12 నవంబర్ 2026

కవిత : సందిగ్ధం

అనుబంధం ఏదైనా కావచ్చును
నీతో తనకి ఉద్వేగం, తనతో నీకు లెక్కలు
లేదూ, తనతో నీకు ఉద్వేగం, నీతో తనకి లెక్కలు
మిగలటం విషాదం

సంధ్యకాంతులు లీనం కాకముందే
చీకటి తెర వాల్చినట్లు,
ఇంద్రధనువులు ఆరిపోక ముందే
నీ వాకిటిలోకి వరదనీరు చేరినట్లు,
గర్భస్థశిశువు లోకం చూడకముందే
మృత్యులోకాలు చేరినట్లు

నీవైపు అనుభవం ఒకలా,
అవతలి అనుభవం మరొకలా
రెండు కలవని అనుభవాలని కలపబోయి
విరిగిన పాలలాంటి జీవితానుభవం

ఇప్పుడీ జీవితాన్ని ఏం చేసుకోవాలి,
ఎదుటనున్న కాలాన్ని ఎలా గడపాలి
నువ్వుకున్నట్లు ఏదీ లేదు,
ఉన్నది నువ్వనుకున్నది కాదు

అంత పొడీ, తడీ కాని బంధాల మధ్య,
అంత నమ్మలేని, అనుమానించలేని మనుషుల మధ్య,
అంత ఆసక్తీ, నిరాసక్తీ లేని అనుభవం మధ్య
ధైర్యమూ, భయమూ లేని, లేదా రెండూ ఉన్న
ప్రేమా, ద్వేషమూ లేని, లేదా లేదా రెండూ ఉన్న

జీవితాన్ని ఏ ఎడారిలో ఒంపాలి,
లేదా ఏ మొక్కలకి నీరుగా పోయాలి
చివరికెలా ముగించాలి

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి