని
గాఢమైన నిట్టూర్పు విడిచినపుడు
గ్రహగోళాలకి విస్తరించిన ఒక జీవితం,
మరణాన్ని దాటిన మెలకువ

అనంతం ఎక్కడో లేదు
ప్రేమ రూపంలో తిరుగుతోంది 
మన చుట్టూ, కన్నబిడ్డలా 

అహం ముసుగు వేసుకుని
తప్పించుకోవాలని చూస్తామా,
దుఃఖం ముసుగు వేసుకుని
మన కోసం ఎదురుచూస్తుంది

అకలుషంగా ఇద్దరం సమీపించినపుడు
ఇదిగో, ఇక్కడే ఉన్నానంటూ
ఆకాశం తెర తొలగించి 
మన ముందు వాలుతుంది

బివివి ప్రసాద్

31 ఆగస్టు 2025

కవిత : కానిమ్మని..

మళ్ళీ మేలుకొంటావు,
ఈ కాంతీ, అలల్లా ఎగిసే రంగులూ, నీడలూ, 
వాటిలోంచి దాగుడుమూతలాడే 
జీవితమూ పలకరిస్తాయి
ఈ రోజైనా ప్రేమించగలవా మమ్మల్ని

ప్రతి మెలకువలోనూ జీవితం ఇదే చేస్తుంది,
ప్రతి నిద్రకి ముందూ ఇదే చెబుతావు
సంతోషం, ఇక చాలు, విడిచిపెట్టు అని

నిజంగా, ఈ లోకం అందమైనది,
దీని కాంతినృత్యం సంభ్రమాశ్చర్యాలనిస్తుంది
కానీ, ఇంత వినోదం, 
సముద్రపు లోతుల్లోని 
గాఢమైన ఏకాంతాన్నీ, నిశ్శబ్దాన్నీ ఇవ్వలేదు

ఇక్కడ తిరిగావు, నవ్వావు,
గుండెలవిసేలా ఏడ్చావు కొన్నిసార్లు,
చాలా భయపడ్డావు అనేకమార్లు
ఇవన్నీ అవసరమా
ఖాళీ ఆకాశంలాంటి స్వేచ్చలోకి ఎగిరిపోకని
కలగన్నావు, దిగులు పడ్డావు

అయినా ప్రపంచం పిలుస్తుంది,
అమ్మ పిలిస్తే పరుగున వచ్చినట్టు
తటాలున దీనిలోకి మేలుకొంటావు 

పక్షి కూత గాలిలో కలిసిపోతుంది,
వికసించిన పూవు భూమిలో కరిగిపోతుంది,
ఎగసిపడే అల సముద్రంలో మాయమౌతుంది, 
ఆట ముగిశాక ఖాళీ తలుపు తట్టితీరుతుంది 

సరే, ఇవాళ్టికి కానిమ్మని
ప్రపంచంలోకి అడుగుపెడతావు

బివివి ప్రసాద్

మాయాతెరల వెనుక అన్వేషణ - బివివి ప్రసాద్ కవిత్వం

"అనంతమైన కొలతలతో అలల్లా ఎగసిపడే సృష్టి ఇది/ దీనిలోకి వెలుతురు పుట్టినట్టు పుట్టి/చీకటి పుట్టినట్టు వెళ్ళిపోతావు/లేదా నీలో ఇది చీకటి పుట్టినట్టు పుట్టి/ వెలుతురు పుట్టినట్టు వెళ్ళిపోతుంది" అంటారు కదా ఈ కవి.. ఇది మొదలు కాదు.. చివరా కాదు. జీవన ప్రయాణంలో ఎదురైన అనుభవాల తాలూకు వాస్తవం.. నిజానికి సృష్టి నిన్నటినీ, నేటినీ కలిపే అనేకానేక కలిపే రేఖలతో పాటు ఒకే ఒక్క విడదీసే రేఖతో కూడా నడుస్తూనే వుంటుంది. అలాంటి రేఖలకు ఎదురైన శిలా మస్తకాల్ని పలకరిస్తూ, మచ్చిక చేసుకుంటూ ఎదురపుతున్న కంటక ముఖాల్ని తొలగిస్తూ కదల్లేక పోతున్న కాలాన్ని కదిలిస్తూ, నడిపిస్తూ పదం పదం ముందుకు పయనం చేసేవాడే కవి. ఏదో తోచక రాస్తున్నారనుకునే మీమాంశతో సమాజం నడుస్తున్నా కవి తన అక్షరాలతో అర్పేది ఆకలి మంటల్నే కాదు. రాలే కన్నీటి చుక్కల్ని కూడా.. నిత్యం మానసిక దౌర్భల్యంతో ఎదురవుతున్న దిబ్బల్ని, దుబ్బల్ని సస్యశ్యామలం చేస్తూ నవ చలనం కలిగించే రీతిలో సాగే మహా ఋషి కవి.

ఆధ్యాత్మికత, తాత్వికత, వాస్తవికత మూడింటిని ఒక తాటిపై ఒడిసి పట్టుకున్న బొల్లిన వీరవెంకట ప్రసాద్ తెలుగు సాహిత్యంలో కవితా ప్రపంచానికి తనదైన ముద్ర వేసుకున్న కవి. 1966 నవంబరు 21న జన్మించిన ఆయన బాల్యం మాతామహులు, మేనమామలు ఉన్న ఉమ్మడి కుటుంబంబో గడిచింది. అనంతరం తల్లిదండ్రుల వద్ద చాగల్లులో ఏడవ తరగతి వరకు, తణుకులో బీకాం రెండవ సంవత్సరం వరకు, చివరి సంవత్సరం కాకినాడలో చదివారు.

సాహిత్యం పట్ల ఆయనకున్న ఆసక్తి చిన్ననాటి నుంచే అవిర్భవించింది. స్కూలు చదివే రోజుల్లో చిత్రకళలో మొదలైన సృజనాత్మకత కళాశాల దశలో కవిత్వంగా రూపాంతరం చెందింది. 1989లో ఆయన తొలి కవితా సంపుటి "ఆరాధన" వెలుపడేలోపు అనేక కవితలు, కథలు, సాహిత్య తత్త్వ చింతనలు రచించారు. ఆరంభంలో వచన కవిత్వం రాసిన ఆయనకు హైకు ప్రక్రియపై ప్రత్యేక ఆకర్షణ పెరిగింది. ఫలితంగా 1995, 1997, 1999లో వరుసగా "దృశ్యాదృశ్యం", "హైకూ", "పూలురాలాయి" పేర్లతో మూడు హైకూ సంపుటాలు వెలువడ్డాయి. ఆయన హైకూలలో ప్రకృతి సౌందర్యం, జీవన సత్యం, అనుభూతి విశ్వం సులభమైన పదాలతో అవిష్కృతమవుతాయి.

వచన కవిత్వంలో ఆయన శైలి అనుభూతి ప్రాధాన్యతను చాటి చెబుతుంది. 2006లో “నేనే ఈ క్షణం”, 2011లో "ఆకాశం", 2015లో "నీలో కొన్నిసార్లు" అనే సంపుటాలు ఆయన కవితా వైశాల్యానికి నిదర్శనం, ఈ కవిత్వంలో కవి మనిషి అంతర్ముఖంలోని నిశ్శబ్దాన్ని, సమాజంపై ఉన్న అవగాహనను సున్నితంగా వ్యక్తం చేస్తారు. 2022లో "ఊరికే జీవితమై" అనే వచన కవితా సంపుటి కూడా ఈ ప్రయాణానికి చిహ్నం. అదనంగా హైకూలు, హైకుపై వ్యాసాలను కలుపుకొని "బివివి ప్రసాద్ హైకూలు" అనే పుస్తకాన్ని కూడా ఆయన అందించారు. వీరి కవితల్లో సహజత్వం, వాస్తకవిత్వం ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. ఉదాహరణకు "అమాయకం" అనే కవితలో కవి అమాయకత్వాన్ని ఒక శక్తిగా, జీవన విలువల మూలంగా చూపిస్తారు. లోకం అమాయకుడిని హేళన చేసినా, గెలుపు కోసం పరిగెత్తినవారు ఎవరూ తృప్తిగా జీవించలేదని, ఒంటరితనంలోనూ సంపూర్ణత ఉందని కవిగా తమ దోరణిని వ్యక్తీకరిస్తారు. ఈ దృక్పథం వీరి కవిత్వానికి ప్రత్యేకతను అందిస్తుంది.

ప్రకృతిలోని ప్రతి చిన్న చలనం ఆయన కవిత్వంలో ఒక సంకేతంలా కనిపిస్తుంది. గాలి వీచటం, చెట్లు చిగురించడం, వానజల్లులు రావడం అన్నీ కవి దృష్టిలో జీవన సౌందర్యానికి ప్రతీకలు. "మనం ఒకరి లోపలికి ఒకరం మరీ ఎక్కువ చొరబడుతున్నామేమో" అనే ఆయన భావన, ఆధునిక జీవితంలోని హడావిడిలో మనిషి కోల్పోతున్న స్వాతంత్ర్యాన్ని గుర్తు చేస్తుంది. ఆయన కవిత్వం కేవలం భావాల వ్యక్తీకరణ కాదు, అది జీవితాన్ని అనుభవించమనే పిలుపు. భావోద్వేగాలకు, ప్రకృతికి, సంబంధాల సౌకుమార్యానికి ఆయన కవిత్వం అద్దం పట్టింది. అందుకే ప్రసాద్ గారి కవిత్వం నేటికీ పాఠకుడి మనసును మృదువుగా తాకుతూ, అలోచనల్లో కొత్త వెలుగులు నింపుతుంది.

బివివి ప్రసాద్ కవిత్వం సరళమైన భాషలో గాఢమైన అర్థాలను మోసుకువస్తుంది. హైకూలలో సంక్షిప్తత, వచన కవిత్వంలో విస్తృతి కలగలిపిన అయన సాహిత్యసృష్టి తెలుగు కవితా సంప్రదాయానికి ఒక విలువైన వనరుగా నిలిచింది. హైకూ ప్రక్రియలో అనవసర పదాల్లేకుండా, మూడు పాదాల్లోనే ఒక విశ్వాన్ని సృష్టించే సామర్థ్యం ఆయనలో ఉంది. హైకూలలో ప్రకృతి దృశ్యాలు కేవలం వర్ణనకే పరిమితం కాకుండా, జీవన సత్యాలను ప్రతిబింబించే సాధనాలుగా నిలుస్తాయి. "పూలురాలాయి" వంటి హైకూ సంపుటాల్లో కవి ఉపయోగించిన దృశ్యాలు పాఠకుడికి ఒక క్షణానుభూతిని కలిగిస్తాయి.

బివివి ప్రసాద్ కవిత్వ శైలిని విశ్లేషిస్తే, ఆయన రచనల్లో స్పష్టంగా కనబడే కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఆయన కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మొదటగా, ఆయన శైలిలో సహజత్వం ప్రధానంగా ఉంటుంది. బలవంతపు అలంకారాలు, గజిబిజి ప్రయోగాలు ఆయన రాతల్లో కనిపించవు. కవి అనుభవాన్ని ఏకకాలంలో సులభమైన భాషలో, కానీ లోతైన భావాలతో వ్యక్తం చేస్తాడు. ఉదాహరణకు, ప్రకృతిలోని చిన్న సంఘటనలు గాలి. వీయటం, చెట్లు చిగురించటం, వాన చినుకులు పడటం అన్నీ వీరి కవిత్వంలో జీవితానికి ప్రతీకలుగా మారుతాయి. ప్రకృతిని కేవలం వర్ణించడమే కాదు, జీవన తత్త్వాన్ని అందులో కనుగొని పాఠకుడికి అందజేస్తాడు. మరొక్క విషయం వీరి కవితా శైలిలో అనుభూతి ప్రధాన స్థానం కలిగి ఉంటుంది. కవిత్వం కేవలం భావుకతతో కాకుండా, లోతైన మానసిక అన్వేషణతో నిండి ఉంటుంది. ఉదాహరణకు, "మనం ఒకరి లోపలికి ఒకరం మరీ ఎక్కువ చొరబడుతున్నామేమో" అనే వాక్యం, అధునిక మనిషి సంబంధాలపై లోతైన అవగాహనను తెలియజేస్తుంది. ఈ భావనల్లో కవి ఒంటరితనం, మనుషుల మధ్య దూరం, అంతర్మధనం వంటి అంశాలను సున్నితంగా వ్యక్తం చేస్తారు.

వీరి వచన కవిత్వంలో విస్తృతమైన భావప్రవాహం ఉంటుంది. వచనకవిత్వంలో సంప్రదాయ లయ లేదు కానీ, ఆయన రాతల్లో అంతరంగ లయను సృష్టించే పద ప్రయోగం కనిపిస్తుంది. ఈ లయ పాఠకుడికి చదివేటప్పుడు ఒక మృదువైన నాదాన్ని అందిస్తుంది. కవితలోని అత్మీయత, వ్యక్తిగత అనుభవాల సౌకుమార్యం పాఠకుడిని కవితో మమేకం చేస్తాయి. వీరి శైలి తాత్వికతతో కూడి ఉంటుంది. "స్వర్గం వేరే లేదనీ, సంతోషం ముందు కాలంలో దాగి లేదనీ, ఉన్నాం మనం ఒకరి కొకరమని" అనే వాక్యాలు ఆయన తాత్విక దృష్టిని స్పష్టంగా తెలియజేస్తాయి. జీవితం అంటే వర్తమానాన్ని అస్వాదించడం, ప్రస్తుత క్షణంలోనే సంపూర్ణత ఉందని కవి నమ్మకం వ్యక్తం చేస్తారు. వీరు తమ శైలి సంప్రదాయానికి గౌరవం ఇవ్వడంతో పాటు ఆధునికతను కూడా అక్కున చేర్చుకున్నారు.. వీరి భావమేదయినా పాఠకుడిని మృదువుగా తాకుతూ, జీవితాన్ని కొత్తకోణంలో చూడమని అహ్వానిస్తుంది. సరళమైన పదాల్లో గాఢమైన అనుభూతి వ్యక్తం చేయడం ఆయన శైలికి మూలసారం. ఉదాహరణకు...

"నిష్కపట స్వప్నం" కవితను పరిశీలిస్తే, ఇందులోని భావనలతో పాటు కవి శైలిని గమనించడం ఆసక్తికరం.

ఈ కవితలో ప్రధానాంశం నిష్కపటత. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ వంటి విలువలను కవి జీవితంలో ఉన్న అత్యున్నత అనుభూతులుగా చూపించాడు. "ఎవరైనా ఇద్దరు మనుషులు నిష్కపటంగా ప్రేమించుకోవటం చూస్తే కనులు చెమ్మగిలుతాయి" అనే పాదంలో కవి మానవ సంబంధాల సౌందర్యాన్ని సున్నితంగా వ్యక్తం చేశాడు. ప్రేమను కేవలం వ్యక్తిగత అనుభవం కాకుండా, సామాజిక విలువగా ప్రతిపాదించారు.

వీరి కవితలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ప్రవాహం ఉంది. ప్రతి పద్యంలో మొదట ఒక దృశ్యం ప్రేమ, జీవనానందం, దయ చూపించి, తరువాత దాని ఫలితంగా కలిగే అంతరంగ మార్పుని వ్యక్తం చేశాడు. ఉదాహరణకు, "ఒక జీవి నిష్కపటంగా జీవనానందంలో మునిగితే హృదయం సారవంతమౌతుంది" అనే వాక్యం పాఠకుడికి ఒక నిశ్శబ్దమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది. భాషలో సరళత ఉన్నప్పటికీ, భావంలో లోతు ఉంది. కవి కట్టుబాట్లకు, భయాలకు అతీతమైన ఆత్మీయ క్షణాన్ని సృష్టిస్తాడు:

"ఉన్నట్లుండి పనులు పక్కన పెట్టేస్తావు, భయాలు మరిచిపోతావు, / కట్టుబాట్లు గాలికి వదిలేస్తావు"
 "ఎందుకు బతికావని/ ఎవరూ అడగకూడదనుకొన్నట్టే/ఎందుకు వెళ్ళిపోయావని కూడా ఎవరూ అడగకూడదనిపిస్తే/జీవితానికి పరమ గౌరవంతో నమస్కరిస్తావు// బహుశా అప్పుడు జీవితం కూడా నిన్ను మహా ప్రేమతో హత్తుకుంటుంది" 
ఈ పాదాల్లో ఒక తాత్విక స్వేచ్ఛా భావం వ్యక్తమవుతుంది. ఇది బివివి ప్రసాద్ కవిత్వానికి ప్రత్యేకత.

ఈ కవి ఒక సామాజిక-తాత్విక దృక్పథాన్ని చేర్చడం మనం గమనించవచ్చు. ఆ క్షణాలు భవిష్యత్ తరాల మనుషుల్లో కూడా మిగులుతాయని చెప్పడం ద్వారా ప్రేమ అనేది కేవలం వ్యక్తిగత అనుభవం కాదు, అది మానవ జాతి పరంపరలో కొనసాగుతున్న ఒక సాంస్కృతిక శక్తి అని స్పష్టం చేయడం కూడా మనం గమనించవచ్చు. శైలి ప్రయోగంలో సరళమైన వచనంలా కాకుండా వుంచడానికి ప్రయత్నిస్తారు. కృత్రిమ అలంకారాలు లేకుండా, సున్నితమైన అనుభూతుల్ని జతచేస్తూ వ్యక్తిగత అనుభవం నుంచి విశ్వానుభూతి వరకు తామెరిగిన దృశ్యాల ద్వారా భావవ్యక్తీకరణ చేస్తూ ప్రేమ,
దయ, జీవనానందం వంటి అరుదైన భావాలను దృశ్య రూపంలో చూపించడం ఒక ప్రత్యేకతే. దానితో పాటు తాత్విక స్పర్శ వర్తమానంలో మునిగి, సత్యాన్వేషణ చేయమనే పిలుపును వినిపించడం విశేషం. ఉదాహరణకు "నట్టనడిమి" కవితలో బివివి ప్రసాద్ గారి శైలిని, భావాన్ని విశ్లేషిస్తే అనేక సున్నితమైన లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఈ కవితలో ప్రధానంగా ధ్యానంలో ఒక క్షణికమైన మెలకువ, అంతరంగపు నిశ్శబ్ద అనుభూతి ప్రధాన పాత్రల్ని పోషిస్తాయి. ఈ కవి మొదటి పద్యంలోనే ఒక ప్రతీకాత్మక దృశ్యాన్ని సృష్టించారు గమనించండి.

"తుదిమొదలు తెలియని శూన్యంలో/ తెగిన గాలిపటంలా ఊగుతున్న జీవితమిది" ఇది కవితలోని పరివర్తన భావాన్ని బలంగా తెలియజేస్తుంది. కఠినత నుండి సున్నితత్వానికి, ఆందోళన నుండి విశ్రాంతికి మధ్య వుంచే మార్పును కవి ఒక శబ్దంతో, ఒక అనుభూతితో కలిపి చూపించారు. ఈ రూపకం కవి శైలిలోని అధ్యాత్మికతకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ.

 "మెలకువొకటి" అనే కవితలోని దృశ్యాల్ని సందర్శించాల్సి వస్తే "పూలపై వాలిన బంగారు కిరణం", "ఎగిరే పక్షి రెక్కల నుండి లీలగా తాకిన గాలి", "హోరు తరువాత వికసించే నిశ్శబ్దం" ఇవన్నీ కేవలం వర్ణనలు కాకుండా మనసుకు శాంతి ఇచ్చే ప్రతీకలుగా మిగిలిపోతాయి. వాటిని అనుసరిస్తూ ఒకే దిశగా కవితను ముందుకు నడిపిస్తాయి అందోళనల నుండి విముక్తి, ఒక తాత్కాలిక స్వేచ్చ, 

"భారమవుతున్న జీవితాన్ని తలుచుకొని ఏమీ లేదులే అంటావు శాంతంగా" అనే పాదం కవితలోని తాత్విక మెలకువను వ్యక్తం చేస్తుంది. ఇది జీవితభారాన్ని గుర్తించడం, కానీ దానికి లొంగిపోకుండా క్షణాన్ని అస్వాదించడం అనే భావన. కవి ఇక్కడ భయాలను అధిగమించే అంతరంగిక శాంతిని ప్రతిపాదించాడు.

తదుపరి పాదాల్లో కవి తన కవిత్వ స్వభావాన్నే ప్రతిబింబించాడు: "మరి కొంచెం సమయం అక్కడే ఉండమని పసిపిల్లల్లా అదుగుతాయి ఈ అక్షరాలు" ఇది కవిత్వం పాఠకుని దగ్గరికి రావడాన్ని, ఆ అనుభూతిలో మరికొంత సమయం గడపమని చేసే వేడుకోలు. కవి ఇక్కడ కవిత్వాన్ని ఒక ప్రాణమున్న జీవిగా ప్రతీకాత్మకంగా చూపించాడు.

కవిత యొక్క హృదయాన్ని అవిష్కరించడదలిస్తే "కానీ, ప్రేమ ఉంది చూసావా ఆ సున్నితమైన శబ్దం గుర్తుకు తెచ్చినది" కవిత ఒక తాత్విక వాక్యంతో ముగుస్తుంది చీకటా, వెలుతురా అనేది సందేహంగా ఉన్నా, ప్రేమ మాత్రం ఉందని కవి దృవీకరిస్తారు. చివరి పాదాలు "మబ్బుల వెనుకకి మాయమయే ముందు విశాలమైన గగనంలో ఒంటరిగా సంచరించే చందమామ" కవితను ఒక సజీవమైన, దృశ్యాత్మక ముగింపుకు తీసుకువెళ్తాయి.

పచ్చగడ్డి కోసం వచ్చిన లేళ్ళు ఇనుప కంచె తీగల్లో తలదూరుస్తాయి లేదా కాలు చాస్తాయి. తిన్నది తక్కువైనా పాపం నెత్తుటి కాళ్లతో బయటపడతాయి. నక్కిన నక్కల్ని, పొంచివున్న పులుల్ని ఈ మాటుకో తరిమేస్తూ నేటిని రేపు అనే అశతో కదిలించే దిశగా వీరి కవితల్లోని శైలి లక్షణాలు సున్నితమైన భాష, సులభమైన వచన నిర్మాణం, ప్రతీకాత్మక దృశ్యాలు పూలు, కిరణం, పక్షి, చందమామ తాత్విక మెలకువ జీవితం కంటే విలువైనది అనుభూతి, ప్రేమ అంతర్ముఖ దృష్టి, భయాల నుంచి బయటకు తీసుకువచ్చే అంతరంగ శాంతి కవిత్వ స్వరూపంపై అవగాహన అక్షరాలను పసిపిల్లలుగా పోల్చడం.

ఇది బివివి ప్రసాద్ శైలిలోని ప్రత్యేకత భావం, దృశ్యం, తత్త్వం కలిసిన సరళమైన కవిత్వం. బివివి ప్రసాద్ కవిత్వం సహజత్వంతో, మానవీయతతో నిండి ఉంటుంది. ఆయన పదాలు అలంకారభరితం కావు, కాని అనుభూతి లోతైనది. ప్రతి కవితలో ఒక తాత్విక మెలకువ, జీవితాన్ని కొత్త కోణంలో చూడమనే ఆహ్వానం ఉంటుంది. నిష్కపట ప్రేమ, దయ, కృతజ్ఞత వంటి విలువలను కవి అత్యున్నత సత్యాలుగా ప్రతిపాదిస్తాడు. ప్రకృతిని ఆయన కవిత్వంలో కేవలం దృశ్యరూపంగా కాకుండా, అంతరంగ శాంతికి ప్రతీకగా ఉపయోగిస్తాడు. చిన్న క్షణాల్లో పెద్ద అర్థాలను సృష్టించడం ఆయన శైలికి ప్రత్యేకత. హైకూలలో సంక్షిప్తత, వచన కవిత్వంలో భావ విస్తృతి కవిత్వానికి ద్వంద అందాన్ని తెస్తాయి. అందోళనలతో నిండిన ప్రపంచంలో ఆయన కవిత్వం పాఠకుడికి శాంతి, స్వేచ్ఛ, ప్రేమ అనే మార్గాలను చూపుతుంది. బివివి ప్రసాద్ కవిత్వం మనసుకు మృదువైన స్పర్శ, జీవితానికి అంతరంగ వెలుగులా నిలుస్తుంది. ఎంతో భావాలున్నాయి ఇంకా వర్ణించడానికి.. ఎన్నో వ్యక్తీకరణలున్నాయి.. వివరించడానికి.. కవి అంతరంగాన్ని కొలవడానికి కామాలుండవు. చుక్కలుండవు. అయినా గెలుపు కవిదే.. ఒక కవిని విశ్లేషించాలనుకున్న నా ధైర్యానిదే.. ప్రణామాలు..!

శైలజామిత్ర

ప్రచురణ : సృజనక్రాంతి 31.8.25
శైలజామిత్రగారికి అనేక ధన్యవాదాలు,
మిత్రులు పెరుగు రామకృష్ణ గారికి నమస్సులు 





30 ఆగస్టు 2025

కవిత : వెనుదిరిగి చూసినపుడు

వీడ్కోలు తరువాత, ఎవరో పిలిచినట్టు 
ఇద్దరూ ఒకేసారి వెనుదిరిగి చూస్తారు

అప్పుడు వారిమధ్య
తొలకరివానల మట్టివాసనలు వీస్తాయి,
మొగ్గలింకా వికసించక ముందరి 
ఉదయకాంతులు పారాడుతాయి

అనాది కాలపు దయ
లేత అలలా హృదయాల్ని తాకుతుంది,
నల్లరేగడి నేలలోంచి
కొంచెం పచ్చదనం ఆకాశంవైపు తొంగి చూస్తుంది

వారు తొలిసారి కలిసిందే 
మళ్ళీ కలవటానికనే భావం
కిటికీలు తెరిచినప్పటి 
కాంతిలా లోపలికి దుముకుతుంది 

తరువాత ఏమైనా కానీ,
చివరికి ఏమైనా కానీ, 
మనుషులిద్దరు తొలిసారి 
వెనుకకు తిరిగి చూసుకొన్నపుడు

వారు మామూలు మనుషులు కారు,
మామూలు ప్రాణులు కారు,
వారి మధ్య పాలపుంతలు 
కలగనే సఖ్యత ఏదో 
ఒకసారి వెలిగి ఆరుతుంది

బివివి ప్రసాద్

29 ఆగస్టు 2025

కవిత : ఆటలో పడి..

కుదురుగా ఉన్న సృష్టి 
తనని ఖాళీ అద్దంలో చూసుకుంది,
అందంగా లేననిపించి
ఇద్దరిగా మారింది; ఆమె, అతను

తాను నిండుగా లేననిపించి,
ఒకటి కావాలని చూసింది,
వారి మధ్య ప్రేమగా మారింది

అప్పుడు మొదలుపెట్టింది ఆట
ఇసుకగూడు కట్టడంలో మునిగి
స్థలకాలాలు మరచిపోయిన పిల్లల్లా

ప్రేమలోని అనంతమైన ఛాయల్ని 
ఊహించటంలో మునిగి
బయటికి రాలేదు ఇప్పటికీ

ఎంత నవ్విందో,
ఎన్నింతలు ఏడ్చిందో తెలియదు కానీ,
ఇసుక గూటిని విడిచి
ఇప్పట్లో తాను రావాలనుకున్నా రాలేదు

బివివి ప్రసాద్

28 ఆగస్టు 2025

కవిత : ఆకాశం వైపు

చీకాకుల మునుగీతలోంచి
అప్రయత్నంగా తలయెత్తి 
సాయంకాలపు ఆకాశాన్ని చూసావు

అమ్మమ్మ ఒడిలోంచి
ఆశ్చర్యంగా కన్నార్పక చూసిన ఆకాశాన్ని,
ఆరుబయట చాపలపై కథలు చెప్పుకుంటూ
కనులు మూసే ముందు తలనిమిరిన ఆకాశాన్ని,
ఆటల్లో కింద పడినపుడు 
హఠాత్తుగా విశాలమైన ఆకాశాన్ని,

ఆమె మౌనానికి అర్థం తెలియక 
దిగులుగా కనులప్పగించినపుడు 
కరుణతో కౌగలించుకున్న ఆకాశాన్ని,
మిత్రుడి సాయంతో జీవితం లోతుల్ని 
పట్టుకోవాలని చూసే మాటల మధ్య 
మౌనంగా దర్శనమిచ్చిన ఆకాశాన్ని

చీకాకులెటూ పోవు
బలహీనతల్ని గిల్లుతూ వుంటాయి,
లేదా, బేలగా నీ వంక చూస్తుంటాయి,
భయాలు ఊది మంట రాజేస్తూ వుంటాయి,
తప్పించుకునే దారికోసం వెదకమంటాయి 

కానీ, ఆకాశం నిన్నేమీ చేయమనదు 
ఊరికే నిన్ను చూస్తుంది,
నీ చూపుకోసమే చూస్తున్నట్లు, పిలుస్తున్నట్లు,
పోనీ, నేను రానా అని అడుగుతున్నట్లు,
ఎందుకా చీకాకులన్నీ ఇంటికి వచ్చేయి అన్నట్లు
దయగా, తల్లిలా చూస్తుంది

ఇప్పుడిక చీకాకులన్నీ 
దొరికిన నీడల్లో కల్లా కాసేపు మాయమయాక,
నీ ముందు రెండు ప్రశ్నలు నిలుస్తాయి
పట్టుకొంటూ, పట్టుబడటమా, 
విదిలించుకొని, ఎగిరిపోవటమా

మొదటిదే గెలుస్తుందని 
రాసే నీకూ, చదివే మిత్రులకీ చెప్పనక్కరలేదు,
లేదంటే, నువు ఎందుకు రాసేవాడివి,
వారెందుకు చదివేవారు,
ఏనాడో మేఘాలపైకి ఎగిరిపోయేవారు

బివివి ప్రసాద్

27 ఆగస్టు 2025

కవిత : ఇందుకు వస్తారు

కలలు కనటానికి వస్తారు 
కొందరు ఈ మొరటు ప్రపంచంలోకి

పాపం, లోకమేమీ మొరటు కాదు,
సౌకుమార్యంలోకి మేలుకొనేందుకు
తగినంత నిద్రపోతూ వుంది
గూటిలో ముడుచుకున్న గొంగళిపురుగులా

ఎండ కాయటంలోని ఉత్సవ సౌరభం 
లోకం గమనిస్తుంది ఏదో ఒకనాడు,
గాలి వీయటం, చెట్లు చిగురించటం,
స్వచ్ఛ జలాలు సందడిగా పరుగులెత్తటం 
శ్రద్ధగా పరిశీలిస్తుంది

జీవులు ఒకటినొకటి తాకటమూ,
ఒకదాని చూపులోకి మరొకటి 
లాలనగా ప్రవహించటమూ,
ప్రార్థన గాక మరొకటి కాదని
ఎరుకలోకి తెచ్చుకొంటుంది 

స్వర్గం వేరే లేదనీ, 
సంతోషం ముందు కాలంలో దాగి లేదనీ,
ఉన్నాం మనం ఒకరి కొకరమని
తలుచుకోవటం కన్నా
పొందవలసిన అనుభవమేమీ లేదని 

మొరటు ప్రపంచం 
రంగురంగుల రెక్కలతో
నీరెండలో హాయిగా ఎగిరే కాలాన్ని 
ముందుగా సూచించటానికి
జీవితం కలగంటుంది వారిని

బివివి ప్రసాద్

26 ఆగస్టు 2025

కవిత : అమాయకం

కళ్ళలో కాస్త తడి ఉండటం వల్ల,
నమ్మకం మొక్క ఇంకా పచ్చగా ఉండటం వల్ల,
లోతులన్నీ తెరిచి ముఖం మెరిసేలా నవ్వటం వల్ల

అమాయకుడివి కావచ్చును,
నీతో ఆడుకోవచ్చని లోకం సరదాపడవచ్చును,
ఎలా బ్రతుకుతాడోనని జాలిచూపవచ్చును

ఎంత తెలివైనవారూ,
రేబవలు గెలుపుపై స్వారీ చేసేవారూ
నవ్వుతూనే బ్రతికింది లేదు,
తృప్తిగా వెళిపోయింది లేదు,
గుండె నిండుగా గాలి పీల్చి
ఇదిగో, బ్రతుకుతున్నానన్నది లేదు

ఎవరికి నచ్చినట్టు వారు ఇక్కడ,
ఎవరికి చాతనైనట్టు వారు
ఇలానే బ్రతకాలన్న శాస్త్రం లేదు,
ఉన్నా, మృతభావాలకి విలువలేదు

ఎంత గతాన్ని తలిస్తే అంతగా,
ఎంత భవితని ఊహిస్తే అంతగా 
ఊపిరాడదని తోచాక

ఈ నిముషంలో హృదయంతో జీవించటం కన్నా
పచ్చని ఆకుల్ని లోనికి పిలిచే కిటికీ ఏదీ లోకంలో..

బివివి ప్రసాద్

25 ఆగస్టు 2025

కవిత : ఫలితం

కొన్ని అక్షరాలని 
చీకటి ఆకాశంలో నక్షత్రాల్లా విరజిమ్మితే 
కొంతసేపటికి గెలాక్సీలుగా మొలకెత్తుతాయా

కొన్ని భయాలని
పరిసరాల్లోకి చీకటిపొగలా పంపిస్తే
కాసేపటికి దయ పాదముద్రలు వినిపిస్తాయా

కొన్ని ఉద్వేగాలని 
జీవితంలోకి వలలా విసిరితే
కొన్నాళ్ళకి బంధాలుగా ఫలిస్తాయా

కొన్ని సందేహాలని 
కాలంలోకి తెరచాపల్లా వదిలితే
ఏదో ఒకనాటికి జవాబుల కాంతుల్ని చేరుతాయా

ఇదంతా ఏమీ కాదు

లేకుండాపోయే చిన్ని ప్రార్థనని 
అనంతంలోకి చేతులు చాచి వినిపిస్తే
ఏనాటికైనా కల చెదిరి స్వస్థత పొందుతావా

బివివి ప్రసాద్
ప్రచురణ : మహా పత్రిక 25.8.25



24 ఆగస్టు 2025

కవిత : మెలకువొకటి

సున్నితమైన శబ్దమొకటి 
రాయిలా బిగుసుకుపోతున్న నిన్ను
నీటిలా మార్చుతుంది
అమ్మ ఒడిలోని విశ్రాంతిలోకి తీసుకుపోతుంది

పూలపై వాలిన బంగారు కిరణం,
ఎగిరే పక్షి రెక్కల నుండి లీలగా తాకిన గాలి,
ఎవరో ఎవరిపైననో దయగా నవ్వు,
హోరు తరువాత వికసించే నిశ్శబ్దం

నిన్ను చేయి పట్టుకొని
నీ దగ్గరికి చేర్చుతాయి

భారమవుతున్న జీవితాన్ని తలుచుకొని
ఏమీ లేదులే అంటావు శాంతంగా
ఓడిపోయే భయం నుండి 
బయటపడతావు తేలికగా కాసేపు

మరి కొంచెం సమయం అక్కడే ఉండమని
పసిపిల్లల్లా అడుగుతాయి ఈ అక్షరాలు
ఇందాక పరిచయమై అంతలో వెళిపోతున్న
మనిషిని చేయి వదలకుండా అడిగినట్టు

ఇదంతా చీకటేనేమో తెలియదు,
చీకటిని వెలిగించే వెలుతురు ఉందేమో కూడా
కానీ, ప్రేమ ఉంది చూసావా
ఆ సున్నితమైన శబ్దం గుర్తుకు తెచ్చినది

అది ఉంది

అది మాత్రమే ఉందా చూడమంటుంది
మబ్బుల వెనుకకి మాయమయే ముందు
విశాలమైన గగనంలో 
ఒంటరిగా సంచరించే చందమామ

బివివి ప్రసాద్ 
ప్రచురణ : స్నేహ ప్రజాశక్తి 24.8.25



23 ఆగస్టు 2025

కవిత : విడిపోయినప్పుడు

ఎవరి నుండన్నా విడిపోయినప్పుడు
చుట్టూ సీతాకోకలు స్వేచ్ఛగా ఎగురుతాయి,
దూరమైన నక్షత్రాలు చుట్టూ మూగుతాయి, 
చిన్న వానజల్లుని తోడు తెచ్చుకొని
ఇంద్రధనువు కావలించుకొంటుంది

ఎవరి నుండన్నా దూరం జరిగినప్పుడు
వారి మధ్య గాలి పిల్లకాలువలా ఒంపులు తిరుగుతుంది,
వారిలో మూసుకుపోయిన చిరునవ్వులు
ఉదయకాంతుల్లా పెల్లుబుకుతాయి,
గాలితెర తగిలి పటాలు ఎగరటం మొదలుపెడతాయి

ఒంటరిగా వచ్చి, వెళ్ళవలసిన ప్రాణాలివి,
తోడు దొరికినప్పుడల్లా ఊపిరాడకపోవడమేదో
లోపల వరదనీరు పెరిగినట్టు వ్యాపిస్తుంది

ఉదయం లేచి అంటాం గదా
ఈ కాంతి ఎంత శాంతిగా ఉంది,
ఈ పిట్టకూత ఎంత నిశ్శబ్దాన్ని తెచ్చింది,
ఈ గాలి ఎన్ని కలలు పోగొట్టి హాయినిచ్చింది అని

వాటి హాయిలోని రహస్యమిది
అవి ఒంటరిగా వస్తాయి, చరిస్తాయి
ఒంటరితనంలోని పరిపూర్ణత బోధించి వెళతాయి 

మనం ఒకరి లోపలికి ఒకరం
మరీ ఎక్కువ చొరబడుతున్నామేమో,
మీట నొక్కగానే దీపం వెలిగినప్పుడైనా 
గది నిండే కాంతితో కోల్పోయే 
శాంతిలోనైనా గమనించగలమా

ప్రచురణ : వీధి అరుగు సంచిక 2/10

బివివి ప్రసాద్



22 ఆగస్టు 2025

కవిత : నిష్కపట స్వప్నం

ఎవరైనా ఇద్దరు మనుషులు
నిష్కపటంగా ప్రేమించుకోవటం చూస్తే
కనులు చెమ్మగిలుతాయి,

ఎవరైనా నిష్కపటంగా 
ఒక జీవిని ప్రేమించటం చూస్తే
ముఖం ప్రసన్న మవుతుంది,

ఒక జీవి నిష్కపటంగా
జీవనానందంలో మునిగితే
హృదయం సారవంతమౌతుంది,

ఎవరికి ఎవరిపై నైనా
దయ, కృతజ్ఞత, క్షమ కలిగితే
అది చూడటం కోసం పుట్టినట్లు వుంటుంది,

ఆ క్షణంలో, పుట్టుక మూలంలోకి,
భూమిలోకి, తారల్లోకి ప్రయాణించినట్లు,
తెలియరాని సరిహద్దుల 
ఆవలికి విస్తరించినట్లు వుంటుంది

ఉన్నట్లుండి పనులు పక్కన పెట్టేస్తావు,
భయాలు మరిచిపోతావు,
కట్టుబాట్లు గాలికి వదిలేస్తావు,
బాధ్యతల్ని చూసి దయగా నవ్వుతావు

క్షణాల తర్వాత 
విధిగా మర్యాదలు తొడుక్కుంటావు కానీ,
నిర్మలమైన నీ ప్రేమా, 
స్వేచ్ఛా స్వప్నమూ ఫలిస్తున్నాయని
నీ లోపలి 
తరువాతి తరాల మనుషులు గుర్తుపడతారు

బివివి ప్రసాద్

21 ఆగస్టు 2025

కవిత : ప్రేమిస్తే..

మనుషులు ప్రేమించుకోవాలి పసిపిల్లల్లా
ద్వేషానికి వేయి కారణాలున్నా, 
ప్రేమకి ఒక కారణం చాలదా

ప్రేమిస్తే తేలుతాము, ద్వేషిస్తే మునుగుతాము
చాలదా, ప్రేమలోకి ఎగిరేందుకు

సూర్యుడెలా కాంతి వెదజల్లుతాడు
యుగాలుగా తరగకుండా 
భూమ్మీది చివరి జీవిపై మోహం వల్ల,
తన కాంతిలోని రూపారూపాలలో
తానే ప్రతిఫలించడం వల్ల

ఎలానో బ్రతుకుతాం
బాధల్లో, భయాల్లో, అరుదుగా సంతోషంలో,
నిన్నలో, రేపులో, తటాలున ఇవాళలో,
ఎలానో మరణిస్తాం నవ్వుతూనో, నవ్వలేకనో 

ఏం లేకున్నా ప్రేమిస్తూ వెళతావు చూసావా
తలవంచని గడ్డిపోచవి,
ఏమున్నా ప్రేమించలేకపోతావు చూసావా
కూలిన మహావృక్షానివి

లోకం ఏమిచ్చిందో కాదు, 
నువు ఏమివ్వగలిగావో విషయం కదా
ఉదయపు బంగారురంగు గాలుల్ని చూడు 
గాలుల్లో తేలే శాంతినీ, సౌఖ్యాన్నీ 

నీపై వాలిన ఈగని మృదువుగా విసిరి చూడు,
ఇదే ఈ క్షణాన లోకానికి నువు ఇవ్వగల కానుక

బివివి ప్రసాద్

20 ఆగస్టు 2025

ప్రేమతాత్విక జీవన సత్యం బివివి కవిత్వం : ప్రసాదమూర్తి

 ప్రమూ పరిచయాలు

|ప్రేమతాత్విక జీవన సత్యం బివివి కవిత్వం|

“రంగూ, రుచీ, స్పర్శా, వాసనా లేని జీవితాన్ని తలచావా గుర్తించావా తమకంగా కౌగిలించుకున్నావా
ఊరకనే జీవితమైపోయావా ఎప్పుడైనా” (ఊరికే జీవితమై..)

         ఎగ్జిస్టెన్షియలిజం అంటే ఇప్పుడు తెలుగులో వాడుకోలో ఉన్న అర్థం వేరు. ఇక్కడ దానికి కుల మత ప్రాంత లింగ భాషాపరమైన అస్తిత్వ వాదంగా అది స్థిరపడింది. వాస్తవానికి ప్రపంచ తత్వవేత్తలు నిహిలిజం, ఎగ్జిస్టెన్షియలిజం, అబ్సర్డిజమ్- ఇలాంటి ఇజాలకు చెప్పిన అర్థం వేరు. జీవితానికి అర్థం ఏమిటి అనే విషయాన్ని పట్టుకొని, దేవుడు దాకా వెళ్లి, తిరిగి జీవితం దాకా వచ్చి, మానవుడి ఈ అస్తిత్వానికి దేవుడికి సంబంధం లేదని నిర్ణయాలు చేసుకొని, ఇది అర్థం లేని జీవితం అని నిర్ధారించుకొని, అది నిజమే కానీ నిరాశ వద్దని, అర్థం లేని జీవితాన్ని అర్థవంతం చేసుకోవడం నీ చేతుల్లోనే ఉందని బుద్ధుడు మొదలుకొని నీషే, సార్త్రే దాకా చాలామంది తత్వవేత్తలు, కాఫ్కా, కామూ, దోస్తయేవ్ స్కీ లాంటి రచయితలు ఎగ్జిష్టియన్షియలిజానికి అసలైన నిర్వచనాన్ని చివరికి నిశ్చయించారు. దేవుడి మీద నమ్మకం ఉన్నవారు, కాస్త ఊగిసలాటలో ఉన్నవారు కూడా జీవితాన్ని అర్థవంతంగా జీవించాలనే విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. జీవితం పట్ల అపారమైన ప్రేమ, నమ్మకంతోనూ, అనేకానేక అంతుచిక్కని విషయాల పట్ల విస్మయంతోనూ ఉంటూనే జీవితాన్ని సహస్ర బాహువులతో ఆలింగనం చేసుకొని అపార లౌకిక అనుభవంతో ఈ జన్మను ధన్యం చేసుకోవాలన్న సందేశాన్ని మనకు ఇచ్చినదే అసలైన ఎగ్జిస్టెన్షియలిజం. దీనికి తెలుగులో సంపూర్ణంగా ఒక కవిని ఉదాహరించాలంటే బివివి ప్రసాద్ నే చూపించాలి.

         చాలా రోజులుగా ఇతనితో నాకు స్నేహం ఉన్నా, ఇతని కవిత్వాన్ని స్వయంగా వింటూ లేదా చదువుతూ ఉన్నా, ప్రసాద్ కవిత్వంలోని మూల సూత్రం అంతుచిక్కకుండా కొంతకాలం నాతో ఆటలాడుతుంది. ఆ సూత్రం కొస దొరికిన తరువాత, దాన్ని లాగుతున్న కొద్దీ మనం పైన చెప్పుకున్న జీవితపు అసలైన అస్తిత్వవాదంలోని సౌందర్య రహస్యం ఇంకా ఇంకా బయటపడి నన్ను సిసలైన రసానుభూతికి లోను చేసింది. ఏ కవిత పట్టుకున్నా జీవితంతో మొదలై జీవితంతో నడుస్తూ జీవితం చుట్టూ తిప్పుతూ జీవనలాలస లోని రహస్య మూలాలను తడుముతూ జీవితం అంచులు దాకా తీసుకువెళ్లి అక్కడ నిలబెడుతుంది. ఇది కదా అస్తిత్వవాదం అంటే అనుకున్నాను.

“ ఒక్కరోజు గడిపి వెళ్లిపోతే చాలదా ఇక్కడ అనుకుంటావు చాలాసార్లు 
 మరల మరల ముఖాలు మార్చుకొని ఎదురవుతున్న అవే అనుభవాలను తలపోస్తూ
 విశాలత్వమేదో నిన్ను పిలుస్తున్నట్టుంటుంది 
వెలిసిపోయిన దృశ్యాల్లోంచీ, శబ్దాల్లోంచీ, దుమ్ము పట్టిన బంధాల్లోంచీ బయటకు రమ్మని”(ఆ దిగులు-ఊరికే జీవితమై)

        ఇటీవల ప్రసాద్ ఫేస్బుక్లో వరుసగా పెడుతున్న కవితల పరంపరను చూసిన తర్వాత ఈ మధ్యనే ఇతను వెలువరించిన “ఊరికే జీవితమై..” అనే కవితా సంపుటిని మరోసారి చేతుల్లోకి తీసుకున్నాను. అది భౌతికంగా చూడడానికి ఒక కాగితాల కట్టే అయినా అది ఒక నదిలా మనల్ని తనలోకి లాక్కొని ఒక మహాసముద్రంలోకి తీసుకువెళ్లి ఆ అలల మీదుగా దిగంతాల వైపు నడిపించి ఇదే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం అని మనకు చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఏ కవితను తడిమినా ఒక పసిపాపను ఎత్తుకున్నట్టో.. ఒక పూల మొక్కను పట్టుకున్నట్టో.. ఒక మబ్బు తునకను  నెత్తి మీద పెట్టుకున్నట్టో.. జీవితం జీవితం.. కేవలం జీవితం తప్ప జీవితానికి మరొక అర్థం లేదనే పరమార్ధాన్ని తెలుసుకొని సంబరంగా ఎగిరినట్టు అనిపిస్తుంది. 

“నీ చుట్టూ పసిపిల్లల్లా నిలిచిన 
దృశ్యాల్ని, శబ్దాల్ని, స్పర్శల్ని 
ఊరికే ఆగి, ఊరికే చూడు 
కాసేపు జీవితాన్ని, 
నువ్వు జీవించటాన్ని” (ఆగి చూడు-ఊరికే జీవితమై)

          ఈ కవిత్వం, పైపైన చూస్తే ఇది కేవలం వ్యక్తిగతమైనదిగా, వ్యక్తుల విడివిడి జీవితాల ఆనందాలకు సంబంధించినదిగా కనిపిస్తుంది. దాంతో లోకంలోని ఘర్షణలు దోపిడీలు పోరాటాలు వగైరా వగైరాలతో సంబంధం లేని కేవలం వ్యక్తినిష్టమైన కవిత్వంగా దీన్ని కొట్టి పారేసే అవకాశం ఉంది. అందమైన జీవితం వెనక కాలమంతా సాగిన అనంత మానవ సంగ్రామాల చరిత్ర ఉందని, ఈ కవికి దానితో సంబంధం లేదనే తీర్మానాలు కూడా చేయవచ్చు. కానీ  తర్కాన్ని పక్కనపెట్టి వాస్తవాన్ని చూస్తే, ఎవరి జీవితం వారిదే. జీవితం పట్ల ఎవరి అనుభవాలు వారివే. అనేకానేక దారుల్లో చీలిన మనుషులు తమవైన అనుభవాలతో జీవితాన్ని పండించుకోవాలనే పరమార్థం అవగతం చేసుకుంటే, బివివి కవితల్లోని అంతరార్థం మనకు బోధపడుతుంది. జీవితానికి ఏ అర్థమూ లేదు, దీన్ని ఇలా జీవించాల్సిందే అనే నిరాశవాదాన్ని ముందుకు తెచ్చిన షొపన్ హాయర్ లాంటి తత్వవేత్తలను చూశాం. వ్యక్తి నైతిక జీవనం, సామూహిక సమున్నత జీవన చైతన్యానికి దారులు తీయాలని దారి చూపిన బౌద్ధ ధర్మసారం చూశాం. పూర్వం ప్రసేనుడనే రాజు తన భార్య మల్లికను, నీకంటే అధికంగా నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె మహారాజా నాకంటే అధికంగా నేను ఎవరినీ ప్రేమించలేదు అని చెప్తుంది. దానికి ప్రసేనుడు నా విషయంలో కూడా ఇదే సత్యం అంటాడు. అంతేకాదు అదే విషయాన్ని బుద్ధుడుతో ప్రస్తావిస్తాడు. అప్పుడు బుద్ధుడు, ‘నిజమే, మనిషి తనకు తానే ప్రీతిపాత్రుడు. కావున తనపై తనకున్న ప్రేమనెరిగీ, మరొకరికి ఎవరికీ హాని తలపెట్టరాదు’ అంటాడు(బుద్ధ ధర్మసారం- పి. లక్ష్మీ నరసు). వ్యక్తి నైతికత, ఆచరణలో పరోపకారంగా రూపొందడం బౌద్ధంలోని అతి కీలకమైన అంశం. మన భారతీయ తాత్విక మూలాలున్న ఈ భౌద్ధ ధర్మసారంలోని ఏదో వెలుగు బివివి ప్రసాద్ కవిత్వంలో తొణికిసలాడుతోంది. తాను చూస్తున్న జీవన సౌందర్యాన్ని, జీవితంలో ఆ సౌందర్యం లేకున్నా దాన్ని మనం సృష్టించుకోవాలి అన్న జీవన సత్యాన్ని అందరితో పంచుకోవాలి అన్న అవ్యాజమైన ప్రేమతో ఇతను తన కవిత్వ ఆవరణను విస్తరించుకుంటూ వస్తున్నాడేమో.  తర్కాలు విడిచి ఈయన కవిత్వంలో ‘ఉరికే జీవితమై..’ ఊగితే ఒక జీవితానికి సరిపడా ఊరట మనకు దొరుకుతుంది.

“జీవితం ఉందనిపిస్తే 
చేతులు చాపి దగ్గరకు తీసుకుని అనుభవించు,
 జీవితం ఏమిటనిపిస్తే 
దాని భుజంపై చేయి వేసి నిశ్శబ్దంగా కూర్చో, జీవితం లేదనిపిస్తే ఊరికే ఖాళీగా ఉండు
చూడు పక్షులు ఎగురుతున్నాయి సూర్యుడు వాలుతున్నాడు 
తూర్పు ఆకాశంలో కాసేపటికి 
చంద్రోదయం కాబోతోంది”(సాధన-ఊరికే జీవితం)

    విషయంలో వైవిధ్యం లేకపోతే కవిత్వంలో వైవిధ్యం ఉండదు అనే వాదన కూడా ఒకటి ముందుకు వస్తుంది. జీవితం ఒకటే అయినా జీవితంలోని వేలవేల షేడ్స్  ని వివిధ  కవితల్లో ప్రతిఫలింప చేయడం వల్ల ఈ కవిత్వానికి వైవిధ్య లోపం లేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఇదంతా పక్కన పెట్టి, ఎంత తత్వమైనా.. వ్యక్తిగతమో సామాజికమో అదేమైనా.. అందులో కవిత్వం మనల్ని తనలోకి లాక్కుంటుందా లేదా అనేది అంతిమంగా మనం తేల్చాల్సిన విషయం. కొన్నిచోట్ల ఇతడు ఏవేవో మీమాంసలలో కొట్టుకుపోతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని వైరుధ్యాలుంటాయి. “మనుషులతో విలువలతో కాదు 
ఊరికే కలిసి ఉండాలి జీవించటంతో” అంటాడు ఒకచోట. ఇదేమిటి అని అతన్ని కొంచెం ప్రశ్నార్థకంగా మనం చూస్తామో లేదో, అంతలోనే ఇలా అంటాడు-
“ చెట్లు జీవిస్తున్నాయి నీతో కలిసి 
నీరు జీవిస్తోంది, గాలి జీవిస్తోంది, ఆకాశం జీవిస్తోంది, కాలం జీవిస్తోంది
నీవు కలిసిన వారిలోంచి,
 విడివడిన వారిలోంచి,
 జీవితం తనను తాను జీవిస్తోంది 
కలలాగా నిన్ను తాకుతోంది”. ఈ మాటలతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. ముందే చెప్పుకున్నాం కదా, జీవితాన్ని జీవితంగా కాకుండా, సమస్త ప్రకృతిలో భాగంగా జీవితాన్ని జీవించడంలోనే అర్థం పరమార్థం ఉంది. జీవితంలో ఉన్న వైరుధ్యాలు, మీమాంసలు, తర్కవితర్కాలూ వీటన్నింటికీ కవిత్వం ఏమీ అతీతం కాదు. ఏ విషయంలో ఎటు కొట్టుకు వెళ్ళినా, కవిత్వం విషయంలో మాత్రం ఇతను పట్టు తప్పడు. గోర్కీ, టాల్ స్టాయి గురించి చెబుతూ, ‘దేవుడి మీద నాకు నమ్మకం లేదు గాని టాల్ స్థాయి నాకు దేవుడిలా కనిపించాడు’ అంటాడు. దేవుడి మీద మరి నాకు కూడా నమ్మకం లేదు కానీ బివివి కవితా పంక్తులు అతని మాటల్లోనే చెప్పాలంటే ‘దేవుడు చినుకుల భాషలో మాట్లాడుతున్నట్టు, చల్లగా, నెమ్మదిగా, ఉల్లాసంగా ఉన్నాయి’. తెలుగులో తాత్వికతను కవితా స్థాయికి తీసుకువెళ్లిన సంపూర్ణ, సమర్ధ కవిగా బివివి నిలిచిపోతాడు. మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు.
           ……………….
ప్రసాదమూర్తి
8499866699

కవిత : ప్రేమ కథ

కొత్తగా మేలుకున్న ఒక స్త్రీ
కొత్తగా మేలుకున్న ఒక పురుషుడిని 
ఆకర్షించినపుడు 

అతను ఆమెతో అన్నాడు
నిన్ను కదా ప్రేమిస్తున్నాను,
ఇకపై జీవితమంతా నీతో గడపాలనివుంది,

ఆమె ఏమీ మాట్లాడలేదు,
నవ్విందో, లేదో తెలీదు, ఆమెకి కూడా
సూటిగా చూసింది
అతని కన్నులలోకి, కలల్లోకి, కాంతిలోకి
తరాలుగా స్త్రీ పురుషుణ్ణి చూసిన చూపు

అతను వెదికాడు 
ఆమె కళ్ళలో ప్రతిఫలించే పురాస్మృతుల్లో
యుగాలుగా పురుషుడు స్త్రీలో వెదికేది

ఆమె సరేనన్నదో, లేదో తెలియలేదు,
ఏమనాలో ఆమెకీ తెలియనట్లే

సరేనని వినలేని దుఃఖంతో అతను,
అనలేని దుఃఖంతో ఆమె,
కొత్తగా మేలుకున్న బరువైన రోజుల్లోకి ఇద్దరూ

ఉదయాస్తమయాలు 
జీవుల్ని మేల్కొలిపి, జోకొడుతున్నాయి,
చీకటివెలుగుల దాగుడుమూతలాటలోకి
తెలియని ఖాళీలోంచి వచ్చేవారు వస్తున్నారు,
ఖాళీలోకి వెళ్ళేవారు వెళుతున్నారు

కాలం పండిన ఒక సాయంసంధ్యవేళ 
వారు ఎదురయారు
ఆమె చూపులో స్త్రీ లేదు,
అతని చూపులో పురుషుడు లేడు 

కాలం, కలలూ రాలిపోయిన శాంతిలో
ఒకరినొకరు చూసినపుడు,
ఒకే జీవనానందం లోపల
వారెపుడూ కలిసి ఉన్నట్లు కనుగొన్నారు

బివివి ప్రసాద్