14 నవంబర్ 2026

కవిత : తప్పిపోయిన కవిత

ఇవాళ తొందరపనుల ఉదయాన
ఒక కవిత మృదువుగా, మెల్లగా నీ లోనికి వచ్చింది
తనని వేచి ఉండమని, చోటు చూపించి
నీ పనుల తొందరలో మునిగిపోయావు

కవిత నీ కోసం చాలాసేపు ఎదురుచూసింది,
నీ పనుల తొందర గమనించింది,
సున్నితమైన ఆ కవిత నొచ్చుకుంది,
ఇతను తొందరలో ఉన్నాడు
ఇప్పుడు పలకరించి, పొరపాటు చేశానా అని తలచింది
నిశ్శబ్దంగా, ఉన్నచోటు నుండి మాయమైంది

పనుల తొందర ముగిశాక,
ఖాళీగా ఊపిరి విడిచే సమయాన
అతిథిలా వచ్చిన కవిత గుర్తుకువచ్చింది
ఉలికిపడి తనను కూర్చోమన్న చోటు వెదికావు 

తను లేదు, మాయమైంది
ఉదయం నువు దర్శించని బంగారుకిరణంలా,
నువు తాకని చల్లని సెలయేటి నీటిలా,
వినేలోపు నిశ్శబ్దంలో కరిగిన కోయిల కూతలా,
అనుమతి లేక గర్భంలోంచి మరలిపోయిన బిడ్డలా

వెదికావు, జ్ఞాపకాలు వడబోశావు,
వాన తర్వాత గోడల మీది నీటి మరకల్లా 
తను విడిచిపోయిన శబ్దాల గుర్తులేమన్నా దొరుకుతాయా అని తడిమావు
నీ చేతివ్రేళ్ళకి ఖాళీ మినహా ఏమీ తగల్లేదు

ఒక కవిత నుండి నిన్ను నువు తప్పిపోయిన ఈరోజున
నీ నుండి మరికాస్త తప్పిపోయావు
మరలా ఎన్ని యుగాలు, పాలపుంతలు గడవాలి
తానూ, నువ్వు కలవటానికి

12.5.26 12.02 రాత్రి
ప్రచురణ : ఈమాట 1.11.2026

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి