16 నవంబర్ 2026

కవిత : నిదురించే వేళల..

గది తలుపులు మూతపడతాయి
వాటితో, బయటి వెలుగు కూడా..
కనురెప్పలు మూతపడతాయి
వెనుక, ప్రపంచం మూతపడుతుంది

వెలుగు చిమ్మిన మాయాజాలం
మిగిల్చిన గాయాలు, చేదు ఆనందాలు
అడపాదడపా ఆకులతో రాలే,
పూవులతో చిగురించే అమాయకత్వాలు
నీ నుండి సెలవు తీసుకుంటాయి

ఒకటే గాఢమైన నిద్ర, 
చిక్కని చీకటి, బరువైన శ్వాస 
నిన్ను నీలో కరిగించి
ప్రపంచదుఃఖం నుండి విముక్తుడిని చేస్తాయి

మరలా మేలుకొనే వరకూ 
నీదైన శూన్యలోకం నీది
నీవైన రంగుల కలలు నీవి
నీదైన నిండైన ఏకాంతం నీది

ఎవరూ, ఏదీ నీలోకి రాని
అమృత సమయాలలో
నిజంగా నీకేమనిపిస్తుంది
ఏమాశించి మళ్ళీ
ఈ దుఃఖంలోకి తలుపులు తెరుస్తావు

బివివి ప్రసాద్
మహా పత్రిక, 16.11.26



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి