అప్పుడపుడు, మనుషులు ఆవిరై,
ఇంద్రధనువులుగా మారితే బావుండేది,
సారమై, మొక్కలకు పూలై పూస్తే బావుండేది,
ఏకాంతాల్లోంచి సీతాకోకలై ఎగిరితే బావుండేది,
నీలిమేఘాలపై ఉదయకాంతి మంత్రించే
నారింజరంగుల పగటికలలైతే బావుండేది
అప్పుడపుడు, వారి వ్యూహాలు దారి తప్పి
వాళ్ళని ప్రేమలోకాల్లోకి నడిపిస్తే బావుండేది,
వాళ్ళ తెలివితేటలు చెరిగిపోయి
వాళ్ళు పసినవ్వుల్లోకి ఒలికిపోతే బావుండేది,
వాళ్ళ మహాభయాల్లోకి
ఎవరైనా మెలకువలా చొరబడి 'అదంతా ఏం లేదని '
వాళ్ళని చల్లనిగాలులు చేసేస్తే బావుండేది
అప్పుడపుడు మనుషులు
ఏ దివ్యమైన శాపంలాంటి వరం వల్లనో
ఫలానా, ఫలానావాళ్ళమని మరిచిపోయి
ఉత్త మనుషులుగా, ఉత్త జీవులుగా,
ఉత్త జీవితంలా మిగిలిపోతే బావుండేది
ప్రేమ మినహా మరేమీ కాలేని
స్థాణువులైపోతే బావుండేది,
నిలువునా నీరైపోతే బావుండేది,
పలుచని గాలైపోతే బావుండేది,
ఖాళీ గగనమైపోతే బావుండేది
అప్పుడపుడు ఇది మనుషుల్లేని లోకమై
ఊపిరి తీసుకుంటే బావుండేది
బివివి ప్రసాద్
మెహఫిల్, మన తెలంగాణ 16.11.26

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి